అన్నదాత దోపిడీ..

ABN , First Publish Date - 2021-05-12T06:18:03+05:30 IST

జంగారెడ్డిగూడెం మండలంలో రబీలో 3500 ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు ప్రతి ఎకరానికి 40 నుంచి 45 బస్తాల వరకు పండింది.

అన్నదాత దోపిడీ..
ధాన్యం తడిచిపోవడంతో తిరగ వేస్తున్న రైతులు

కొనుగోలు కేంద్రాల్లో చుక్కెదురు..

సంచులు లేవన్న సాకుతో నిరాకరణ

1121 రకం నూకయిపోతున్నాయని మిల్లర్ల సాకు

అకాల వర్షాలతో బెంబేలు.. దళారులకే అమ్మకాలు..  

  రైతులకు దళారులే దిక్కయ్యారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం దళారులకు కనక వర్షం కురిపిస్తోంది. ఫలితంగా ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు నష్టాల పాలవుతున్నాడు. ఽప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అక్కడ గోనె సంచులు లేకపోవడంతో   పంటను దాచుకోలేని పరిస్ధితుల్లో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. తూకాల జిమ్మిక్‌లు, సాకుల పేరుతో ధాన్యం ధరలు తగ్గించి దళారులు రైతుల కళ్లల్లో దుమ్ముకొడుతున్నారు.

జంగారెడ్డిగూడెం, మే 11: జంగారెడ్డిగూడెం మండలంలో రబీలో 3500 ఎకరాల్లో  వరి సాగు చేశారు. దాదాపు ప్రతి ఎకరానికి 40 నుంచి 45 బస్తాల వరకు పండింది. ప్రభుత్వం చెప్పినట్టే 1121 రకం ధాన్యంను రైతులు పండించారు. దిగుబడి బాగుండటంతో ఈ ఏడాది లాభసాటిగా సాగుతుందని భావించిన రైతుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు  చల్లినట్లయ్యింది. మండలంలో మొత్తం సొసైటీలు, వెలుగు కార్యాలయాల పరిధిలో మొత్తం 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దళారుల చేతుల్లో మోసపోవద్దు అందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యంను విక్రయించాలని ప్రగల్బాలు పలికారు. చివరికి రైతు చేతికి పంట వచ్చి సొమ్ము చేసుకునే సమయానికి తమ వద్ద సంచులు లేవని కొనుగోలు కేంద్రాలన్నీ చేతులెత్తేశాయి. దీంతో పంట కోతలు కోసి పొలం గట్ల వద్దే దాచుకోవలసిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో గడచిన 15 రోజులుగా ప్రతి రోజు ఏదో సమయంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో ధాన్యంను ఆరబోసుకోవడం, తడిచిన ధాన్యం చూసి  కన్నీరు  కార్చడం రైతుల వంతయింది.  కార్యాలయాల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ఫలితం లేకుండా పోతుంది.

దళారులదే రాజ్యం

రైతుల నిస్సహాయ స్థితిని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సంచులు కొరత, పరుగులు పెట్టిస్తున్న వాతావరణంతో పండించిన పంటను ఎక్కడ దాచుకోవాలో అర్ధం కాని పరిస్ధితిలో ఉన్న రైతుల వద్ద నుంచి తక్కువ ధరకే ధాన్యంను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాలు రూ.1888 ఉంది. అదే 75 కేజీలైతే రూ.1410ల వరకు ఉంటుంది. కామన్‌ రకం క్వింటాలు రూ.1868 ధర ఉంది. అయితే దళారులు 75 కేజీలు కేవలం రూ.1200 నుంచి రూ.1300ల మధ్యలోనే కొనుగోలు చేస్తున్నారు.  అలాగే 1121 రకం ధాన్యం గింజ ముక్కలైపోతోందని  సాకు చూపుతున్నారు. ఇక దళారుల బెడద భరించలేక మిల్లర్లు వద్దకు వెళ్తే అక్కడ 1121 రకం ఽనూక అవుతుందని తాము కొనుగోలు చేయమని తిరస్కరిస్తున్నారు.

రైతుల నుంచి కొనుగోలు చేయని మిల్లర్లు?

నల్లజర్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు దళారులకు, మిల్లర్లకు ఉపయోగపడుతున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక్క బస్తా ధాన్యం కొనుగోలు చేయలేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. మండలం నుంచి  ధాన్యం కొనుగోలు చేయవలసిన మిల్లర్లు నేరుగా దళారుల నుంచే కొనుగోలు చేస్తున్నారు. దళారుల నుంచి కొనుగొలు చేసిన ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించినట్టు జిల్లా అధికారులకు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారని పోతవరం రైతు సంఘం నాయకుడు పెండ్యాల వీరరాఘవులు ఆరోపించారు.  మిల్లర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం కొనుగొలు చేస్తే రైతులకు బస్తాకి 1450 చెల్లించవలస్సి వస్తుంది. అదే దళారుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తే మిల్లర్లు దళారులకు చెల్లించేది బస్తాకి  రూ.1200. ఇక్కడ దళారి రైతు వద్ద కొనుగోలు చేసేది బస్తా రూ1100. దళారికి బస్తాకి 100 లాభం వస్తే మిల్లర్లుకు బస్తాకు రూ. 250కు తక్కువగా ధాన్యం చేరుతుంది. దీంతో మిల్లరు దళారులను నమ్ముకుంటున్నారు.  

Updated Date - 2021-05-12T06:18:03+05:30 IST