ఉత్తర కోస్తా దిశగా ‘అసాని’

ABN , First Publish Date - 2022-05-10T02:26:00+05:30 IST

తీవ్ర తుఫాన్‌ ‘అసాని’ ఉత్తర కోస్తా దిశగా వస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం తీవ్ర తుఫాన్‌ ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం లేదు.

ఉత్తర కోస్తా దిశగా ‘అసాని’

విశాఖపట్నం: తీవ్ర తుఫాన్‌ ‘అసాని’ ఉత్తర కోస్తా దిశగా వస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం తీవ్ర తుఫాన్‌ ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం లేదు. అయితే దీని ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి కోస్తాలో వాతావరణం మారింది. మేఘాలు ఆవరించి తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. తీవ్ర తుఫాన్‌ ‘అసాని’ ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి సోమవారం దక్షిణ, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు వడివడిగా అంటే గంటకు 23 నుంచి 25 కి.మీ. వేగంతో పయనించిన తీవ్ర తుఫాన్‌...ఆ తరువాత నెమ్మదించింది. తాజా నివేదిక మేరకు గంటకు 16 కి.మీ. వేగంగా పయనిస్తూ విశాఖపట్నానికి 450 కి.మీ. ఆగ్నేయంగా, పూరీకి 610 కి.మీ. దక్షిణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం ఉదయం వరకు వాయువ్య దిశగా పయనించి కాకినాడకు 150 నుంచి 200 కిలోమీటర్ల సమీపంలోనికి వచ్చి...అక్కడ నుంచి తొలుత ఉత్తరంగా, ఆ తరువాత ఈశాన్యంగా దిశ మార్చుకుని ఉత్తర కోస్తా, ఒడిశా తీరానికి సమాంతరంగా పయనిస్తుంది. ఈ క్రమంలో తీవ్ర తుఫాన్‌ క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే సోమవారం సాయంత్రం నుంచే బలహీనపడడం ప్రారంభమైందని, మంగళవారం ఉదయం దిశ మార్చుకునే సమయానికి తుఫాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. 

Read more