‘విజయా’నికి ‘ఎనర్జీ’

ABN , First Publish Date - 2020-02-13T04:53:32+05:30 IST

అది 2015. ఇంగ్లిష్‌ ఛానల్‌ ఈదడానికి విజయా రాజన్‌ భర్త శ్రీనివాస్‌ సన్నద్ధమవుతున్నారు. దాని కోసం శిక్షణ తీసుకొంటున్నారు. బలవర్ధకమైన ఆహారం

‘విజయా’నికి ‘ఎనర్జీ’

అది 2015. ఇంగ్లిష్‌ ఛానల్‌ ఈదడానికి విజయా రాజన్‌ భర్త శ్రీనివాస్‌ సన్నద్ధమవుతున్నారు. దాని కోసం శిక్షణ తీసుకొంటున్నారు. బలవర్ధకమైన ఆహారం అందించి ఆయనకు సహకరించాలన్నది విజయ ఆలోచన. ఈ క్రమంలో పోషకాహారం ఎక్కడ దొరుకుతుందని శోధించడం మొదలుపెట్టారు ఆమె. కానీ నిరాశే ఎదురైంది. 

అయితే ఆ నిరాశే ఆ తరువాత ఆమె వ్యాపారానికి పెట్టుబడి అయింది. రెండున్నర లక్షల రూపాయలతో ప్రారంభించిన ‘హెల్దీ శ్నాక్స్‌’ వ్యాపారం కేవలం రెండేళ్లలో 370 శాతం మేర వృద్ధి సాధించింది. ఇంతకీ ఎవరీ విజయా రాజన్‌? ఏమిటి ఆమె విజయ రహస్యం? 


‘‘మన జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేం. పెళ్లి చేసుకుని, ఇల్లు, పిల్లలే లోకంగా సాగిపోతున్న నేను ఇప్పుడిలా క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నానంటే నమ్మశక్యం కావడం లేదు. అదీ విజయవంతమైన ఒక పారిశ్రామికవేత్తగా! నిజం చెప్పాలంటే... వ్యాపారం చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు అది నా ఊహల్లో లేనేలేదు. దీని వెనక ఒక చిన్న కారణం... పెద్ద పరిశ్రమ ఉన్నాయి. 


మాది కోయంబత్తూర్‌. నేను అక్కడే ఎంకాం చదివాను. పెళ్లి తరువాత అమెరికాకు మకాం మారింది. ఆయన పేరు శ్రీనివాస్‌ రాజన్‌. కంప్యూటర్‌ ఇంజనీర్‌. తన ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. డిగ్రీ చదివిన నేను అక్కడున్న పదేళ్లలో కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకున్నా. ఆ తరువాత మా వారికి బ్రిటిష్‌ టెలికాంలో ఉద్యోగం రావడంతో 2004లో బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డాం. ఆయనది మంచి ఉద్యోగం... పెద్ద జీతం. అయితే తనకు ఇంగ్లిష్‌ ఛానల్‌ ఈదాలనేది చిన్నప్పటి కల. దాని కోసం ఎంతో శ్రమిస్తున్నారు. శిక్షణ కూడా తీసుకొంటున్నారు. అంత పెద్ద కార్యానికి పూనుకున్నప్పుడు భార్యగా నా వంతు సహకారం కూడా అందించాలి కదా! అదే నేనూ చేశాను. 


అలా మొదలైంది... 


ఓ గంట ఈత కొడితేనే శరీరంలోని శక్తి అంతా అయిపోయినట్టుంటుంది. అలాంటిది ఏకధాటిగా ఇంగ్లిష్‌ ఛానల్‌ ఈదాలంటే ఎంతో శక్తి ఉంటే గానీ సాధ్యం కాదు. పైగా మేము శాకాహారులం. పుష్కలంగా పోషక విలువలున్న ఆహారం తీసుకొంటే తప్ప సరిపడా బలం రాదు. ఈ ఆలోచనతోనే ఆయనకు పోషకాహారం అందించాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో వాటిల్లో చక్కెర, దీర్ఘకాలం నిల్వ ఉండడానికి వాడే కృత్రిమ, ఇతర అనారోగ్యకర పదార్థాలు ఉండకూడదు. వాటి కోసం మార్కెట్‌లో వెతకడం మొదలుపెట్టా. రకరకాల ఉత్పత్తులు పరిశీలించాను. చివరకు ముస్లీ, గ్రనోలా బార్స్‌ వంటి ఎనర్జీ ఫుడ్స్‌లో కూడా అధిక మొత్తంలో షుగర్‌ లెవల్స్‌ ఉండటంతో నాది వృథా ప్రయాసే అయింది. 


స్వయంపాకం... 


ఎక్కడా నేను ఆశించిన ఉత్పత్తి దొరకకపోవడంతో స్వయంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నా. రకరకాల గింజలు, చిరుధాన్యాలు, పండ్లతో ప్రయోగాలు మొదలు పెట్టాను. వాటి పోషక విలువలపై ఇంటర్నెట్‌లో శోధించాను. ఆఖరికి నేను సంపాదించిన పరిజ్ఞానంతో ఇంటి వద్దే మిల్లిట్స్‌తో బలవర్ధకమైన చిరుతిళ్లు తయారు చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలో మా కుటుంబం కోసమే చేసేదాన్ని. అయితే అవి చూసి మా బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కలవాళ్లు తమకూ కావాలంటూ అడగడం మొదలుపెట్టారు. దాంతో ఉత్పత్తి మరికొంత పెంచాను. 


