కొత్తవాటికి బ్రేక్‌

ABN , First Publish Date - 2020-06-06T09:25:55+05:30 IST

గోదావరి నదిపై కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే ఆపేయాలని గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. వాటన్నిటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను ఈ నెల

కొత్తవాటికి బ్రేక్‌

  • గోదావరిపై ప్రాజెక్టులను తక్షణమే ఆపేయండి
  • 10లోగా డీపీఆర్‌లు సమర్పించండి
  • తెలుగు రాష్ట్రాలకు జీఆర్‌ఎంబీ ఆదేశం
  • బోర్డు భేటీలో ఆంధ్ర ఫిర్యాదుపై చర్చ
  • సమగ్ర నివేదిక సమర్పణకు తెలంగాణ సమ్మతి
  • టెలిమెట్రీలపై జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో కమిటీ


అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిపై కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే ఆపేయాలని గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. వాటన్నిటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని నిర్దేశించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని జీఆర్‌ఎంబీ కార్యాలయంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన బోర్డు సర్వసభ్య సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని గతనెల 19న ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చ జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు 225 టీఎంసీలు, జీఎల్‌ఐఎ్‌స-3కి 22 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టుకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 110 టీఎంసీలు, తెలంగాణ తాగునీటి అవసరాల కోసం 23.76 టీఎంసీలు, ఇతరత్రా పథకాలతో కలిపి మొత్తం 450.31 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులను కొత్తగా నిర్మిస్తోందని ఆంధ్ర తన ఫిర్యాదులో పేర్కొనగా.. ఆంధ్రప్రదేశ్‌ నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలపై తెలంగాణ ఫిర్యాదు చేసింది. గోదావరిలోని 1,426 టీఎంసీల జలాల్లో 650 టీఎంసీలు తెలంగాణకు.. 776 టీఎంసీలు తమకు దక్కుతాయని ఆంధ్రప్రదేశ్‌ ఈ సమావేశంలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు 660 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 116 టీఎంసీలు దక్కుతాయని వివరించింది. 


తెలంగాణ ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు 472 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178 టీఎంసీలు.. మొత్తం 650 టీఎంసీలు వాటాగా వినియోగించుకునే వీలుందని పేర్కొంది. కాగా.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను రెండు రాష్ట్రాలూ తక్షణమే నిలుపుదల చేయాలని.. వాటికి డీపీఆర్‌లను సమర్పించాలని జీఆర్‌ఎంబీ ఆదేశించింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం డీపీఆర్‌లను ఇప్పటికే సమర్పించామని.. సాంకేతికాంశాలు కొన్ని చూపుతున్నందున వాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో డీపీఆర్‌లను సమర్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ పాతవే అయినందున.. డీపీఆర్‌లను సమర్పించాల్సిన అవసరం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ వాదించారు. ఉమ్మది ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణఱ భూభాగంలో సాగు నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించినందునే ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని సంప్రదించాకే.. డీపీఆర్‌లను సమర్పిస్తామన్నారు. అయితే డీపీఆర్‌లను సమర్పించాల్సిందేనని జీఆర్‌ఎంబీ తేల్చిచెప్పింది. ఇందుకు తెలంగాణ సరేనంది. ఆంధ్ర కూడా అంగీకరించింది. ఈ నెల పదో తేదీలోపు వాటిని సమర్పించేందుకు రెండు రాష్ట్రాలూ సమ్మతించాయి. అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం చర్చించాల్సిన ఎజెండాను కూడా అదే తేదీలోగా ఇచ్చేందుకు అంగీకరించాయి. పెద్దవాగు ప్రాజెక్టు అంశాన్ని రెండు రాష్ట్రాలూ కలసి పరిష్కరించుకునేందుకు సరేనన్నాయి. రెండు రాష్ట్రాల్లో టెలిమెట్రీల ఏర్పాటుకు జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో కమిటీని వేయాలని తీర్మానించాయి.


స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు: చైర్మన్‌

బోర్డు సర్వసభ్య సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆ  తర్వాత విలేకరులకు వెల్లఇంచారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014 తర్వాత గోదావరి నదిపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జలసంఘానికి, బోర్డుకు సమర్పించి.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమ్మతిని పొందేందుకు తెలంగాణ అంగీకరించిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కూడా గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సప్లిమెంటరీ డీపీఆర్‌లను ఇవ్వడానికి సమ్మతించిందని చెప్పారు. గోదావరి జలా ల వినియోగాన్ని లెక్కించేందుకు వీలుగా టెలిమెట్రీల ఏర్పాటుకు వీలుగా జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, జలసంఘం, పుణేలోని సీడబ్ల్యుపీఆర్‌కు చెందిన నిపుణులతో కమిటీ వేయాలని తీర్మానించినట్లు తెలిపారు.

Updated Date - 2020-06-06T09:25:55+05:30 IST