నేను ఇక్కడే కూర్చుంటా.. నేలపై సీఎం బైఠాయింపు నిరసన

ABN , First Publish Date - 2021-10-05T21:39:10+05:30 IST

లఖింపూర్ కేరి హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు

నేను ఇక్కడే కూర్చుంటా.. నేలపై సీఎం బైఠాయింపు నిరసన

లక్నో: లఖింపూర్ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు ఎట్టకేలకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ మంగళవారం లక్నో విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడానికి పోలీసు అధికారులు అనుమతించకపోవడంతో ఆయన నేలపైనే బైఠాయింపు నిరసనకు దిగారు. తనను అనుమతించకపోవడానికి కారణం చెప్పాలంటూ అధికారులను నిలదీశారు. ఇందుకు సంబంధిచిన వీడియోను బఘెల్ ట్వీట్ చేశారు.


''ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్లడానికి ఎందుకు అనుమతించడం లేదు. నాకు లఖింపూర్ కేరి వెళ్లే ఉద్దేశం లేదు'' అని అధికారులను భూపేశ్ బఘెల్ నిలదీస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. లఖింపూర్ హింసాత్మక ఘటనలో 4 రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. లఖింపూర్ బయలుదేరిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని సోమవారం యూపీలోని సీతాపూర్‌లో నిర్బంధించి పీఏసీ గెస్ట్ హౌస్‌కు తరలించారు. ప్రియాంకను కలిసేందుకు వెళ్లాలనుకున్న భూపేష్ బఘెల్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు ఆపేయడంతో ఆయన బైఠాయింపు నిరసనకు దిగారు. దీనికి ముందు, ఆయన ఒక ట్వీట్‌లో లక్నో విమానాశ్రయంలో దిగడానికి తనను బీజేపీ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతించడం లేదంటూ మండిపడ్డారు. యూపీలో పౌర హక్కులను రద్దు చేశారా? అని నిలదీశారు.

Updated Date - 2021-10-05T21:39:10+05:30 IST