బంగారు పుట్ట

ABN , First Publish Date - 2020-10-11T08:01:51+05:30 IST

మనదేశంలో కాలక్షేపానికి చెప్పే కథల్లో కూడా అంతర్గతంగా అధ్యాత్మ తత్త్వం ఉంటుంది. ఉదాహరణకు.. చిన్న పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు, వాళ్లని నిద్రపుచ్చేటప్పుడు....

బంగారు పుట్ట

మనదేశంలో కాలక్షేపానికి చెప్పే కథల్లో కూడా అంతర్గతంగా అధ్యాత్మ తత్త్వం ఉంటుంది. ఉదాహరణకు.. చిన్న పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు, వాళ్లని నిద్రపుచ్చేటప్పుడు చెప్పే ఏడు చేపల కథలో ఎంతో లోతైన తత్త్వం ఉంది. 


అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకు వెళ్లారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండబెట్టారు.  అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా ఎందుకెండలేదు? అంటే.. గడ్డి మేటు అడ్డం వచ్చింది అంది. గడ్డిమేటా గడ్డి మేటా ఎందుకడ్డం వచ్చావు అంటే.. ఆవు మెయ్యలేదంది. ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు అంటే.. గొల్లవాడు మేపలేదంది. గొల్లవాడా గొల్లవాడా ఎందుకు మేపలేదంటే.. అమ్మ అన్నం పెట్టలేదన్నాడు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదంటే.. పిల్లవాడు ఏడ్చాడు అంది. పిల్లవాడా పిల్లవాడా ఎందుకేడ్చావంటే.. చీమకుట్టింది అన్నాడు. చీమా చీమా ఎందుకు కుట్టావు? అంటే.. నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా అందా చీమ. ఇదీ స్థూలంగా కథ. ఇందులో ఉండే అంతరార్థం తెలియాలంటే స్థూలంగా చూస్తే కనబడని చిక్కుముడి విప్పాలి. కథానిర్మాణంలో ఎక్కడో ఏదో లోపమో, అనౌచిత్యమో ఉంటుంది. అక్కడ ఆగి సూక్ష్మ దృష్టితో చూస్తే ఆ చిక్కుముడి విడిపోతుంది. రాజుగారికి కొడుకులుండడం, వాళ్లు వేటకు వెళ్లడం మామూలు విషయమే కానీ.. రాజుగారి కుమారులు వేటకెళ్లి చేపలు తేవడమేమిటి? రాజకుమారులు వేటకు వెళితే సింహాన్నో, పులినో వేటాడి తెస్తారు. అవి దొరక్కపోతే ఒక లేడినైనా తెస్తారు. కానీ చేప నెందుకు తెస్తారు? కథలో కీలకం అంతా అక్కడే ఉంది.


నిజానికి తెచ్చినవి చేపలు కావన్నమాట. మరేమయ్యుంటాయి? అని ఆలోచిస్తే ఎవరో ఒకరికి తోచకపోదు. ఏడు చేపల్లో ఎండిన ఆరు చేపలే అరిషడ్వర్గాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు). ఎండని ఏడవ చేపే ఈ ఆరింటికీ పుట్టినిల్లయిన మనస్సు.


ఈ దృష్టితో కథ అంతటినీ మరో సారి తరచిచూస్తే అనర్ఘరత్నాలన్ని గనిలోంచి తమంతతామే బయటకు వస్తాయి. చేప ఎండకపోవడం అంటే మనస్సు నశించకపోవడం. గడ్డి మేటు అడ్డం వచ్చింది అంటే అజ్ఞానం గడ్డిమేటులా పేరుకుపోయిందని. గడ్డిమేటుని ఆవు మెయ్యలేదు అంటే జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేయ్యలేదు అని!  గొల్లవాడు మేపలేదు అంటే.. ఏ గురువూ జ్ఞానోపదేశం చెయ్యలేదు అని(జగద్గురువు శ్రీకృష్ణుడు గొల్లవాడే కదా). అమ్మ అన్నం పెట్టలేదు అంటే.. మనకు జ్ఞానోపదేశం చెయ్యాల్సిందిగా అమ్మవారు ఏ గురువుకూ చెప్పలేదని! పిల్లవాడు ఏడ్చాడు అంటే.. ఇంకో భక్తుడు మనకంటే ఎక్కువగా భగవత్‌ సాక్షాత్కారం కోసం తపిస్తున్నాడని. చీమ కుట్టింది అంటే.. సంసారతాపత్రయం అనే విషపు పురుగు కాటేసిందని. బంగారుపుట్టలో వేలు పెట్టడం అంటే సంసారం మట్టిపుట్టే అని తెలిసి కూడా బంగారు పుట్ట అని భ్రమించి అందులో ప్రవేశించామని. ఇదీ కథలో అంతరార్థం. ఇంతటి గొప్ప కథని కాలక్షేపం కథగానో, ‘పనెందుకు చెడి పోయింది?’ అంటే ఎవరిమీదో వంకపెట్టి తప్పించుకోడానికి ఉపయోగించే కథగానో భావించడం ఎంత పొరపాటు!!


- గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-10-11T08:01:51+05:30 IST