Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 29 Nov 2021 05:51:46 IST

ఆగిన శివ శంకర నృత్య విన్యాసం

twitter-iconwatsapp-iconfb-icon

ఆయన పాదం కదిపితే... ప్రవాహం.

ఆ వేగం.. మరొకరికి అనితర సాఽధ్యం.

నాటు పాట, నీటు పాట..

క్లాసికల్‌.. కమర్షియల్‌.. ఏదైనా సరే, ఆ బీటుకి తగ్గట్టు, ఆ ట్యూన్‌కి సరితూగేట్టు స్టెప్పులు సిద్ధమైపోతాయి.

‘రగులుతోంది మొగలిపొద’లో నాగినిలా మెలికలు తిరిగిపోయిన చిరంజీవి - మాధవిల శృంగార భంగిమల వెనుక... ఆయనున్నారు.

‘ధీర ధీర ధీర మనసాగలేదురా’ లో చరణ్‌ - కాజల్‌ల కవ్వింతలకు నడకలు నేర్పింది ఆయనే.

‘మన్మథరాజా... మన్మథరాజా..’ అంటూ ఓతరాన్ని ఊపు ఊపేసిన స్టెప్పులకు మూలం.. మళ్లీ ఆయనే.

ఆయనే... శివ శంకర్‌ మాస్టర్‌. 

నాలుగు దశాబ్దాలు, వందల పాటలు, ఎన్నో పురస్కారాలు. ఆనాటి ఎన్టీఆర్‌ నుంచి.. ఇప్పటి జూనియర్‌ వరకూ, అప్పటి ‘ఖైదీ’ నుంచి ఇప్పటి ‘సైరా’ వరకూ... మూడు తరాల హీరోలతో స్టెప్పులు వేయించిన శివ శంకర్‌ మాస్టర్‌ ప్రయాణం... ఓసారి పరికిస్తే...


నుదుటున తిలకం. అడ్డంగా పరుచుకున్న విబూధి. పంచె, ఝుబ్బా.. మెడలో  కండువా, చేతికి ఉంగరాలు.. నడిస్తే నాట్యం చేస్తున్న అనుభూతి.. ఇదీ శంకర్‌ మాస్టర్‌. ఆయన వాచకం, పలకరించే తీరు, నమస్కరించే పద్ధతి.. భిన్నంగా ఉంటాయి. ఇవన్నీ శివ శంకర్‌ మాస్టర్‌ ప్రత్యేకతలుగా మిగిలిపోయాయి. ఈతరానికి శివ శంకర్‌ మాస్టర్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన కనిపించే స్టైలే. కానీ.. ఈ దశకు రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్నారు.


‘మగపిల్లాడివై ఉండి డాన్స్‌ నేర్చుకోవడం ఏమిటి?’

