ఆగిన ఫార్మా రహదారి పనులు

ABN , First Publish Date - 2022-06-20T04:22:51+05:30 IST

యాచారం మండలం మేడిపల్లి, కుర్మిద్ద, తాడిపర్తి,

ఆగిన ఫార్మా రహదారి పనులు

  • రెండు నెలలుగా ముందుకు సాగని రోడ్డు నిర్మాణం 
  • ఎందుకు ఆపేశారో చెప్పని అధికారులు 
  • పలు వదంతులు ప్రచారం


యాచారం, జూన్‌ 19 : యాచారం మండలం మేడిపల్లి, కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్‌ గ్రామాల పరిధిలో జరుగుతున్న ఫార్మాసిటీ రహదారి నిర్మాణ పనులు రెండు నెలలుగా ఆగిపోయాయి. ఈ ప్రాంతంలో 20కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు జరిగాయి. రహదారి పనులు జోరుగా సాగుతున్న సమయంలో మేడిపల్లి, కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్‌ గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు పరిహారం కోసం కోర్టులో కేసు వేశారు. అందుకే రోడ్డు పనులు ఆగినట్లు మండలంలో ప్రచారం జరుగుతుంది. ఇదే విషయమై సంబంధిత అఽధికారులను వివరణ కోరితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. పనులు ఆగిపోవడంతో రహదారి నిర్మానానికి ఉపయోగించే టిప్పర్లు, రోలర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాటి మెయింటెన్స్‌ తలనొప్పిగా మారిందని టిప్పర ్లడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వల్లే ఫార్మా రహదారి పనులు ఆగిపోయాయని, శాశ్వతంగా ఆపడానికి కోసం తాము చర్యలు తీసుకుంటున్నామని కొందరు రాజకీయ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు చేసి.. ఆ భూముల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడంతోపాటు యువతకు ఉపాధి చూపి ఆదుకుంటామని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. 

ఇదిలాఉండగా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట నుంచి యాచారం మండలంలోని నజ్దిక్‌సింగారం గ్రామాల మధ్య ఫార్మాసిటీ రహదారి విస్తరణ పనులు వారంరోజులుగా యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. రహదారికి ఇరువైపులా ఉన్న పంటపొలాల్లో హద్దులు గుర్తించి విస్తరణ పనులు చేస్తున్నారు. మీర్‌ఖాన్‌పేట నుంచి యాచారం మండల కేంద్రం వరకు రహదారి నిర్మాణానికి సుమారు రూ.79 కోట్లు, నందివనపర్తి నుంచి ఫార్మాసిటీ వరకు రూ.48 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. యాచారం మండల కేంద్రం వరకు రెండు నెలల్లో రహదారి పనులు పూర్తి చేయాలని  ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలుస్తుంది. నజ్దిక్‌సింగారం గ్రామం శివారు నుంచి గ్రామం పక్క నుంచి ఊరి చివరన పాత రహదారిని కలిపేందుకు ప్రభుత్వం డిజైన్‌ చేసినట్లు తెలుస్తుంది. అలాగే నందివనపర్తి గ్రామం నుంచి కాకుండా మరోచోట నుంచి రహదారి వేయడం కోసం అధికారులు మూడేళ్లుగా భూసేకరణకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పరిహారం విషయంలో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

కాగా నందివనపర్తి, మేడిపల్లి నుంచి ఫార్మాసిటీకి వెళ్లే దారికి ఇంకా భూసేకరణ పూర్తికాలేదు. ఎకరాకు రూ.50 లక్షలు ఇస్తేనే ఫార్మా రోడ్డుకు భూమి ఇస్తామని ఆ గ్రామాల రైతులు తేల్చి చెబుతున్నారు. భూమి కోల్పోతున్న రైతులకు బేగరికంచలో 121 గజాల ఇంటిస్థలంతోపాటు ఫార్మాసిటీలో ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం  హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుంటేనే రహదారి కోసం భూములిస్తామని రైతులు చెబుతున్నారు. 


యాచారంలో అంబేద్కర్‌ విగ్రహం నుంచి దారి వేయొద్దు

ఫార్మాసిటీ రహదారి పనులు తమ గ్రామం నుంచి వేస్తే ఇళ్లను కోల్పోయి వీధిన పడతామని నజ్దిక్‌సింగారం, నందివనపర్తి, యాచారం గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల నుంచి కాకుండా వేరేచోట నుంచి రోడ్డు వేయించాలని జిల్లా కలెక్టర్‌, టీఎస్‌ఐఐసీ అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. యాచారంలో అంబేద్కర్‌ విగ్రహం నుంచి కాకుండా మరోచోట నుంచి రహదారి వేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


ఫార్మాసిటీ వద్దంటుంటే.. రహదారి ఎందుకు?

తాము అసలు ఫార్మాసిటీ వద్దంటుంటే రహదారి ఎందుకు వేస్తున్నారో అర్ధం కావడం లేదు. కందుకూరు నుంచి యాచారం మండల కేంద్రం వరకు నాలుగు లేన్ల రహదారి వేస్తే మంచిదే. కానీ ఫార్మాసిటీ వద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మారుమూల గ్రామాల రహదారులను ఎందుకు బాగు చేయడం లేదు. 

- బి.రాజశేఖర్‌రెడ్డి సర్పంచ్‌ కుర్మిద్ద 


Updated Date - 2022-06-20T04:22:51+05:30 IST