ఆగిన ‘హంద్రీ’

ABN , First Publish Date - 2022-05-16T04:53:52+05:30 IST

వైసీపీ ప్రభుత్వం వచ్చాక హంద్రీ నీవా తొలి దశలోని పనులు ఆగిపోయాయి. జిల్లాలో 8 టీఎంసీల నీటిని 80 వేల ఎకరాలకు అందించే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం 2005లో పనులు ప్రారంభించింది.

ఆగిన ‘హంద్రీ’
అసంపూర్తిగా నిలిచిపోయిన పందికోన రిజర్వాయరు పనులు

  1.  ఆగిపోయిన మొదటి దశ పనులు
  2. జీవో 365తో రెండున్నరేళ్లుగా నిలిపివేత 
  3. గత టీడీపీ హయాంలో చకచకా పనులు
  4. 80 వేల ఎకరాల సాగు ప్రశ్నార్థకం
  5. ఆశగా ఎదురుచూస్తున్న రైతులు 

పశ్చిమ ప్రాంత పంట కాలువల్లో హంద్రీనీవా పారేనా? అనే సందేహం కలుగుతోంది.  మొదటి దశలో భాగంగా  పత్తికొండ, ఆలూరు మండలాల్లో పంట కాలువలు నిర్మించాల్సి ఉంది. పందికోన రిజర్వాయర్‌  రివిట్మెంట్‌, లింక్‌ చానల్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పనులు చకచకా జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక వీటిని ముందుకు తీసుకపోకపోగా జీవో 365 తెచ్చి అడ్డుకున్నది. రెండన్నరేళ్లుగా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బీడువారిన తమ పొలాలకు నీరు అందేనా? అని దుర్భిక్ష పశ్చిమ రైతులు ఎదురు చూస్తున్నారు.  సాగు నీరు లేక ఈ ప్రాంత రైతులు వలస వెళ్లాల్సిన దుస్థితి.   ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం హంద్రీ నీవా పంట కాలువలు నిర్మించి ఉంటే జిల్లాలో 80వేల ఎకరాలకు సాగు నీరు అందేది. 


కర్నూలు (అగ్రికల్చర్‌), మే 15: వైసీపీ ప్రభుత్వం వచ్చాక హంద్రీ నీవా తొలి దశలోని పనులు ఆగిపోయాయి. జిల్లాలో 8 టీఎంసీల నీటిని 80 వేల ఎకరాలకు అందించే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం 2005లో పనులు ప్రారంభించింది. పత్తికొండ, ఆలూరు మండలాల్లో పంటకాలువలు, పందికోన రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులు ముగింపులో ఉండగా ప్రభుత్వం మారింది. టీడీపీ హయాంలో ఇరిగేషన ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయని జగన ప్రభుత్వం పనులు నిలిపివేస్తూ జీవో 365ను తీసుకొచ్చింది. దీని వల్ల హంద్రీ నీవా పనులు ఆగిపోయాయి. ఫలితంగా 80 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం అయింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో  కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గ పరిధిలో 41వేల ఎకరాలు, పత్తికొండ నియోజకవర్గంలో  20వేల ఎకరాలు, నందికొట్కూరు, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల పరిధిలో 19వేల ఎకరాలకు సాగు నీరు అందవలసి ఉంది.  ప్రభుత్వ నిర్ణయం వల్ల తుది దశకు చేరుకున్న హంద్రీనీవా సృజల స్రవంతి మొదటి దశ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 


జీవో నెంబరు 365తో నిలిచిన పనులు

ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిపడా నిధులను కేటాయించడంతోపాటు నీటి పారుదల ఇంజనీరింగ్‌ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ప్రధాన కాలువతో పాటు అన్ని పనులు చివరి దశకు చేరుకున్నాయి. 23వ ప్యాకేజీ నుంచి 29 ప్యాకేజీ వరకు 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 40వేల ఎకరాలకు కూడా పూర్తి స్థాయిలో నీరందించలేని పరిస్థితి ఉంది. 23వ ప్యాకేజీ నుంచి 26వ ప్యాకేజీ వరకు 13,500 ఎకరాలకు, అదేవిధంగా 27వ ప్యాకేజీ నుంచి 29 వరకు 30వేల ఎకరాలకు మాత్రమే సాగు నీటిని అందిస్తున్నారు. పందికోన రిజర్వాయరు పనులు పూర్తి కాకపోవడంతోపాటు పంట కాలువల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. మొదటి దశ కింద చేపట్టిన రూ.4,500 కోట పనులను 365 జీవోతో వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని రైతు సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో ఆలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం, పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి ఆయకట్టు రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. 

సాగు విస్తీర్ణం ప్యాకేజీల వారీగా..

23వ ప్యాకేజీలో 4,200 ఎకరాలు, 24వ ప్యాకేజీలో 2,300 ఎకరాలు, 25వ ప్యాకేజీలో 1900 ఎకరాలు, 26వ ప్యాకేజీలో 5,100 ఎకరాలు, 27వ ప్యాకేజీలో 5,100 ఎకరాలు, 28వ ప్యాకేజీలో 29,200 ఎకరాలు, 29వ ప్యాకేజీలో 32,200 ఎకరాలు మొత్తం 80వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నందికొట్కూరు, కల్లూరు, కర్నూలు, కోడుమూరు, వెల్దుర్తి, కృష్ణగిరి, దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి మండలాలకు లబ్ధి చేకూరనుంది. 


