ఆదమరిస్తే అంతే!

ABN , First Publish Date - 2022-09-17T06:31:29+05:30 IST

డ్రైన్‌పై సిమెంట్‌ దిమ్మెలు శిథిలమవడంతో నూజివీడు –మైలవరం రోడ్డులో గల పశుసంవర్ధక శాఖ సహాయ సంచాల కుల కార్యాలయం, చేపల మార్కెట్‌ వద్ద గల కల్వర్టు ప్రమాదకరంగా మారింది.

ఆదమరిస్తే అంతే!
డ్రైన్‌పై సిమెంట్‌ దిమ్మెలు శిథిలమై ప్రమాదకరంగా కల్వర్టు

నూజివీడు టౌన్‌, సెప్టెంబరు 16: డ్రైన్‌పై సిమెంట్‌ దిమ్మెలు శిథిలమవడంతో నూజివీడు –మైలవరం రోడ్డులో గల పశుసంవర్ధక శాఖ సహాయ సంచాల కుల కార్యాలయం, చేపల మార్కెట్‌ వద్ద గల కల్వర్టు ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ఆదమరిచి ఇటువైపు వస్తే నేరుగా డ్రైన్‌లోకి వెళ్ళి ప్రమాదం బారిన పడే పరిస్థితి నెలకొంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇలాగే ఉన్నా మరమ్మత్తులు గాని, డ్రైన్‌పై కల్వర్టు గానీ నిర్మించాల్సిన మున్సిపల్‌ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చేపల మార్కెట్‌, మరోవైపు పశుసంవర్ధక శాఖ కార్యాలయం, పశువుల ఆసుపత్రి ఉండగా, ఈ రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కొత్తవారెవరైనా ఇటువస్తే కల్వర్టు పై సిమెంట్‌ దిమ్మెలు లేని విషయం గుర్తించటం కష్టం. దీంతో అనేక సందర్భాల్లో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా అధికారులు  మరమ్మతులు  చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


హెచ్చరిక బోర్డయినా ఏర్పాటు చేయండి!


ముదినేపల్లి: ముదినేపల్లి – గుడివాడ జాతీయ రహదారిలో పోల్‌ రాజ్‌ డ్రైన్‌ వంతెన వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వంతెన దాటగానే గుడి వాడ వైపు మార్జిన్‌ పూర్తిగా కోసుకుపోయి మైనర్‌ డ్రైన్‌లో కలసిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఈ పరిస్థితి నెలకొన్నప్పటికీ గతంలో ఆర్‌ అండ్‌ బీ అధికారులు గానీ, ఇప్పుడు జాతీయ రహదారుల శాఖాధికారులు కానీ పట్టించుకోలేదు. రోడ్డు మార్జిన్‌ లేకపోవటంతో రాత్రిళ్లు ఏ మాత్రం ఆదమరచినా వాహనాలు పక్కనే ఉన్న డ్రైన్‌లో పడిపోవటమే. గతంలో ట్రాక్టర్లు, ఆటోలు రోడ్డుపై నుంచి జారి కాల్వలో పడిపోయిన సంఘటనలు జరిగాయి. అధికారులు కనీసం  ప్రమాద సూచిక బోర్డులనైనా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 



Updated Date - 2022-09-17T06:31:29+05:30 IST