తిరుపతిలో 7వ డివిజన్‌ ఎన్నికలను ఆపండి

ABN , First Publish Date - 2021-03-05T07:40:43+05:30 IST

తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో 7వ డివిజన్‌కు సంబంధించి ఫోర్జరీ సంతకంతో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించిన వివాదంపై ఎస్‌ఈసీ తీవ్రంగా స్పందించింది.

తిరుపతిలో 7వ డివిజన్‌ ఎన్నికలను ఆపండి
టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మి

ఫోర్జరీ సంతకంతో నామినేషన్‌ ఉపసంహరణపై స్పందించిన ఎస్‌ఈసీ

తిరుపతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో 7వ డివిజన్‌కు సంబంధించి ఫోర్జరీ సంతకంతో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించిన వివాదంపై ఎస్‌ఈసీ తీవ్రంగా స్పందించింది.ఆ డివిజన్‌లో ఎన్నికలను ఆపాలంటూ జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీకి చెందిన మధు భార్య విజయలక్ష్మి 7వ డివిజన్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే బుధవారం ఉపసంహరణ సందర్భంగా తన సంతకాన్ని మురళి అనే వ్యక్తి ఫోర్జరీ చేసి నామినేషన్‌ను విత్‌డ్రా చేశారంటూ విజయలక్ష్మి ఎన్నికల అధికారులను నిలదీశారు. తనకు న్యాయం జరగకపోతే కార్పొరేషన్‌ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. బాధితురాలి ఫిర్యాదుతో పాటు మీడియాలో వచ్చిన కథనాలతో ఎన్నికల కమిషన్‌ స్పందించింది. అక్కడ ఎన్నికల ప్రక్రియను సస్పెండ్‌ చేయడంతో పాటు ఉపసంహరణ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. విచారణ ముగిశాక అందులో వెల్లడయ్యే వాస్తవాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 

రోజంతా పడిగాపులు

ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్‌ ఉపసంహరించారని  విజయలక్ష్మి బుధవారం కమిషనర్‌ గిరీషకు ఫిర్యాదు చేశారు.పోలీసులకు పిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ కాపీ తీసుకొస్తే పరిశీలిస్తామని గిరీష హామీ ఇచ్చారు.దీంతో ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌లో ఆర్వోపై విజయలక్ష్మి చేసిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. ఆ తర్వాత ఫోర్జరీ సంతకం చేసిన మురళి అనే వ్యక్తిపై గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వడంలో పోలీసులు ఆలస్యం చేయడంతో విజయలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద పడిగాపులు కాశారు. అనంతరం కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకుని ఎస్‌ఈసీ తీర్పుకోసం సాయంత్రం వరకు ఎదురుచూశారు.చివరకు 7వ డివిజన్‌లో ఎన్నికల ప్రక్రియ ఆపాలంటూ ఎస్‌ఈసీ నిర్ణయం వెలువరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

 న్యాయం గెలుస్తుంది : విజయలక్ష్మి 

అధికార పార్టీ ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా తలొగ్గక పోవడంతో అధికారులతో కుమ్మక్కై చివరకు ఫోర్జరీ సంతకంతో నా నామినేషన్‌ ఉపసంహరించారు.నా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే ఎస్‌ఈసీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. విచారణ అనంతరం తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందన్న నమ్మకముంది. 

రిటర్నింగ్‌ అధికారిపై చర్యలుంటాయా?

ఫోర్జరీ వివాదానికి కేంద్రబిందువైన 7వ డివిజన్‌లో ఆర్వో వ్యవహరించిన తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్నికల చట్టం ప్రకారం అభ్యర్థి కానీ, ప్రపోజర్‌ కానీ లేక అభ్యర్థి సిఫారసు చేసిన ఎన్నికల ఏజెంట్‌ గాని నామినేషన్‌ను ఉపసంహరించేందుకు వీలుంటుంది. అలాంటిది ఎవరో ఓటరు ఉపసంహరణ ఫారాలు తీసుకెళ్లి, ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్‌ అధికారికి సమర్పిస్తే ఏవిధంగా అంగీకరించారనేది చర్చనీయాంశమవుతోంది. 7వ డివిజన్‌లో నివాసముండే మురళీ అనే వ్యక్తి టీడీపీ తరపున పోటీలో ఉన్న విజయలక్ష్మి సంతకాలతో ఉపసంహరణ పత్రాలను బుధవారం ఆర్వోగా వ్యవహరించిన ప్రసాద్‌కు అందించారు.దరఖాస్తు వచ్చిందే తడవుగా ఆయన ఆమోదించేశారు. ఈ ఘటనపై బాధితులు ఆర్వోపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించలేమని తేల్చిచెప్పేశారు. తన నామినేషన్‌ ఫారాల్లోని సంతకాలను ఆర్వో బయటపెట్టడం వలనే ఫోర్జరీ చేసేవాళ్లకు సులభమైందనేది బాధితుల వాదన. అందుకే తాము ఆర్వోపై ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. ఎస్‌ఈసీ స్పందించిన నేపథ్యంలో విచారణ పూర్తయిన తర్వాత ఆర్వోపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సివుంది. 

Updated Date - 2021-03-05T07:40:43+05:30 IST