చెట్టుపై కుర్రాడు.. కింద రెండు పులులు.. ఇద్దరిని చంపేసి మరీ మూడో వ్యక్తి కోసం తెల్లారేదాకా..

ABN , First Publish Date - 2021-07-13T21:19:37+05:30 IST

ముగ్గురు కుర్రాళ్లు దట్టమైన అడవిగుండా ఉన్న మట్టిరోడ్డులో బైక్‌పై వెళ్తున్నారు. పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటూ ముందుకు పోతున్నారు.

చెట్టుపై కుర్రాడు.. కింద రెండు పులులు.. ఇద్దరిని చంపేసి మరీ మూడో వ్యక్తి కోసం తెల్లారేదాకా..

ముగ్గురు కుర్రాళ్లు దట్టమైన అడవిగుండా ఉన్న మట్టిరోడ్డులో బైక్‌పై వెళ్తున్నారు. పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇంతలోనే సడన్‌గా ఓ రెండు పులులు ఆ మార్గంలో ఎంట్రీ ఇచ్చాయి. అంతే, వెంటనే బైక్ నడుపుతున్న కుర్రాడు బ్రేకు వేశాడు. ఆకలితో ఆబగా తమవైపు చూస్తున్న ఆ పులులను చూసి ఆ కుర్రాళ్ల వెన్నులో వణుకుపుట్టింది. బైక్‌ను నడుపుతున్న వ్యక్తి.. దాన్ని వెనక్కు తిప్పుదామని ప్రయత్నించబోయాడంతే.. వెంటనే ఆ పులులు దాడికి తెగబడ్డాయి. బైక్ పై నుంచి ఆ ముగ్గురు కుర్రాళ్లు కిందకు పడిపోయారు. బైక్ నడుపుతున్న వ్యక్తిపై మొదటగా ఆ రెండు పులులు దాడి చేశాయి. దాన్ని చూసిన మిగిలిన ఇద్దరు కుర్రాళ్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఓ చెట్టును ఎక్కేందుకు ప్రయత్నించారు. మధ్యలో కూర్చున్న వ్యక్తి ఓ చెట్టును ఆరడుగులు ఎక్కాడో లేడో.. ఓ పులి అతడిపై అమాంతం దూకేసింది. 


అంతకుముందే ఆ చెట్టుపైకి బరబరా ఎక్కేసినా మూడో వ్యక్తి ఆ దృశ్యాన్ని చూసి వణికిపోయాడు. ఆ రెండు పులులు.. ఇద్దరు స్నేహితుల దేహాలపై దాడి చేసి చంపడం కళ్లారా చూశాడు. అతడిపైకి కూడా దాడికి యత్నించినా, ఫలితం లేకపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది గంటల పాటు రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేకుండా ఆ కుర్రాడు చెట్టుపైనే ఉన్నాడు. చెట్టుకింద పులులు కూడా అతడి కోసమే అన్నట్టుగా నిరీక్షిస్తున్నాయి. ఏంటీ ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా..? కాదు, ఈ ఘటన నిజంగా జరిగింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిట్ ప్రాంత పరిధిలోని ఖర్నౌట్ నదీ పరివాహ ప్రాంతంలోని అటవీ పరిసరాల్లో ఈ ఘటన జరిగింది. వింటోంటోనే గుండెల్లో భయం కలిగించే ఈ భయానక ఘటన గురించి ఆ పులుల బారి నుంచి క్షేమంగా బయటపడిన వికాస్ అనే కుర్రాడు ఏం చెబుతున్నాడంటే.. 


‘సోను, కాందైలాల్, నేను కలిసి బైక్‌పై అడవిగుండా వెళ్లాలనుకున్నాం. అడవిలోకి వెళ్తోంటే.. అక్కడ ఉన్న అధికారులు మమ్మల్ని హెచ్చరించారు. పులులు ఉంటాయి. వెళ్లకండి అని చెప్పారు. కానీ మేం వాళ్ల మాటను పెడచెవిన పెట్టాం. సోను బైక్‌ను తోలుతుతున్నాడు. కాందైలాల్ మధ్యలో కూర్చున్నాడు. నేను వెనక కూర్చున్నాను. కొద్ది దూరం వెళ్లిన తర్వాత మా ఎదురుగా రెండు పులులు ప్రత్యక్షమయ్యాయి. వాటి నుంచి తప్పించుకుందామని ప్రయత్నించాం. కానీ కుదరలేదు. అవి మా మీద దాడి చేశాయి. నేను చూస్తుండగానే సోనును, కాందైలాల్‌ను ఆ పులులు చంపేశాయి. నేను అదృష్టవశాత్తు మెరుపు వేగంతో ఓ చెట్టును ఎక్కగలిగాను. ఆ చెట్టుపైనే ఉండి కింద ఆ పులులు ఏం చేస్తున్నాయో చూశాను. నా మిత్రుల దేహాలపై పడి ఆ పులులు ఆకలి తీర్చుకుంటున్నాయి. ఓ మిత్రుడి దేహాన్ని అడవిలోకి లాక్కెళ్లాయి. నేను ఉన్న చెట్టును కూడా ఎక్కడానికి ప్రయత్నించాయి. కానీ వాటికి వీలు చిక్కలేదు. 


సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి రాత్రంతా నేను జాగారం చేశారు. కంటి మీద కునుకు లేదు. ఎదురుగా మృత్యువు ఉంటే ఎవరికి నిద్ర వస్తుంది. ఆ పులులు కూడా నా కోసమే అన్నట్టుగా చెట్టు కింద తిరుగుతూ ఉన్నాయి. చివరకు ఉదయం 3.30గంటల సమయంలో ఆ పులులు వెళ్లిపోయాయి. అయినా నేను వెంటనే కిందకు దిగలేదు. ఉదయం ఆరు గంటల సమయంలో కొందరు వ్యక్తులు వెళ్తోంటే.. వాళ్లను పిలిచాను. వాళ్ల సాయంతో నేను ప్రాణాలతో బయటపడ్డాను. జరిగిందంతా అటవీ పోలీసులకు వెల్లడించాను. పోలీసులు నా మిత్రుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నేను చచ్చే వరకు ఈ ఘటనను మర్చిపోలేను.’ అంటూ వికాస్ చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2021-07-13T21:19:37+05:30 IST