జీతాలు ఆపెయ్యండి

ABN , First Publish Date - 2022-09-27T07:30:32+05:30 IST

గృహ నిర్మాణంలో లక్ష్యాలు అధిరోహించలేదనే కారణంగా అధికారులకు జీతాలను ఆపుతూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

జీతాలు ఆపెయ్యండి
హౌసింగ్‌పై అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

హౌసింగ్‌లో లక్ష్యాలు చేరుకోలేదని ఆగ్రహం

ఎంపీడీవోలు, కమిషనర్లు, డీఈ, ఏఈల జీతాలు ఆపమంటూ ఉత్తర్వులు

రాష్ట్రంలోనే ముందంజలో ఉన్న జిల్లాలో ఇవేమి వేధింపులంటూ అధికారుల ఆవేదన


‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అయినా, జిల్లాలోని అధికారులకు వేధింపులు తప్పడం లేదు. నిత్యం వారిపై చర్యలు తీసుకోవడం, చర్యలకు సిఫార్సు చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. గృహ నిర్మాణంలో లక్ష్యాలు అధిరోహించలేదనే కారణంగా ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, హౌసింగ్‌ డీఈలు, ఏఈల జీతాలను ఆపుతూ కలెక్టర్‌ హరినారాయణన్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా అధికారులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారు.


చిత్తూరు, ఆంధ్రజ్యోతి: జిల్లాకు 72,272 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 61,227 గృహాల నిర్మాణాలు ప్రారంభమవ్వగా, 11,605 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. 11,045 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాకు మంజూరైన గృహాల కోసం రూ.1301 కోట్లను కేటాయించగా, ఇప్పటివరకు రూ.542 కోట్లను, అంటే 42 శాతం ఖర్చు చేశారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించిన జిల్లా మరోటి లేదు. తొలిస్థానంలో ఉన్న చిత్తూరు జిల్లా 42 శాతం పురోగతిలో ఉండగా, రెండో స్థానంలోని పార్వతీపురం మన్యం జిల్లా 31 శాతం, మూడో స్థానంలోని అన్నమయ్య జిల్లా 29 శాతం పురోగతి సాధించాయి. అంటే, రెండు, మూడు స్థానాల్లో ఉన్న జిల్లాలు చిత్తూరుకు దరిదాపుల్లోనూ లేవు. రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రగతి సగటున 20 శాతం మాత్రమే ఉంది. చిత్తూరులో మాత్రం క్షేత్ర స్థాయి అధికారుల సమష్టి కృషితో 42 శాతం పురోగతి ఉంది.


ఆ రెండు కారణాలతో ముందుకురాని లబ్ధిదారులు

ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి నివాసయోగ్యంకాని లేఅవుట్లు. మరొకటి యూనిట్‌ కాస్ట్‌. గ్రామాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో ఒక సెంటు స్థలాన్ని ఇంటి పట్టాలుగా పంపిణీ చేశారు. సగానికిపైగా లేఅవుట్లు నివాస యోగ్యంగా లేవు. ఊరికి దూరంగా కొండల్లో, గుట్టల్లో లేఅవుట్లను ఏర్పాటుచేశారు. అక్కడ మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. నివాసయోగ్యంకాని లేఅవుట్లను మార్చాలని జడ్పీ మీటింగ్‌ జరిగినప్పుడల్లా ప్రజాప్రతినిధులు కోరుతూనే ఉన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. 

టీడీపీ హయాంలో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.1.5 లక్షలకు అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.లక్షను జత చేసి మొత్తం రూ.2.5 లక్షలను లబ్ధిదారులకు అందించేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కరోనా లాక్‌డౌన్‌ రావడం, గృహ నిర్మాణ సామగ్రి ధరలన్నీ అమాంతం రెట్టింపయ్యాయి. ఇప్పటి ధరల ప్రకారం 1.5 సెంట్లలో సాదాసీగా ఇంటిని నిర్మించుకోవాలంటే కనీసం రూ.6.5 లక్షలు ఖర్చు అవుతుందని మేస్త్రీలు చెబుతున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను నయా పైసా ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.1.50 లక్షలు ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం అయిన ఉపాఽధిహామీ ద్వారా మరో రూ.30 వేలు మరుగుదొడ్డి నిర్మాణం కోసం లబ్ధిదారుడికి అందుతోంది. మొత్తంగా కేంద్రం తరఫున రూ.1.80 లక్షలు వాటా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా పూర్తిగా లేదు. దీంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు.


గతంలోనూ అధికారులపై చర్యలు

యూనిట్‌ కాస్ట్‌ తక్కువ కావడం, నివాస యోగ్యంకాని లేఅవుట్ల కారణంగా లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రాకుంటే దానికి అధికారుల్ని బాధ్యుల్ని చేస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌ ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నారు. గతంలో నగరి మున్సిపల్‌ కమిషనర్‌ సహా హౌసింగ్‌ డీఈ శంకరప్ప, అర్బన్‌ ఏఈ భాస్కర్‌, రూరల్‌ ఏఈ రాఘవయ్యపై చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల రాష్ట్ర అధికారులకు సిఫార్సు చేశారు. జూలైలో చిత్తూరు రూరల్‌ హౌసింగ్‌ ఏఈ రామభద్ర నాయుడును ఏకంగా సరెండర్‌ చేసి, చిత్తూరు ఎంపీడీవోకు షోకాజ్‌ ఇచ్చారు. తాజాగా జిల్లాలోని అందరు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, హౌసింగ్‌ డీఈలు, ఏఈల జీతాలు తదుపరి ఆదేశాల వరకు ఆపేయాలని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌ను కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు. దీనిపై అధికారులు ఆవేదన చెందుతున్నారు. 


బేస్‌మెంట్‌ కన్నా తక్కువ స్థాయిలో 35వేల ఇళ్లు : హౌసింగ్‌ అధికారులపై కలెక్టర్‌ మండిపాటు

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలో 35వేల ఇళ్ళ నిర్మాణాలు బేస్‌మెంట్‌ కన్నా తక్కువస్థాయిలో ఉన్నాయని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం చిత్తూరు కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో గృహనిర్మాణ పనులపై ఆయ హౌసింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు, ఇతర సిబ్బందితో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్న హౌసింగ్‌ కాలనీల లేఅవుట్ల పనుల పురోగతిపై గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా ప్రారంభం కాని ఇళ్లను సత్వరం ప్రారంభించి బేస్మెంట్‌ స్థాయికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సమీక్షించారు. సమావేశానికి వచ్చేముందు అధికారులు సమగ్ర నివేదికలతో రావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసి వెంకటేశ్వర్‌, హౌసింగ్‌ పీడీ పద్మనాభం, చిత్తూరు కమిషనర్‌ అరుణ, హౌసింగ్‌ సిబ్బంది, సచివాలయ ఇంజినీరింగ్‌ సిబ్బంది, ఎంపీడీవోలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-27T07:30:32+05:30 IST