Abn logo
Mar 30 2020 @ 03:07AM

కరోనాను గెలిచిన యోధులు

  • కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. మనదేశంలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన ఎక్కువవుతోంది. అయితే కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయి, చికిత్స తీసుకొని ఆరోగ్యవంతులుగా బయటకొస్తున్న వారిని చూస్తుంటే భరోసా కలుగుతోంది. 
  • అలా కరోనాతో యుద్ధం చేసి గెలిచి వచ్చిన ఇద్దరితో ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో సంభాషించారు. వాళ్లు కరోనాను ఎలా ఎదుర్కొన్నారు? డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎలా చూసుకున్నారు? కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది? ఆ విషయాలు వాళ్ల మాటల్లోనే...


మొదట భయపడినా...


‘‘నా పేరు రామ్‌ గంపా తేజ. నేను ఐటీ రంగంలో పని చేస్తాను. వృత్తిలో భాగంగా ఒకరోజు దుబాయ్‌ వెళ్లాను. ఆ సమయంలోనే మెల్లమెల్లగా కరోనా విస్తరిస్తోంది. దుబాయ్‌లో సమావేశంలో పాల్గొని తిరిగి హైదరాబాద్‌ వచ్చేశాను. రెండు, మూడు రోజుల తరువాత జ్వరం మొదలయింది. వెంటనే వైద్యులను కలిశా. ఐదారు రోజులకు డాక్టర్లు కరోనా వైరస్‌ పరీక్షలు జరిపారు. అందులో పాజిటివ్‌ అని వచ్చింది. వెంటనే గాంధీ హాస్పిటల్‌లో చేర్చారు. కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయిన తరువాత చాలా భయమేసింది. సాధారణ జ్వరమే అయి ఉంటుంది అనుకున్నాను. అప్పటికి ఇండియాలో కరోనా కేసులు ఇద్దరు, ముగ్గురిలోనే బయటపడ్డాయి. డాక్టర్లు ‘‘నీకు కరోనా పాజిటివ్‌ వచ్చింది’’ అని చెబితే నమ్మలేకపోయాను. దుబాయ్‌లో వైరస్‌ ఎలా సంక్రమించిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. గాంధీ ఆస్పత్రిలో చేరిన తరువాత క్వారంటైన్‌లో ఉంచారు. 14 రోజుల తరువాత పూర్తిగా కోలుకున్నాను.


నమ్మకాన్ని కలిగించారు

క్వారంటైన్‌లో ఉన్నప్పుడు డాక్టర్లు, నర్సులు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. రోజూ ఫోన్‌ చేసి మాట్లాడేవాళ్లు. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాళ్లు. నాకు ఏమీ కాదన్న నమ్మకాన్ని కలిగించే వాళ్లు. మీరు తొందరగా కోలుకుంటారని చెప్పే వాళ్లు. మొదట్లో భయం వేసింది. కాని డాక్టర్లు చెబుతున్న మాటలు విన్న తరువాత కోలుకుంటానన్న ధైర్యం వచ్చింది. ఆస్పత్రిలో చేరినప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనకు గురయ్యారు. నాకు పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యాక మా కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. వాళ్లకు నెగిటివ్‌ వచ్చింది. అది మా కుటుంబ సభ్యులకే కాకుండా, చుట్టు పక్కల వారికి కూడా ఎంతో ఊరటనిచ్చింది. రోజూ డాక్టర్లు నాతో మాట్లాడడమే కాకుండా, మా కుటుంబ సభ్యులకు కూడా విషయాలు చెప్పేవారు. వారు ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఏ విధంగా చికిత్స చేస్తున్నారో వివరించే వారు.


స్వీయ నిర్బంధం అంటే జైలు కాదు

క్వారంటైన్‌ తరువాత మరో 14 రోజులు ఇంట్లో కూడా స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పారు. డాక్టర్లు చెప్పినట్టే చేశాను. ఇంట్లో ప్రత్యేక గదిలో ఉన్నాను. ఎప్పుడూ మాస్క్‌ ధరించాను. గదిలో నుంచి బయటకు వస్తే చేతులు శుభ్రంగా కడుక్కునే వాణ్ణి. చాలామంది క్వారంటైన్‌ అంటే  జైలులో ఉన్నట్లుగా భావిస్తున్నారు. కానీ అది తప్పు. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్‌ కేవలం వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది. అందరికీ ఈ విషయం తెలియాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోండి. డాక్టర్లు సలహాలు పాటిస్తే త్వరగా వైరస్‌ బారినుంచి బయటపడవచ్చు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి పట్టునే ఉంటూ, స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాపై విజయం కష్టమేమీ కాదు.’’


