నిజాలను నీటముంచి అబద్ధాల కథనాలు!

ABN , First Publish Date - 2022-09-07T10:10:56+05:30 IST

పోలవరం పనులు వేగంగా జరుగుతున్న సమయంలో కాంట్రాక్టరును మార్చడం సరిదిద్దుకోలేని ప్రధాన తప్పని, కీలక సమయంలో కాంట్రాక్టరును తొలగించడం వల్ల...

నిజాలను నీటముంచి అబద్ధాల కథనాలు!

పోలవరం పనులు వేగంగా జరుగుతున్న సమయంలో కాంట్రాక్టరును మార్చడం సరిదిద్దుకోలేని ప్రధాన తప్పని, కీలక సమయంలో కాంట్రాక్టరును తొలగించడం వల్ల పోలవరం నిర్మాణం జాప్యం అవుతోందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి హైదరాబాద్ కుండబద్దలుకొట్టినట్టు చెప్పింది. అయినా దీనంతటికీ గత ప్రభుత్వం కారణం అంటూ సొంత పత్రికలో కథనాలు రాస్తున్నారు.


జగన్ మీడియా అబద్ధాల పరంపరకు అంతులేకుండా పోతోంది: చంద్రబాబు నాయుడు పద్ధతి ప్రకారం పనులు చేసివుంటే పోలవరం పూర్తయ్యేదని, ఈ ప్రాజెక్టును ఏటీఎంగా చూసారని, రూ.3,302కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో నవయుగ సంస్థకు కట్టబెట్టారని, గత ప్రభుత్వం స్పిల్‌వే పూర్తి చెయ్యకుండా ఎగువ కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్లే పోలవరంలో సమస్యలు తలెత్తాయని... ఇలా పచ్చి అబద్ధాలను వార్తా కథనాల రూపంలో అల్లుతోంది.


ప్రాజెక్టు మూలన పడటానికి ప్రధాన కారణాలు ఏమిటో, దానికి ఎవరు బాధ్యులో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–హైదరాబాద్ అధ్యయన కమిటీ తేల్చి చెప్పింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం పోలవరం ద్రోహిగా తేలిన జగన్‌రెడ్డి దానికి సమాధానం చెప్పలేక చంద్రబాబుపై సొంత పత్రికలో నిత్యం రోత కథనాలను రాయిస్తున్నారు. అవినీతి జరిగిందన్న అబద్ధపు ప్రచారంతో కాంట్రాక్టరును తొలగించి రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం నిర్మాణాన్ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది జగన్. పోలవరం అవినీతిని తేలుస్తామంటూ వేసిన కమిటీ తన నివేదికను ఇచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇప్పటిదాకా ఏ ఒక్కరిపైనా చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారో జగనే సమాధానం చెప్పాలి. పోలవరం నిర్మాణం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో జరిగింది. పోలవరంలో ఎటువంటి అవినీతి జరిగినట్లు మా దృష్టికి రాలేదని లోక్‌సభలో కేంద్ర జలశక్తి మంత్రి వెల్లడించారు. అయినా సరే జగన్ మీడియా దేశ చరిత్రలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదే అతి పెద్ద స్కామ్ అంటూ రోత రాతలు రాస్తున్నది.


2019 నవంబరులో రివర్స్‌ టెండర్ల పేరుతో గుత్తేదారును మార్చేసి, మరో కంపెనీకి పోలవరం పనులను అప్పగించారు. ఆ తర్వాతి నుంచి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 2020 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చిన వరదల వలన డయాఫ్రమ్ వాల్‌ దెబ్బతింది. కానీ ఆ విషయాన్ని 2022 మార్చి వరకు ప్రజలకు కాని, పోలవరం అథారిటీకి కాని చెప్పకుండా దాచిపెట్టారు. తర్వాత తన తప్పులను చంద్రబాబు పైకి నెడుతున్నారు. ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణాలను సకాలంలో పూర్తి చెయ్యలేకపోయారు. దిగువ కాఫర్ డ్యాం సకాలంలో నిర్మించి ఉంటే వరద ఇబ్బందులు లేకుండా పనులు జరిగే అవకాశం ఉండేది. దిగువ కాఫర్ డ్యాం సకాలంలో నిర్మించలేకపోయారని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఇప్పుడు పోలవరం నిర్మాణం పూర్తిగా పడకెయ్యటంతో ఇప్పుడు తన చేతకానితనాన్ని చంద్రబాబు ఖాతాలో వేసి తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.