ఆ నీరంతా ఎగువ జిల్లాకే.. 

హంద్రీనీవా ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో ప్రతి యేటా ఈ కాలువ ద్వారా విడుదలవుతున్న నీరు ఎగువ జిల్లా అనంతపురం జిల్లాకే ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. 2012 మే నెలలో శ్రీశైలం జలాశయం నుంచి రెండు టీఎంసీల నీటిని హంద్రీనీవా కాలువకు మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేశారు. ఆ తర్వాత 2013-14లో 9.900 టీఎంసీలు, 2014-15లో 16.806 టీఎంసీలు, 2015-16లో 7.79 టీఎంసీలు, 2016-17లో 34.771 టీఎంసీలు, 2017-18లో 34.771 టీఎంసీలు, 2018-19లో 43 టీఎంసీలు, 2019-20లో 38 టీఎంసీలు, 2020-21లో 16 టీఎంసీల నీటిని ఈ కాలువకు విడుదల చేశారు. 80 శాతం నీళ్లన్నీ అనంతపురం, చిత్తూరు జిల్లాలకే తరలిపోయాయి. 20 శాతం నీళ్లను మాత్రమే కర్నూలు జిల్లా అవసరాలకు వినియోగించామని అధికారులే చెబుతున్నారు. పంట కాలువల నిర్మాణం చేపట్టి 23, 24, 25, 26 ప్యాకేజీల్లో 13,500 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారు. మిగిలిన ప్యాకేజీలు 27, 28, 29లలో 61వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా 30వేల ఎకరాలకు మించి నీరందించలేని పరిస్థితి. 


 61వేల ఎకరాలకు సాగునీరు అందాలంటే..

పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 61వేల ఎకరాలకు సాగునీరందాలంటే.. పత్తికొండ రిజర్వాయరును పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని, రివిట్మెంట్‌ పూర్తి చేయాలని, లింక్‌ చానల్‌తో పాటు ఆనకట్ట కింద లీకేజీ నీరు పారేందు కోసం కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉందని నీటి పారుదల అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఈ పనులు గనుక కొనసాగించి ఉంటే.. రూ.35 కోట్లతో ఈ పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉండేదని, రెండున్నరేళ్లుగా పనులు నిలిచిపోవడం వల్ల అంచనా రేట్లు పెరిగి దాదాపు రూ.300 కోట్ల నిధులు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరి రిజర్వాయరు నిర్మాణాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశారు. దీంతో ఆ రిజర్వాయరు కింద స్థిరీకరించిన ఐదువేల ఎకరాలకు పంట కాలువల నిర్మాణం పూర్తి చేసి సాగునీటిని అందిస్తున్నారు. అదే నియోజకవర్గంలోని పందికోన రిజర్వాయరు కింద తుగ్గలి, పత్తికొండ, దేవనకొండ, గోనెగండ్ల నియోజకవర్గాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 40వేల ఎకరాలకు పైగా ఉంది. ఈ ఆయకట్టుకు నీరందాలంటే.. పందికోన రిజర్వాయరును పూర్తి స్థాయిలో ఆధునీకరించడంతోపాటు ఆ రిజర్వాయరులో 1.129 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

ప్రభుత్వానికి నివేదిక పంపుతాం - సదాశివరెడ్డి, ఈఈ: 

పనులు నిలిచిపోవడం వల్ల అంచనా ఖర్చు పెరిగిపోయింది. మళ్లీ ఈ పనులను చేపట్టడానికి ఇటీవల  మంత్రి జయరాం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించాం. ఈ పనులు చేయాలంటే దాదాపు రూ.300 కోట్ల నిధులు అవసరమవుతాయి. అంచనా రూపొందించి నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.

ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలి -రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి: 

వైసీపీ ప్రభుత్వం హంద్రీ పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపుతోంది. ఏటా ఈ కాలువకు విడుదల చేస్తున్న నీళ్లన్నీ అనంతపురం, చిత్తూరు జిల్లాలకే తరలిపోతున్నాయి. కర్నూలు జిల్లా రైతులు పది శాతం నీళ్లు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. కళ్లెదుటే నీళ్లున్నా.. చుక్కనీరు తీసుకోలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది. ఇప్పటికైనా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాంతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించాలి.  


కర్నూలు జిల్లాలో ప్యాకేజీల వారీగా స్థిరికరించిన ఆయకట్టు: (ఎకరాల్లో) 

----------------------------------------------------------------------------------------------

ప్యాకేజీ స్థిరీకరించిన ఆయకట్టు నీళ్లిస్తున్న ఆయకట్టు  

-------------------------------------------- 

23వ ప్యాకేజీ 4,200 4,200

24వ ప్యాకేజీ 2,300 2,300

25వ ప్యాకేజీ 1,900 1,900

26వ ప్యాకేజీ 5,100 5,100

27వ ప్యాకేజీ 5,100 4,600

28వ ప్యాకేజీ 29,200 17,000

29వ ప్యాకేజీ 32,200 16,000

----------------------------------------------------------------------------------------------

మొత్తం 80వేల ఎకరాలు 51,100 ఎకరాలు

ఇంకా 29వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది.

ఆయకట్టు రైతులు వచ్చే ఖరీఫ్‌లోనైనా తమ పొలాలకు నీరందించాలని నీటి పారుదల అధికారులను, మంత్రులకు మొర పెట్టుకుంటున్నారు.

---------------------------------------- 

Updated Date - 2022-05-16T04:53:52+05:30 IST