పోలింగ్‌ ఆపండి!

ABN , First Publish Date - 2021-04-07T07:51:08+05:30 IST

మెరుపు వేగంతో ‘పరిషత్‌’ ఎన్నికలను ముగించాలనుకున్న సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది. గురువారం జరగాల్సిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను న్యాయస్థానం నిలిపివేసింది

పోలింగ్‌ ఆపండి!

రేపటి పరిషత్‌ పోరుకు హైకోర్టు బ్రేక్‌

ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ నిలిపివేత

సుప్రీం తీర్పును ఉల్లంఘించలేరు

నాలుగు వారాల కోడ్‌ ఉండాల్సిందే

అభ్యర్థులందరికీ సమానావకాశాలు

ఇదే ఎన్నికల కోడ్‌ ముఖ్య ఉద్దేశం

ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం కుదరదు

సుప్రీం తీర్పు మేరకు రీనోటిఫికేషన్‌

హైకోర్టు విస్పష్ట ఆదేశాలు

తీర్పుపై ఎస్‌ఈసీ అప్పీల్‌ నేడు విచారించే అవకాశం!

మొదటి నుంచి నిర్వహించాలని ఆదేశించలేం: హైకోర్టు


‘‘పౌరులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఉండాలి. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే ఎన్నికల కోడ్‌ ముఖ్య ఉద్దేశం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్‌కు ముందు నాలుగు వారాల కోడ్‌ అమలు చేయకుండా... అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించామనే నైతిక హక్కు ఎస్‌ఈసీకి లేదు!’’

- హైకోర్టు


అమరావతి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): మెరుపు వేగంతో ‘పరిషత్‌’ ఎన్నికలను ముగించాలనుకున్న సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది. గురువారం జరగాల్సిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను న్యాయస్థానం నిలిపివేసింది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం చెల్లదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసిందంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేశారు. ‘‘దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును పక్కనబెడుతూ ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా   పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమలు చేసేలా రీ-నోటిఫికేషన్‌ జారీ చేసి, ఆ విషయాన్ని  అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలి’’ అని ఎస్‌ఈసీని ఆదేశించారు. ఈ నెల 1న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌, తదనంతర చర్యలపై స్టే విధించారు.


సమాన అవకాశం ఎలా?

ఎన్నికల నిర్వహణ అలంకారప్రాయమైన తంతు కాదని... పవిత్ర కార్యమని హైకోర్టు గుర్తు చేసింది. ‘‘సాధారణ పౌరుడు స్వేచ్ఛగా తన ఓటు హక్కు వినియోగించుకొని సరైన అభ్యర్థిని - పార్టీని ఎంచుకునేలా ఎన్నికలు ఉండాలి’’ అని విన్సెంట్‌ చర్చిల్‌ అన్న మాటలను గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమలు చేయకుండా... అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించామని చెప్పుకొనే నైతిక హక్కు ఎస్‌ఈసీకి లేదని పేర్కొంది. ప్రస్తుత వ్యాజ్యంలో ఎస్‌ఈసీ చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని తేల్చి చెప్పింది. 


జోక్యం చేసుకోక తప్పలేదు...

సాధారణంగా ఎన్నికల నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవనీ... కానీ, ప్రస్తుత పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హైకోర్టు తెలిపింది. ‘‘న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధ సంస్థగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ ఉల్లంఘించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం తప్ప ఎస్‌ఈసీకి మరో మార్గం లేదన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవిస్తున్నాం. నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు గరిష్ఠ పరిమితి మాత్రమేనన్న ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించలేం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల ముందు కోడ్‌ అమలు చేసే విషయంలో ఎస్‌ఈసీకి ఏమైనా ఇబ్బందులు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన ఆదేశాలు పొందాల్సిందని అభిప్రాయపడింది. నాలుగు వారాల గడువుతో రీనోటిఫికేషన్‌ జారీ చేసి, అఫిడవిట్‌ దాఖలు చేస్తే... దానిని పరిగణనలోకి తీసుకొని తదుపరి ఉత్తర్వులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ కేసులో తదుపరి  విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.

Updated Date - 2021-04-07T07:51:08+05:30 IST