ఈ రోడ్ల గతి ఇంతేనా?

ABN , First Publish Date - 2022-05-19T06:39:27+05:30 IST

అధ్వానపు రోడ్లతో నరకం చూస్తున్నామంటూ లంక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోడ్ల గతి ఇంతేనా?
గోతులతో గుర్వాయిపాలెం–పెదలంక రహదారి

అధ్వాన్నంగా లంక గ్రామాల ప్రధాన రహదారి 

భారీ వాహనాల రాకపోకలతో మరింత ఛిద్రం

బస్సులు రద్దు చేస్తామంటున్న ఆర్టీసీ అధికారులు

టీడీపీ హయాంలో మంజూరైన నిధులు వైసీపీ రాకతో రద్దు!

గోతుల రోడ్లతో నరకం చూస్తున్నామంటున్న గ్రామస్థులు

అధ్వానపు రోడ్లతో నరకం చూస్తున్నామంటూ లంక గ్రామాల  ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో మంజూరైన నిధులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో రోడ్ల దుస్థితి మారలేదని ఆర్టీసీ అధికారులు సైతం బస్సు సర్వీసులను రద్దుచేస్తామంటున్నారని అదే జరిగితే తమ గతేంటని ప్రశ్నిస్తున్నారు. 

కలిదిండి, మే 18: మండలంలో లంక గ్రామాలైన గుర్వాయిపాలెం, కొత్తూరు, సంతోషపురం, భాస్కరావుపేట, మూల్లంక, పెదలంక గ్రామాల ప్రధాన రహదారి 15 కిలోమీటర్ల మేర గోతులు పడి అధ్వానంగా ఉంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులకు కమాన్‌ కట్టలు విరిగిపోతున్నాయని రోడ్డుకి మరమ్మతులు చేయకపోతే బస్సులు నిలుపుదల చేస్తామని ఆర్టీసీ అధికారులు హుకుం జారీ చేశారు. విద్యార్థులు నిత్యం  ఆయా గ్రామాల నుంచి కలిదిండి, భీమవరం, ఏలూరు పాడు, బంటుమిల్లిలోని కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి వస్తుంటారు. బస్సులు, ఆటోలు సక్రమంగా లేకపోవ టంతో మూల్లంక, కలిదిండి, భీమవరంలోని ఆసుపత్రికి వెళ్లే వృద్ధులు చంటి పిల్లల తల్లులు, విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. ఆయా గ్రామాల్లో సుమారు 30 వేల జనాభా నివసిస్తున్నారు. చేపలు, రొయ్యల చెరువులు అధికంగా ఉండటంతో అధిక లోడుతో తవుడు లారీలు, చేపల లోడు లారీలు రాకపోకలు సాగించటంతో రోడ్డు ధ్వంసమవుతోందని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. రోడ్లపై లారీలను నిలుపుదల చేసి చేపలను ఐస్‌ ప్యాకింగ్‌ చేయటంతో నీరు నిల్వ ఉండి గోతులు పడుతున్నాయి. ద్విచక్ర వాహనచోదకులు గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్లు మరమ్మతులు చేయాలని పాలకులకు, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరయ్యాయని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరైన  నిధులను రద్దు చేసిందని, ఇంత వరకు రోడ్డు నిర్మాణం చేపట్టలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి లంక గ్రామాల ప్రధాన రహదారికి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.


అధికారి వివరణ.. 

ఆర్‌ అండ్‌ బి ఏఈ రాజశేఖర్‌ను వివరణ కోరగా, లంక గ్రామాల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే రోడ్డు నిర్మాణం చేపడతాయన్నారు. 


కోడూరు–మల్లాయిపాలెం రోడ్డుదీ అదే తీరు..


ముదినేపల్లి రూరల్‌: కోడూరు–మల్లాయిపాలెం ప్రధాన రహదారి శిథిలావస్థకు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. కోడూరు గ్రామస్థులు గుడివాడ వెళ్లటానికి ఇదే ప్రధా న రహదారి కావటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా రహదారి గోతులమయం కావటంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలు ప్రమా దాలకు గురవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామానికి వచ్చిన ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు సమస్యలు పరిష్కరించటం లేదని ఆరోపిస్తున్నారు. వర్షాకాలం వస్తే ప్రయాణం భరత నరకంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారిని పునర్నిర్మించాలని కోరుతున్నారు. 


Updated Date - 2022-05-19T06:39:27+05:30 IST