అధికారులూ.. పట్టించుకోరూ..

ABN , First Publish Date - 2022-09-07T06:23:45+05:30 IST

అస్తవ్యస్త రోడ్లతో ప్రజల పాట్లు అన్నీ ఇన్నీ కావు.

అధికారులూ.. పట్టించుకోరూ..
ఆగిరిపల్లి పెద్దకొఠాయి సెంటరులో చెరువును తలపిస్తున్న రహదారి

ఆగిరిపల్లిలో ఏ రోడ్డు చూసినా ఛిద్రమే

కలిదిండి మండలంలో లంక గ్రామాలకు రద్దైన బస్సులు

ముసునూరులో రోడ్డు మార్జిన్లలో జిగురుమట్టి!

అస్తవ్యస్త రోడ్లతో జనం పాట్లు


అస్తవ్యస్త  రోడ్లతో ప్రజల పాట్లు అన్నీ ఇన్నీ కావు. గుంతలు పడి, వర్షాకాలమైతే చెరువులను తలపిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రహదారుల నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడి నాణ్యత లేకపోవడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. 



ఆగిరిపల్లి, సెప్టెంబరు 6 : ఆగిరిపల్లిలో ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్మించిన సీసీ రోడ్లతో  గ్రామమంతా అస్తవ్యస్తంగా మారింది. ఏ సెంటర్‌లో చూసినా వర్షపునీరు నిలిచిపోయి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఏ రోడ్డు చూసినా గుంతలు, మురుగునీటితో నిండి వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. నాలుగు నెలలుగా ఈ పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎస్‌బీఐ సెంటర్‌లో విద్యుత్‌ స్తంభాలు కూడా ప్రమాదకరంగా ఉన్నాయని  బీజేపీ మండల అధ్యక్షుడు కొవ్వలి బాబూరావు ఆరోపించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు  తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.


మరో రూటులో బస్సులు నడపరూ..


కలిదిండి:  గుర్వాయిపాలెం నుంచి పెదలంక రహదారి గోతులు పడి అధ్వాన్నంగా ఉండటంతో కొంతకాలంగా ఆర్టీసీ బస్సులను నిలుపుదల చేశారు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు, ప్రయాణీకులు పలు అవస్థలు పడుతున్నారు. ఆటోలు కూడా సక్రమంగా నడపకపోవటంతో కలిదిండి, భీమవరం ఆసుపత్రులకు వెళ్లటానికి గర్భిణులు, బాలింతలు    తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు. ప్రయాణీకులు, విద్యార్థులు పెదలంక నుంచి మూల్లంక వరకు ఐదు కిలోమీటర్లు మేర నడిచి వచ్చి మూల్లంకలో బస్సులు, ఆటోలు ఎక్కుతున్నారు. వర్షం వస్తే మూల్లంకకు కూడా బస్సులు రావటం లేదు. పాతాళ భోగేశ్వరస్వామి ఆలయ రోడ్డు మీదుగా శాంతినగరం వయా పెదలంక వరకు ఆర్టీసీ బస్సులు  నడపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.  లంక గ్రామాల ప్రధాన రహదారి మరమ్మతులు పూర్తి చేసే వరకు పాతాళ భోగేశ్వరస్వామి రోడ్డు మీదుగా శాంతినగరం వయా పెదలంక వరకు భీమవరం, గుడివాడ, విజయవాడ డిపోకు బస్సులను నడపాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 


నిబంధనలకు తూట్లు..


ముసునూరు: ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్ల నిర్మాణాల్లో  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు, స్థానికులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  నేలపాటివారి కుంట నుంచి చింతవల్లి, ముసునూరు మీదుగా ఏలూరు ప్రధాన రహదారి వరకు 4 కిలోమీటర్ల పొడవున ఇటీవల  బీటీ రహదారి  నిర్మించారు.  నిబంధనల ప్రకారం  మార్జిన్‌లో గ్రావెల్‌ పోసి, రోలింగ్‌ చేయాల్సి ఉండగా సంబంధిత కాంట్రాక్టర్‌  జిగురు మట్టిని మార్జిన్‌లో  పోయించారు. దీంతో చినుకు పడితే మార్జిన్‌లు చిత్తడిగా మారి ప్రమాదానికి గురికాక తప్పదని   చెబుతున్నారు.  రహదారి నిర్మాణం నాసిరకంగా ఉందని, అధికారుల తనిఖీలో నిబంధనల ప్రకారం మందం లేకపోవటంతో పలు చోట్ల రెండో లేయర్‌ కూడా వేశారని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికరాల పర్యవేక్షణ కొరవడటం వల్లే కాంట్రాక్టర్‌ నాసిరకంగా రహదారి నిర్మించినట్టు  ఆరోపణలు వస్తున్నాయి. 



Updated Date - 2022-09-07T06:23:45+05:30 IST