చంద్రబాబు ప్రభుత్వం స్పిల్‌వే పూర్తి చెయ్యకుండా ఎగువ కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడంవల్లే పోలవరంలో సమస్యలు తలెత్తాయని జగన్ మీడియా రాస్తోంది. కానీ సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్‌లను పూడ్చకపోవడం వల్లనే సమస్యలు వచ్చాయని హైదరాబాద్ ఐఐటి నిపుణులు తేల్చి చెప్పారు. అంతేతప్ప స్పిల్‌వే కట్టకుండా డయాఫ్రం వాల్, ఎగువ కాఫర్ డ్యాంలు నిర్మించడం తప్పని నిపుణులు కూడా చెప్పలేదు. కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్న సమయంలో కాంట్రాక్టరును మార్చడం సరిదిద్దుకోలేని ప్రధాన తప్పని, కీలక సమయంలో కాంట్రాక్టరును తొలగించి కొత్త కాంట్రాక్టరుకు పనులు అప్పగించడం వల్ల పోలవరం నిర్మాణం జాప్యం అవుతోందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి హైదరాబాద్ కుండబద్దలుకొట్టినట్టు చెప్పింది.


2019 మే 30న కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం ఎగువ కాఫర్ డ్యాం పని 73.94 లక్షల క్యూబిక్ మీటర్లు చెయ్యాల్సి ఉండగా 2019 మే నాటికే అందులో 38.12 లక్షల క్యూబిక్ మీటర్ల పనిని ఆరునెలల్లో గత ప్రభుత్వం చేసింది. కానీ మిగిలిన 35.82 లక్షల క్యూబిక్ మీటర్ల పని అదే సమయంలో జగన్ ప్రభుత్వం ఎందుకు చెయ్యలేదు? ఆ పనులు చేయాల్సింది జగన్ ప్రభుత్వం కాదా? 2020 జనవరిలో జరిగిన సమావేశంలోనే జూన్ నాటికి కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చెయ్యాలని చెప్పినా ఆ విలువైన సమయాన్ని వినియోగించుకోలేదని అథారిటీ సీఈవో తెలిపారు. ఆ వైఫల్యాన్ని చెప్పకుండా పోలవరం అథారిటీ గ్యాప్‌లు పూడ్చవద్దని చెప్పినందున 2020లో పనులు చెయ్యలేదని అబద్ధాలకు తెగబడ్డారు.


పునరావాసం విషయంలోనూ జగన్‌ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. వైఎస్‌ హయాంలో ఇచ్చిన భూములకు ఎకరానికి రూ.5లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు అతీగతీ లేదు. పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షలకు పెంచుతామని ప్రతిపక్ష నాయకుడిగా హామీ ఇచ్చినా ప్రస్తుతం గరిష్ఠంగా ఎస్టీలకు రూ.6.86లక్షలు, గిరిజనేతరులకు రూ.6.36లక్షలు మాత్రమే ఇస్తున్నారు. మూడేళ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి.


జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది. నేడు పోలవరంపై జగన్ నాలుక నాలుగు వంకర్లు తిరుగుతోంది. ఇప్పుడు– ఇదంతా తాను ఒక్కణ్నీ చేయగలిగేది కాదని, కేంద్రంపై ఒత్తిడి తెస్తానని, వాళ్లు నిధులిస్తే ప్రాజెక్టు పూర్తి చేస్తానని, ఇవ్వకపోతే తాను మాత్రం ఏం చేయగలననీ చేతులెత్తేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ పోలవరం ప్రాజెక్టుకు రూ.55,548కోట్ల అంచనాలను ఆమోదించి నిధులివ్వాలని కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పటికీ రెండో డీపీఆర్‌ను జగన్ ప్రభుత్వం ఆమోదింప చేసుకోలేకపోయింది. కేంద్రం కొర్రీలపై కొర్రీలు వేస్తున్నా పరిష్కరించుకోవటం చేతకాలేదు. నాడు ప్రతిపక్షంలో డీపీఆర్‌ ఆమోదించుకోలేక పోయారని విమర్శలు చేసిన పెద్దమనిషి ఇప్పుడు ‘నేను ఏమి చేయగలను’ అని చేతులెత్తేశారు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టును ఇదిగో పూర్తి చేసేస్తాం, అదిగో పూర్తి చేసేస్తాం అంటూ రంకెలు వేశారు. 2021 డిసెంబరు నాటికే పూర్తి చేస్తామని మొదట గప్పాలు కొట్టారు. తర్వాత 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం పూర్తి చేసి నీళ్లిచ్చేస్తామని సవాళ్లు చేశారు. తర్వాత 2023 ఖరీఫ్ నాటికి అన్నారు. ఇప్పుడు ఏకంగా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేయగలమో చెప్పలేమని సాక్షాత్తూ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేతులెత్తేశారు. ఇది పోలవరంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అయినా దీనంతటికీ గత ప్రభుత్వం కారణం అంటూ సొంత పత్రికలో కథనాలు రాస్తున్నారు. పోలవరంలో నిజమేదో, అబద్ధమేదో ప్రజలు తెలుసుకోవాల్సిన తరుణం ఇది.

l దేవినేని ఉమామహేశ్వరరావు

జలవరుల మాజీ మంత్రి

Updated Date - 2022-09-07T10:10:56+05:30 IST