చాలామంది క్వారంటైన్‌ అంటే  జైలుగా భావిస్తున్నారు. కానీ అది తప్పు. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్‌ కేవలం వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది.


వైద్యుల సూచనలు పాటించాం!

‘‘నా పేరు అశోక్‌ కపూర్‌. మాది ఆగ్రా. మాకు చెప్పులు, బూట్లు తయారుచేసే కర్మాగారం ఉంది. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇటలీలో జరిగిన ఒక మేళాలో పాల్గొనడానికి మా అబ్బాయిలతో పాటు, మా అల్లుడు కూడా వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక ముందుగా మా అల్లుడికి కొద్దిగా అనారోగ్యంగా అనిపించింది. వెంటనే ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్ష చేసి కరోనా పాజిటివ్‌ అని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత వైద్యులు మా అబ్బాయిలను కూడా పరీక్షలకు రమ్మని చెప్పారు. వాళ్లతో మేము కూడా కలిసి ఉన్నాం కాబట్టి మమ్మల్నీ పరీక్షలు చేయించుకొమ్మన్నారు. మొత్తం అందరం కుటుంబ సభ్యులం పరీక్షలు చేయించుకున్నాం. నాకు, నా భార్యకు, ఇద్దరు అబ్బాయిలకు, కోడలు, నా మనవడికి.. మొత్తం అరుగరికి పాజిటివ్‌ అని తేలింది. అయితే మేం ఎవ్వరం కూడా భయపడలేదు. ముందే తెలియడం మంచిదయింది అనుకున్నాం. కరోనా నిర్ధారణ అయ్యాక ఆస్పత్రి వాళ్లే అంబులెన్స్‌ ఏర్పాటు చేసి సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 


ఆస్పత్రిలో బాగా చూసుకున్నారు

ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు చాలా బాగా చూసుకున్నారు. మమ్మల్ని వేర్వేరు గదుల్లో ఉంచారు. అన్ని సౌకర్యాలూ అందించారు. ఆస్పత్రిలో 14 రోజులు ఉన్నాం. డాక్టర్లు మాకు ఎంతో ఓపికగా చికిత్స అందించారు. అక్కడి సిబ్బంది కూడా ఎంతో సహకరించారు. అక్కడ అందరూ ఒకేరకమైన దుస్తులు వేసుకొని ఉండడంతో ఎవరు డాక్టర్లో, ఎవరు నర్సో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. వారు ఏది చెబితే దానిని మేం పాటించేవాళ్లం. మాకు ఎటువంటి కష్టం కలగలేదు. ఒక్క సమస్య కూడా ఎదురుకాలేదు. 


ఫోన్‌లో మాట్లాడుకున్నాం!

నా మనవడి వయస్సు పదహారేళ్లు. తను పరీక్షలు బాగా రాయాలని ప్రిపేర్‌ అవుతున్నాడు. ఆ సమయంలోనే కరోనా పాజిటివ్‌ అన్న విషయం బయటపడింది. అయితే పరీక్షలకన్నా ప్రాణం ముఖ్యం అని చెప్పి ఆస్పత్రిలో చేర్పించాం. తను గదిలో ఒంటరిగా ఉన్నా భయపడలేదు. డాక్లర్లు, నర్సులు ప్రత్యేకంగా చూసుకున్నారు. 

ఆస్పత్రిలో కుటుంబసభ్యులందరితో ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. నేరుగా కలుసుకోవడానికి లేదు కానీ ఫోన్‌లో మాట్లాడుకునేందుకు అనుమతిచ్చారు. డాక్టర్లు మాపట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మేం ఎప్పటికీ వారికి కృతజ్ఞులమై ఉంటాం. అందరూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్‌ను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఇంటికే పరిమితమై, స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను దేశం నుంచి తరిమేయవచ్చు. ఎటువంటి ఆందోళనకు గురికాకుండా తగిన సమయంలో.. తగిన చర్యలు తీసుకుంటూ.. అవసరమైనప్పుడు డాక్టర్లను సంప్రదిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం ఈ మహమ్మారిని ఓడించగలుగుతాం.’’ ఇంటికే పరిమితమై, స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను దేశం నుంచి తరిమేయవచ్చు

Advertisement
Advertisement
Advertisement