Abn logo
Jan 21 2021 @ 12:20PM

దిగ్గజ నిర్మాత దిల్ రాజుకు పరీక్షా కాలం!

చలన చిత్ర పంపిణీ రంగంలో మకుటం లేని మహారాజులా చెలామణి అవుతున్న దిల్ రాజు పైన అనేక ఆరోపణలను మోపుతూ, యువ పంపిణీదారుడు వరంగల్ శీను మీడియా ముందుకు వచ్చి యథేచ్ఛగా మాట్లాడిన దరిమిలా.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టయిందని పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారపరంగా గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని కఠిన విధానాలను పెద్ద తలకాయలు అనుసరించడం, అమలుచేయడమన్నది పరిపాటిగా వచ్చేదే అయినా, అవి అన్ని కాలమాన పరిస్థితులలోనూ నెట్టుకురాలేవన్న వేదాంతాన్ని వల్లె వేస్తున్న వాతావరణం ప్రస్ఫుటంగా కనబడుతోంది. 


దిల్ రాజు ఎవ్వరినీ ఎదగనివ్వడం లేదని, పంపిణీ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టినవారిని అణగదొక్కడానికి అన్ని పాచికలూ ప్రయోగిస్తున్నారని వరంగల్ శీను మీడియా ముందు విరుచుకుపడిన వైఖరి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపింది. దర్శకరత్న దాసరి నారాయణరావు తర్వాత ఆ పెద్దరికాన్ని మెగాస్టార్ చిరంజీవి తలకెత్తుకోవాలని చిత్రపరిశ్రమ యావత్తూ వెలిబుచ్చిన కోరికను మన్నిస్తూ ఆయన కరోనా కష్టకాలంలో పరిశ్రమలోని కార్మికులకు కొండంత అండగా నిలబడ్డారు. పంపిణీ రంగంలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరుగుతోందని, సరైన లెక్కలు వెలుగు చూడడం లేదని దిల్ రాజుపైన వరంగల్ శీను చేసిన ఆరోపణలలో నిజానిజాలు తేల్చే సమగ్ర బాధ్యతను చిరంజీవి భుజాలకెత్తుకున్నట్టు తాజా భోగట్టా. 


ప్రదర్శకుల బలహీనతలను అడ్డుపెట్టుకుని, లెక్కలు ఏమార్చి, అటు నిర్మాతలకు, ఇటు ప్రదర్శకులకు తృణమో ఫణమో ఇచ్చి చేతులు దులుపుకుని, సింహభాగాన్ని దిల్ రాజు అందుకుంటున్నారని పలువురు ప్రదర్శకులు ఇప్పడు కొత్తగా చెవులు కొరుక్కుంటున్నారు. ఉదాహరణకి, `సరిలేరు నీకెవ్వరు` చిత్రం రెండు వారాలకు కలిపి 55 లక్షలు చేస్తే.. ఆ ప్రదర్శకుడికి కేవలం పదిలక్షలు ఇచ్చారట. అదే చిత్రం అదే రెండు వారాలకి అంతే రాబడి వచ్చిన సందర్భంలో సగానికి సగం ప్రసాద్ ఐమాక్స్‌కు ఇచ్చారని ఓ ప్రదర్శకుడు ‘చిత్రజ్యోతి’కి తెలిపి వాపోయాడు. ఐమాక్స్ థియేటర్లకు దేశవ్యాప్తంగా ఒకటే రూలు ఉండడమే దానికి కారణం. సాధారణ థియేటర్లకు అటువంటి నియమం లేదు. ఇటువంటి దోపిడి వల్లే నగరంలో శాంతి, శ్రీమయూరి, గెలాక్సీ, అంబా వంటి థియేటర్లు మూతపడ్డాయని, ఇదే కనుక కొనసాగితే మరిన్ని థియేటర్లు నెత్తిన కొంగేసుకోక తప్పదని ఆ ప్రదర్శకుడు పేర్కొన్నాడు. ఐమాక్స్ థియేటర్లకు ఇచ్చే మాదిరిగానే సాధారణ థియేటర్లకు కూడా ఇవ్వడానికి నిర్మాతలు సుముఖంగా ఉన్నప్పటికీ, పంపిణీదారుడు మధ్యలో సైంధవుడిలా అడ్డుపడుతున్నారని సదరు ప్రదర్శకుడు గగ్గోలు పెట్టాడు. 


వరంగల్ శీనుకి 22 నుంచి `నో` థియేటర్స్..? 

వరంగల్ శీను ఇటీవల పంపిణీ చేసిన చిత్రాలు కలసిరావడంతో నిర్మాతలకి పెద్ద మొత్తాలే ఆఫర్ చేసే అవకాశం ఉంది. దీంతో వరంగల్ శీను ఎదుగుదలని నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతన్నాయట. వరంగల్ శీను తీసుకునే సినిమాలకు శుకవ్రారం (22వ తేదీ) నుంచి థియేటర్లు లేకుండా చెయ్యాలనే మంత్రాంగం ముమ్మరంగా నడుస్తోందని ఓ ప్రముఖ నిర్మాత తెలిపారు. అయితే, వరంగల్ శీను చేసిన ఆరోపణలు సబబు కాదని, కరోనా లాక్‌డౌన్ అనంతరం పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోకపోవడం వల్లే కొరత ఏర్పడిందని, ఆ పరిస్థితిని వరంగల్ శీను సరైన రీతిలో అవగాహన చేసుకోకుండా దిల్ రాజుపై విమర్శలు చేశారని కొందరు ప్రదర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సరే, ఇటువంటి ఆవాంఛనీయమైన పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే, దిల్ రాజు వంటి దిగ్గజం పారదర్శకత పాటించాలని, అలా చేయడం వల్ల ప్రదర్శనారంగం నిలదొక్కుకుంటుందని మరో సీనియర్ ఎగ్జిబిటర్ వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement
Advertisement