ఉచిత బియ్యం పంపిణీకి మంగళం!

ABN , First Publish Date - 2022-05-25T06:55:22+05:30 IST

కొవిడ్‌ మొదటి, రెండు దశల్లో ఏర్పడిన పరిస్థితులు, లాక్‌డౌన్‌లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2020లో ఈ ఉచిత బియ్యం (ఆహార ధాన్యాలు) పంపిణీ ప్రారంభించి మధ్యలో విరామం అనంతరం 2021లో కొనసాగించింది. 2022 మార్చితో ఉచిత పంపిణీ ముగిసినప్పటికీ కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. తెలుపు రంగు రేషన్‌కార్డులందరికీ ఈ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.

ఉచిత బియ్యం పంపిణీకి మంగళం!

కేంద్రం ఇస్తున్నా రాష్ట్రం మోకాలడ్డు

  • రెండు నెలలుగా కార్డుదారులకు అందని కోటా
  • సాకులు చెప్తున్న ప్రభుత్వం

కొవిడ్‌తో ఏర్పడిన విపత్కర పరిస్థితుల నేపఽథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి రెండు నెలలుగా బ్రేక్‌ పడింది. సాంకేతిక కారణాలు అంటూ తొలుత సాకులు చెప్పిన రాష్ట్ర  ప్రభుత్వం ఇప్పుడు సరిపడా స్టాకు ఇవ్వట్లేదంటూ మెలిక పెడుతోంది. రాష్ట్రంలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నా వాటిని పంపిణీ చేసేందుకు ముందుకు రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరితో పేదలకు ఉచిత బియ్యం అందడం ప్రశ్నార్థకంగా మారింది.

(పిఠాపురం)

కొవిడ్‌ మొదటి, రెండు దశల్లో ఏర్పడిన పరిస్థితులు, లాక్‌డౌన్‌లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2020లో ఈ ఉచిత బియ్యం (ఆహార ధాన్యాలు) పంపిణీ ప్రారంభించి మధ్యలో విరామం అనంతరం 2021లో కొనసాగించింది. 2022 మార్చితో ఉచిత పంపిణీ ముగిసినప్పటికీ కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. తెలుపు రంగు రేషన్‌కార్డులందరికీ ఈ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కార్డులో ప్రతి సభ్యుడికి నెలకు 5 కిలోల వంతున అందజేయాలని కేంద్రం నిర్దేశించింది. రాష్ట్రప్రభుత్వం ద్వారా ఈ పంపిణీ జరగాల్సి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తన కోటాగా ఇచ్చే బియ్యం కోటాగా సార్టెక్స్‌ బియ్యాన్ని, కేంద్రం ఉచిత కోటా కింద సాధారణ బియ్యాన్ని పంపిణీ చేసింది. అయితే ఏప్రిల్‌ నెలలో ఉచిత బియ్యం పంపిణీ   చేపట్టలేదు. జిల్లాల విభజన నేపథ్యంలో సాధారణ కోటా పంపిణీయే ఆలస్యం కావడంతో మే నెలలో రెండు నెలల కోటా ఒకేసారి ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు మే చివరి వారంలోకి అడుగుపెడుతున్నా ఉచిత బియ్యం పంపిణీపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

కాకినాడ జిల్లాలో 6,43,146 మంది కార్డుదారులకు ప్రతి నెలా ఉచిత బియ్యం కోటాగా 9702.92 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అందించాల్సి ఉంది. ఉచిత బియ్యం కోసం కార్డుదారులు రేషన్‌ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కోటా ఎండీయూ వాహనాల ద్వారా అందించి కేంద్రం ఉచిత బియ్యానికి మాత్రం చౌక ధరల దుకాణాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో కార్డుదారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డీలర్లు సతమతమవుతున్నారు.

తొలుత స్టాక్‌ లేదని.. ఆపై కోటా తగ్గించి ఇస్తున్నారు

కేంద్రం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం ద్వారా అందించే రేషన్‌ను మార్చి నెల వరకు అందిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలిపివేసి అందుకు పలు రకాల సాకులు చెప్తోంది. ఏప్రిల్‌ నెలలో సరిపడా బియ్యం నిల్వలు లేవని, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం తక్కువ కోటా ఇస్తోందని, అందుకే బియ్యం పంపిణీ చేపట్టలేదని చెప్పడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రంలో ఉన్న రేషన్‌కార్డు దారులందరికీ ఉచిత బియ్యం ఇవ్వకుండా కేవలం 60శాతం మంది కార్డుదారులకు సరిపడా బియ్యాన్ని మాత్రమే కేంద్రం తన కోటాగా విడుదల చేస్తోందని రాష్ట్ర మంత్రులు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. రెండు సంవత్సరాలుగా ఇదే కోటా ఇస్తుండగా, కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేసి ఇప్పుడు కొత్తగా సాకులు చెప్పడం ఏమిటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మార్చి వరకూ లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని నిలదీస్తున్నారు. కేవలం కేంద్రం అమలు చేస్తున్న పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే రాష్ట్రం ఈ విధంగా వ్యవహరిస్తున్నదని వారు విమర్శిస్తున్నారు. కేంద్రానికి పూర్తి కోటా విడుదల చేయమని లేఖలు రాసామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడంతో ప్రజలకు ఉచిత బియ్యం అందడం ప్రశ్నార్థకంగా మారింది. బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి వీటిని ప్రజలకు అందించడం ఇష్టం లేకనే ఈ విధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కార్డుదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2022-05-25T06:55:22+05:30 IST