డాకిన్యాం భీమశంకరం..

ABN , First Publish Date - 2020-03-29T08:06:36+05:30 IST

పూర్వం సహ్యపర్వత శిఖరాల మీద కర్కటుడు అనే రాక్షసుడు, అతడి భార్య పుష్కసి ఉండేవారు. ఆ రాక్షసదంపతులకు కర్కసి అనే కూతురు పుట్టింది. ఆమెను విరాధుడు అనే రాక్షసుడికిచ్చి పెళ్లి చేశారు. కొంతకాలం తర్వాత...

డాకిన్యాం భీమశంకరం..

పూర్వం సహ్యపర్వత శిఖరాల మీద కర్కటుడు అనే రాక్షసుడు, అతడి భార్య పుష్కసి ఉండేవారు. ఆ రాక్షసదంపతులకు కర్కసి అనే కూతురు పుట్టింది. ఆమెను విరాధుడు అనే రాక్షసుడికిచ్చి పెళ్లి చేశారు. కొంతకాలం తర్వాత.. ఆ ప్రాంతానికి అరణ్యవాసానికి వచ్చిన శ్రీరాముడు ఆ విరాధుడిని సంహరించాడు. వైధవ్యం రావడంతో కర్కసి బాధపడింది. రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుడి పట్ల మక్కువ పెంచుకుంది. కుంభకర్ణుడు నిద్ర లేచినప్పుడు ఈ విషయం తెసుకుని ఆమె వద్దకు వెళ్లాడు. ఆమెను స్వీకరిస్తానని చెప్పి బలాత్కారం చేసి వెళ్లిపోయాడు. ఫలితంగా ఆమెకు ఒక కొడుకు పుట్టాడు.


ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడు, రాముణ్ని సంహరించగల శక్తిమంతుడు కావాలనే కోరికతో కర్కసి అతణ్ని ‘భీమః భీమః’ అని పిలవడం ప్రారంభించింది. ‘భీమః’ అంటే గొప్ప బలం ఉన్నవాడని అర్థం. వాడు పెద్దవాడయ్యాక కర్కసి తన కథను కొడుక్కి చెప్పి.. ‘రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు విష్ణువును సంహరించాలి’ అని చెప్పింది.  విష్ణువు కోసం భీముడు లోకాలన్నీ వెతికాడు. కానీ శ్రీహరి సర్వవ్యాపకుడని.. అందరిలోనూ ఉన్నాడని తెలియక ఆయన గురించి వెతికి వెతికి విసిగిపోయాడు. ఆ కోపంతో.. ఎక్కడ భక్తులు కనపడినా వారి తల తీసేయాలని ఆజ్ఞాపించాడు. ఈ క్రమంలోనే.. కామరూప రాజ్యాన్ని పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజును ఓడించి తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. ఆ సుదక్షిణుడు కారాగారంలోనే కొద్దికొద్దిగా మట్టి తీసుకొచ్చి పార్థివలింగం చేసి ప్రతి రోజూ లింగార్చన చేస్తుండేవాడు. శివపూజకు కావాల్సినవాటన్నింటినీ మనస్సులోనే సృష్టించి పూజ చేస్తుండేవాడు. దీంతో కాపలాదారుల వెళ్లి భీముడికి ఆ విషయం చెప్పారు. ఆ మాట వినగానే అతడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే కారాగారానికి వెళ్లాడు. ‘నీవు శివలింగానికి అర్చన చేస్తున్నావని తెలిసింది. నాకన్నా గొప్పవాడెవడు? ఇప్పుడే ఈ శివలింగాన్ని కత్తితో ఛిద్రం చేస్తాను చూడు’ అని చంద్రహాసం తీసి శివలింగంపైకి ఎత్తాడు. వెంటనే సుదక్షిణుడు పరమేశ్వరుణ్ని ప్రార్థించాడు. భీముడు పటపటా పళ్లు కొరుకుతూ తన చేతిలో ఉన్న చంద్రహాసాన్ని విసరగానే.. అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న పరమాత్మ, మాంసనేత్రాలకు కనపడని పరమాత్మ.. సాకార రూపాన్ని పొందాడు. సాకారుడై పార్థివ లింగంలోంచి బయటకు వచ్చాడు. ‘నా భక్తుల జోలికి వెళ్లేవాళ్లను ఉపేక్షించను’ అంటూ వాడి కుత్తుక (గొంతు) మీద పొడిచి సంహరించాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడు తన పేరు తానే.. ‘నేను భీముడును’ అని చెప్పుకొన్నాడు. భీముడంటే అద్వితీయ పరాక్రముడు. అలా వెలసిన స్వామే..  జ్యోతిర్లింగ భీమశంకరుడు. 


యం డాకినీశాకినీకాసమాజై నిషేవ్యమాణం పిశితాశనైశ్చ

సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భూతహితం నమామి

అని ఆ స్వామిని ప్రార్థించాలి. ఆ స్వామి.. కోరుకున్నది ఏదైనా ఇవ్వగలిగినవాడు. ఒక్కసారి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి ‘డాకిన్యాం భీమశంకరం’ అని ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ మనల్ని కాపాడి ఎటువంటి దుఃఖాలూ రాకుండా చేస్తాడు.

                                              - చాగంటి కోటేశ్వరరావు శర్మ


Updated Date - 2020-03-29T08:06:36+05:30 IST