ఈరోజుల్లో ఇలా ఎవరైనా అంటారా? కానీ శివ శంకర్‌ మాస్టర్‌ చిన్నప్పటి పరిస్థితులు వేరు. 1960లలో.. ఓ కుర్రాడు క్లాసికల్‌ డాన్స్‌ నేర్చుకుంటానంటే, కాళ్లకి గజ్జె కడతానంటే... ‘నీకెందుకు డాన్స్‌’ అని ఆపేసేవాళ్లే ఎక్కువ. చిన్ననాటి శివ శంకర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ‘డాన్స్‌ నేర్చుకుంటాను నాన్నా’ అంటే కాస్త అనుమానంగా చూశారు. ఆ తరవాత శివ శంకర్‌ మాస్టర్‌ అద్దం ముందు నిలబడి, రకరకాల హావభావాలను ప్రదర్శిస్తూ, తనలో తాను మురిసిపోతుంటే.. ఇంట్లో వాళ్లకు అనుమానం వచ్చింది. ‘వీడికేమైందో’ అంటూ జాతకాన్ని జ్యోతిష్యుడికి చూపించారు. ‘మీ అబ్బాయిలో కళాకారుడు కళకళలాడుతున్నాడు..’ అంటూ భవిష్యత్తు చెప్పేశాడాయన. దాంతో చేతులకు గజ్జెలు అందివ్వక తప్పలేదు. ఏడేళ్ల పాటు.. సంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకున్న శివ శంకర్‌ మాస్టర్‌... ఆ తరువాత సలీమ్‌ మాస్టార్‌ దగ్గర శిష్యరికం చేశారు. ఆయనకు ప్రీతిపాత్రుడైన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. సలీమ్‌ అంటే అప్పట్లో.. డాన్స్‌ కింగ్‌. అన్ని సినిమాలకూ ఆయనే.. డాన్స్‌ మాస్టర్‌. ఎప్పుడైనా సలీమ్‌ మాస్టర్‌ అందుబాటులో లేకపోతే, ఆయా పాటల్ని కంపోజ్‌ చేసే బాధ్యత శంకర్‌పై పడేది. అందుకే ఆయన్ని ‘చిన్న మాస్టారు’ అని పిలిచేవారప్పుడు. అలా.. ‘ఖైదీ’ చిత్రంలో ‘రగులుతోంది మొగలిపొద’ పాటకు స్టెప్పులు కంపోజ్‌ చేసి పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచీ.. ఆయన నృత్య ప్రయాణం ఒడిదుడుకుల్లేకుండా ఎక్స్‌ప్రెస్‌ రైలుగా.. పరుగెడుతూనే ఉంది.


వెన్నెముక విరిగింది

ఎవరైనా కాస్త డాన్స్‌ బాగా చేస్తే.. వీడికి వెన్నెముక ఉందా? లేదా? అని ఆశ్చర్యపోతుంటారు. శివ శంకర్‌ మాస్టర్‌ విషయంలో అదే నిజమైంది. చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముక విరిగింది. ఏడాదిన్నర వయసులో.. శివ శంకర్‌ జీవితంలో ఓ చేదు ఘటన జరిగింది. శివ శంకర్‌ని పెద్దమ్మ ఒడిలో తీసుకుని ఆడిస్తుంటే, అటువైపుగా ఓ ఆవు దూసుకొచ్చింది. తమనేమైనా చేస్తుందేమో అన్న భయంతో.. ఆమె పరుగులు పెడుతూ.. ఓ చోట చేతిలో బాబుతో సహా పడిపోయింది. అప్పుడే శివ శంకర్‌ వెన్నెముకకి గాయమైంది. ఎంతమంది వైద్యులకు చూపించినా నయం కాలేదు. దాదాపు ఎనిమిదేళ్లు మంచంపైనే ఉండిపోవాల్సివచ్చింది. అలాంటిది పెరిగి పెద్దవాడై, ఓ డాన్స్‌ మాస్టరుగా మెలికలు తిరిగే స్టెప్పులు వేయించడం, ఈరంగంలో అత్యున్నత స్థాయికి ఎదగడం నిజంగా అబ్బురమే.


అర్థనారీశ్వర

శివ శంకర్‌ మాస్టర్‌ నవ రసాల్నీ అద్భుతంగా పండిస్తారు. అందులో సరసం, శృంగారం అంటే మరీ ఇష్టం. ఆయన అభినయంలో, వాచకంలో ఆడదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నిజాన్ని ఆయనా ఒప్పుకున్నారు. కాస్త గర్వంగా. ‘శివ శంకర్‌లో శివుడూ ఉన్నాడు.. శంకరీ ఉంది’ అనేవారు ఆయన. నృత్య దర్శకుడిగా బిజీగా ఉంటూనే, నటనపైనా దృష్టిసారించారు. దాదాపుగా ముఫ్ఫై చిత్రాల్లో నటించారు. ‘ఢీ’లాంటి నృత్య ఆధారమైన రియాలిటీ షోలకు ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆ షోల వల్ల శివ శంకర్‌ మాస్టర్‌ మరింత పాపులర్‌ అయ్యారు. ఈయనపై కూడా చాలా మీమ్స్‌ తయారయ్యాయి. వయసు పైబడుతున్నా.. నాట్యంపై మమకారం పోలేదు. అవకాశం దక్కినప్పుడల్లా తనని తాను నిరూపించుకోవడానికి గజ్జె కడుతూనే ఉన్నారు. ‘చివరి శ్వాస వరకూ నాట్యాన్ని వీడకూడదు.. ఏదో ఓ రూపంలో పనిచేస్తూనే ఉండాలి’ అని తరచూ చెబుతూనే ఉండేవారు. అన్నట్టుగానే సినిమాతోనే మమేకం అయిపోయారు.


శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూత

ప్రముఖ నృత్య దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత కె. శివ శంకర్‌ (72) కన్నుమూశారు. కొవిడ్‌ బారిన పడి గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ ఎంఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శివశంకర్‌ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో చిరంజీవి, సోనూసూద్‌, ధనుష్‌ వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చారు. కరోనా నుంచి విముక్తి పొందినా ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన్ని వైద్యులు కాపాడలేకపోయారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. 


10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసిన శివ శంకర్‌ మాస్టర్‌ మూడు తరాల కథానాయకులతో స్టెప్పులు వేయించారు. నటుడుగానూ మెప్పించారు. 


1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించిన శివశంకర్‌కు బాల్యం నుంచి డ్యాన్స్‌ అంటే మమకారం. నటరాజ శకుంతల దగ్గర ఏడేళ్లపాటు పలు నృత్యరీతుల్లో శిక్షణ తీసుకున్నారు.  1975లోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శివశంకర్‌ ‘పాట్టుం భారతముమ్‌’ తమిళ చిత్రంతో అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా అరంగేట్రం చేశారు. 1980లో ‘కురువికూడు’ చిత్రంతో డాన్స్‌ మాస్టర్‌గా మారారు. 2013లో వచ్చిన ‘బాహుబలి: ద బిగెనింగ్‌’ డాన్స్‌ మాస్టర్‌గా ఆయన చివరి చిత్రం. తమిళనాడు ప్రభుత్వం నుంచి నాలుగుసార్లు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్‌ అందుకున్నారు. 2008లో వచ్చిన రామ్‌చరణ్‌ ‘మగధీర’ చిత్రంలోని ‘ధీర ధీర ధీర’ పాటకు గాను ఉత్తమ నృత్య దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. బెంగళూరుకి చెందిన న్యూ క్రిస్టియన్‌ యూనివర్సిటీ ఆయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 2013లో శింబు హీరోగా నటించిన ‘అలై’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసి, 30కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు  పోషించారు. పలు తెలుగు, తమిళ టీవీ సీరియళ్లలోనూ నటించారు. తెలుగు నాట ఆదరణ పొందిన పలు టీవీ డ్యాన్స్‌ షోలకు ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 


‘‘శివ శంకర్‌ మాస్టర్‌ మరణ వార్త నన్ను కలచివేసింది. ఒక ఆత్మీయుడిని కోల్పోయాను. ఆయన మృతి నృత్య కళారంగానికే కాదు యావత్‌ సినీ పరిశ్రమకే తీరని లోటు’’. 

చిరంజీవి


‘‘శాస్త్రీయ నృత్యంలో పట్టున్న శివశంకర్‌ మాస్టర్‌ సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారు. వందల చిత్రాల్లోని పాటలకు తన కళ ద్వారా నృత్యరీతులను అందించిన శివ శంకర్‌ మాస్టర్‌ ఆత్మకు శాంతి చేకూరాలి’’. 

పవన్‌ కల్యాణ్‌


‘‘మాస్టారుని కాపాడేందుకు నా వంతు ప్రయత్నించాను. సినీ పరిశ్రమ ఆయన్ని మిస్‌ అవుతుంది. ఈ కష్టకాలంలో వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలి’’. సోనూసూద్‌


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement