ధైర్యానికి రూపం!

ABN , First Publish Date - 2020-08-08T05:39:42+05:30 IST

ఎ.ఐ.డి.ఎం.కె మాజీ అధ్యక్షురాలు శశికళకు జైల్లో అందుతున్న వీఐపీ సేవలను బట్టబయలు చేశారామె! అవినీతికి చుక్కలు చూపించడంలో ఆమె చూపించే తెగువ, పట్టుదల ఫలితంగా... 20 ఏళ్ల పోలీసు వృత్తిలో ఏకంగా 41 సార్లు బదిలీ అయ్యారు! తాజాగా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి తొలి మహిళా హోమ్‌ సెక్రటరీగా...

ధైర్యానికి రూపం!

ఎ.ఐ.డి.ఎం.కె మాజీ అధ్యక్షురాలు శశికళకు జైల్లో అందుతున్న వీఐపీ సేవలను బట్టబయలు చేశారామె! అవినీతికి చుక్కలు చూపించడంలో ఆమె చూపించే తెగువ, పట్టుదల ఫలితంగా... 20 ఏళ్ల పోలీసు వృత్తిలో ఏకంగా 41 సార్లు బదిలీ అయ్యారు! తాజాగా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి తొలి మహిళా హోమ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు రూపా మౌద్గిల్‌! ‘చరిత్ర సృష్టించాలనుకుంటే నమ్మిన దానికోసం ధైర్యంగా ముందడుగు వేయాల్సిందే’ అంటున్న ఈ డేరింగ్‌ ఐపీఎస్‌ అధికారి విజయ ప్రస్థానాన్ని పరిక్షిస్తే...



మహిళలు అణకువగా, ఒద్దికగా, బిడియంగా, తమను తాము తగ్గించుకుని నడుచుకోవాలని అంటారు. కానీ మహిళలను భూమాతగా పోల్చుతున్నప్పుడు కళ్లెదుట జరుగుతున్న అవినీతి, అన్యాయాలకు ప్రశ్నించకుండా ఉండడం ఎంతవరకూ సమంజసం? ‘ఈ ఽధోరణి మారాలి. మహిళలు తమ విధినిర్వహణలో న్యాయబద్ధంగా నడుచుకునే క్రమంలో, సమాజానికి మహిళల పట్ల ఉన్న దృష్టి కోణాన్ని పరిగణలోకి తీసుకోకూడదు’ అంటారు కర్నాటకు చెందిన మహిళా ఐపీఎస్‌ అధికారి రూపా మౌద్గిల్‌. 2000 ఏడాది ఐ.పి.ఎస్‌ బ్యాచ్‌కు చెందిన రూప బెంగళూరు రైల్వేస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తూ, తాజాగా కర్నాటక రాష్ట్ర హోమ్‌ సెక్రటరీ పదవీబాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రధానంగా రాజకీయనేతలు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల కేసులను చేపట్టి తరచూ వార్తల్లో నిలిచేవారు. క్రమశిక్షణతో కూడిన వృత్తినిర్వహణ ఫలితంగా రూప 20 ఏళ్ల తన కెరీర్‌లో ఏకంగా 41 సార్లు బదిలీ అయ్యారు. 


పట్టుబట్టి పోలీసు ఉద్యోగం!

ఐ.ఏ.ఎస్‌ అధికారుల కుటుంబానికి చెందిన రూప, యుపీఎస్సీ పరీక్షల్లో 43వ ర్యాంకు సాధించారు. పోలీసు సేవల పట్ల ఉన్న ఆసక్తితో ఐపీఎస్‌ను ఎంచుకుని, విధుల్లో చేరింది మొదలు తన ధైర్యసాహసాలను అనేకసార్లు చాటుకున్నారు. 2004లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం మొదలు 2017లో బెంగళూరు జైళ్ల శాఖలో అవతవకలను వ్యతిరేకించడం వరకూ రూప పలు అవినీతి చర్యలను సమర్ధంగా ఎదుర్కొని ఫలితంగా అనేకసార్లు బదిలీ అయ్యారు. అయినా ఏమాత్రం వెరవలేదు. బెంగళూరు సెంట్రల్‌ జైలులో జరుగుతున్న అవకతవకలను వెలుగులోకి తెచ్చి కర్నాటక ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి పతకాన్ని అందుకున్నారు. వృత్తిరీత్యా బదిలీ అయిన ప్రతిసారీ ‘ఎప్పుడూ కదలడానికి సిద్ధంగా ఉంటాను’ అని ఆమె అంటూ ఉండడం విశేషం.


ఇంటి నుంచే మొదలవ్వాలి...

బాల్యం నుంచే అసమానత్వాన్ని ఖండించే రూప, తన కలలను నిజం చేసుకుని తీరాలనే దృఢసంకల్పంతో ఉండేవారు. కలను నిజం చేసుకోవాలనే పట్టుదల ఇంటి నుంచే మొదల వ్వాలని అంటారామె. ‘‘ఆడపిల్లలు వంటింట్లో అమ్మలకు సహాయపడితే, అబ్బాయిలు తండ్రితో మార్కెట్‌కు వెళ్లాలి అని సమాజం స్త్రీపురుషుల బాధ్యతలను చిన్నప్పటి నుంచే నిర్ణయిస్తోంది. ఈ ధోరణిలో మార్పు రావాలి. అనుకున్నది చెప్పే తత్వం రెండు అంశాల నుంచి రూపం పోసుకుంటుంది. ఒకటి... పరిస్థితులను అవలోకించి అనుగుణంగా మెలగడం, రెండోది ధైర్యం. నియమాలు, పరిధులు తెలుసుకుని నడుచుకోవడం. తప్పు చేయనప్పుడు దేనికీ తలవంచకుండా, దేన్నీ దాచకుండా, దేనికీ సిగ్గుపడకుండా నడుచుకోవాలి. గతం, భవిష్యత్తు గురించి బెంగపడకుండా, వర్తమానంలో జీవించే నైజం అంతులేని ధైర్యాన్ని అందిస్తుంది!’’ అంటున్న రూప ధైర్యానికి నిలువెత్తు రూపంగా కనిపిస్తారు.


Updated Date - 2020-08-08T05:39:42+05:30 IST