ఒక్కరితో మొదలు... 


అలా నేను తయారు చేసిన హెల్దీ శ్నాక్స్‌కు అందరి నుంచి చక్కని ఆదరణ లభించింది. దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదు? ఆ ఆలోచన వచ్చిందే తడవుగా అదే నా రూటని నిర్ణయం తీసేసుకున్నా. ఇంట్లో అయితే ఎలాగైనా నడిచిపోతుంది. కానీ ఒక ఉత్పత్తిగా తీసుకువచ్చి, మార్కెట్‌లో పెట్టాలంటే కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. కనుక ఏవి, ఎంత మొత్తంలో ఉండాలన్నదానిపై ఒక అవగాహనకు వచ్చాను. ఇక ఆలస్యం లేకుండా అడుగు ముందుకు వేశాను. అయితే తొలి ప్రయత్నం కదా! అందుకే వేరే ఉద్యోగులనెవరినీ తీసుకోకుండానే 2017 ద్వితీయార్ధంలో ‘సిరిమిరి’ పేరుతో వ్యాపారానికి శ్రీకారం చుట్టాను. 


మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మా అమ్మానాన్నలు ప్రభుత్వ ఉద్యోగులు. కుటుంబంలో ఎవరికీ అంతకముందు వ్యాపారం చేసిన అనుభవం లేదు. ఎక్కడ... ఎలా మొదలుపెట్టాలో కూడా తెలియని పరిస్థితి. అయినా వెనకడుగు వేయలేదు. అధైర్యపడలేదు. 


‘సహేలీ’ సాయంతో... 


‘సిరిమిరి’ అంటే ఏమిటని చాలామంది అడిగారు. అదో స్పానిష్‌ పదం. ‘చిరుజల్లు’ అని అర్థం. కన్నడంలో ‘సిరి’ అంటే లక్ష్మీదేవి అని! కొత్తగా, క్యాచీగా ఉందని అలా పెట్టాను. ఆరంభంలో మూడేసి రకాల ఎనర్జీ బార్స్‌, ముస్లీ తయారు చేసేదాన్ని. ఒక్కదాన్నే మార్కెటింగ్‌ కష్టం కాబట్టి ‘అమెజాన్‌ సహేలీ’ ప్రోగ్రామ్‌లో మా సంస్థ పేరు నమోదు చేసుకున్నా. మార్కెటింగ్‌, ప్యాకింగ్‌, షిప్పింగ్‌ తదితర అంశాలపై ఆ కార్యక్రమ ప్రతినిధులు అవగాహన కల్పించారు. దానివల్ల చాలా విషయాలు తెలుసుకోగలిగాను. అమెజాన్‌లో అమ్మడం వల్ల ప్రత్యేకంగా గోడౌన్‌, షాపుల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. మావన్నీ మిల్లెట్‌ ఆధారిత ఉత్పత్తులే. ఎనిమిది రకాల ఎనర్జీ బార్స్‌, ఆరు రకాల ముస్లీ తయారు చేస్తున్నాం. త్వరలో 27 పదార్థాలతో ప్రొటీన్‌ బార్‌ కూడా తీసుకువస్తున్నాం. అమెజాన్‌తో పాటు మా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో కూడా మా ఉత్పత్తులు విక్రయిస్తున్నాం. 


లక్ష్యం 500 శాతం


ఆరంభంలో నేను పెట్టిన పెట్టుబడి కేవలం రెండున్నర లక్షలు. తయారీ సామగ్రి, సదుపాయాల కోసం అది ఖర్చు పెట్టాను. నిదానంగా అమ్మకాలు ఊపందుకోవడంతో ఇల్లు సరిపోయేది కాదు. దాని కోసం ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఓ షాపు అద్దెకు తీసుకున్నాం. నా ఒక్కదానితో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు 15 మంది ఉద్యోగుల స్థాయికి చేరింది. అన్నింటికీ మించి లాభాల శాతం గణనీయంగా పెరిగింది. ఈ రెండేళ్లలో 370 శాతం వృద్ధి సాధించాము. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి ఆదాయంలో వృద్ధి 500 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నాం. 


ఆయనా నా బాటలోనే... 


‘సిరిమిరి’ అనూహ్యంగా విజయవంతమవడంతో మా ఆయన శ్రీనివాస్‌ రాజన్‌ కూడా ఇదే బాట పట్టారు. బ్రిటిష్‌ టెలికామ్‌లో అంత మంచి ఉద్యోగం వదిలేసి వ్యాపారంలో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఆయన ‘సిరిమిరి’ సహ వ్యవస్థాపకుడు. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. కొన్ని బాధ్యతలు ఆయన పంచుకోవడం వల్ల ఉత్పత్తులపై మరింత శ్రద్ధ పెట్టే వెసులుబాటు దొరికింది. ఓ సామాన్య గృహిణినైన నేను ఇంత సాధించగలిగానా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఒక్కటి మాత్రం ధీమాగా చెప్పగలను... రాబోయే రోజుల్లో ‘సిరిమిరి’ ఈ రంగంలోని పరిస్థితులను మార్చేసే కొత్త తరం కానుందని! ఈ క్రమంలోనే పోషకాహారం కోరుకొనే ప్రతి వినియోగదారుడికీ మా ఉత్పత్తి చేరేలా విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం.’’

Updated Date - 2020-02-13T04:53:32+05:30 IST