తిరుగులేని ‘లీడర్‌’!

ABN , First Publish Date - 2020-08-15T05:30:00+05:30 IST

ప్రియా మాల్యా... ఐబీఎంలో సాధారణ ఉద్యోగిగా చేరిన ఆమె నేడు డెవలపర్‌ ఎకో సిస్టమ్‌ గ్రూప్స్‌, ఐబీఎం ఇండియా ‘లీడర్‌’. టెక్నాలజీని ప్రజలకు దగ్గర చేయడంలో ఆమె విజయం సాధించారు. కొవిడ్‌-19 సంక్షోభానికి సైతం టెక్నాలజీ పరిష్కారాలను అన్వేషిస్తున్నారు...

తిరుగులేని ‘లీడర్‌’!

ప్రియా మాల్యా... ఐబీఎంలో సాధారణ ఉద్యోగిగా చేరిన ఆమె నేడు డెవలపర్‌ ఎకో సిస్టమ్‌ గ్రూప్స్‌, ఐబీఎం ఇండియా ‘లీడర్‌’. టెక్నాలజీని ప్రజలకు దగ్గర చేయడంలో ఆమె విజయం సాధించారు. కొవిడ్‌-19 సంక్షోభానికి సైతం టెక్నాలజీ పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ ఏడాది ‘జిన్నోవ్‌’ అవార్డును అందుకున్న ఆమె  విశేషాలు కొన్ని...


పధ్నాలుగేళ్ల క్రితం సంఘటన ఇది. ప్రియా మాల్యా ఐబీఎంలో చేరి నెల మాత్రమే అయ్యింది. తొలిసారి మేనేజర్‌ను కలిశారామె. తన దీర్ఘకాలిక లక్ష్యాలను స్లైడ్‌ ద్వారా వివరించమని మేనేజర్‌ ప్రియను అడిగారు. ఆమె కొన్ని క్షణాలు ఆలోచించి ఒక స్లైడ్‌ను వేసింది. అందులో ఒకే ఒక పదం ఉంది. అదేమిటో తెలుసా... ‘లీడర్‌’! ఆమె సమాధానానికి మేనేజర్‌ ఎంతో ఆనందించారు. ‘లీడర్‌’ కావాలనే ఆమె సమాధానానికి ‘సో యాంబిషియస్‌. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌’ అన్నారు. ఏళ్లు గడిచాయి... ‘లీడర్‌’ అనే ఆమె లక్ష్యం మాత్రం మారలేదు. ఐదేళ్లుగానీ, పదేళ్లుగానీ ఆమె లక్ష్యం తమ సంస్థ గ్లోబల్‌ లీడర్‌ అవాలన్నదే. ఆ కసి, పట్టుదలే ప్రియను ఉన్నత స్థానాలను అధిష్టించేలా చేసింది. ఆ లక్ష్యమే నేడు ఆమెను ‘ఐబీఎం ఇండియాస్‌ డెవలపర్‌ ఎకోసిస్టమ్‌ గ్రూప్స్‌’నకు నాయకురాలిని చేసింది.


‘జిన్నోవ్‌’ అవార్డు...

 ఈ ఏడాది ‘జిన్నోవ్‌’ అవార్డు నెక్ట్స్‌ జనరేషన్‌ ఉమెన్‌ లీడర్స్‌ కేటగిరిలో ప్రియా మాల్యాకు వచ్చింది. తన కలలను నిజం చేసుకోగలిగానంటే తనకున్న సపోర్టు సిస్టమే కారణమని అంటారామె. ‘నేను స్త్రీని కాబట్టి డిఫరెంట్‌ అన్న భావం నాలో ఎన్నడూ కలగలేదు’ అని ప్రియ తెలిపారు. ప్రియ ఐబీఎంలో 2006 ఏప్రిల్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె ఇండియా, దక్షిణ ఆసియాలోని డెవలపర్‌ బేస్‌ని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేస్తున్నారు. 




ఈ సవాళ్లు ఒక ఛాలెంజ్‌...

స్టూడెంట్‌ డెవలపర్స్‌ మీద ప్రియ ముఖ్యంగా దృష్టి పెట్టారు. 2018లో ‘కాల్‌ ఫర్‌ కోడ్‌’ అనే ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది కోడింగ్‌ కాంపిటీషన్‌. దీని ద్వారా డెవలపర్స్‌ రకరకాల ఇన్నోవేషన్స్‌, పరిష్కారాలను రూపొందించవచ్చు. తద్వారా పలు అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించవచ్చు. ఈ ఏడాది వాతావరణ మార్పులపై ఆమె దృష్టిని కేంద్రీకరించారు. కొవిడ్‌-19 సంక్షోభానికి సంబంధించి కూడా టెక్నాలజీ పరిష్కారాలను రూపొందించడానికి ఐబీఎం సిద్ధమైంది. ఈ సవాళ్లు ఒక ఛాలెంజ్‌గా, యువత మేథను ప్రోత్సహించేలా ఉంటాయంటారు ప్రియ.

చిన్నవయసు నుంచే ప్రియకు టెక్నాలజీ అంటే ఆసక్తి. ‘2003లో మణిపాల్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేశా. ఐబీఎంలో చేరే ముందు విప్రోలో కొంతకాలం పనిచేశా. అయితే అప్పటికీ  ఇప్పటికీ ఈ రంగంలో ఎంతో మార్పు వచ్చింది. ఇన్‌స్ట్రక్షన్‌ బేస్డ్‌ నుంచి ఎక్స్‌పీరియన్స్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ వైపు మనం పయనిస్తున్నాం’ అన్నారు ప్రియ. మొత్తానికి ఈ ‘లీడర్‌’ తను నిరే ్దశించుకున్న లక్ష్యాల వైపు వేగంగా దూసుకెళ్తున్నారు.


Updated Date - 2020-08-15T05:30:00+05:30 IST