ఇష్టంలేని పెళ్లి ఆపాలనుకుని..

ABN , First Publish Date - 2022-05-24T08:48:21+05:30 IST

విశాఖపట్నంలోని మధురవాడలో ఈ నెల 11న వివాహ వేదికపై కుప్పకూలి.. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వధువు

ఇష్టంలేని పెళ్లి ఆపాలనుకుని..

  • విషం తీసుకున్న యువతి 
  • విశాఖలో వధువు మృతి కేసులో వీడిన మిస్టరీ?

విశాఖపట్నం, కొమ్మాది, మే 23 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని మధురవాడలో ఈ నెల 11న వివాహ వేదికపై కుప్పకూలి.. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వధువు ముంజేటి సృజన (22) కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. పరవాడకు చెందిన యువకుడితో ఎనిమిదేళ్లుగా ప్రేమలో వున్న సృజన.. తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం చేసుకోవడం ఇష్టంలేక, దాన్ని ఆపే ప్రయత్నంలో విషం తీసుకోగా.. వికటించి ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు గుర్తించారు. మృతురాలి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ అకౌంట్లను పరిశీలించిన తర్వాత పోలీసులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించనప్పటికీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.


శ్రీకాకుళం జిల్లా జలుమూరుకు చెందిన ముంజేటి ఈశ్వరరావు, భార్య అనూష, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన కుమార్తె సృజన 2014 -15లో పరవాడలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుకుంది. ఆ సమయంలో కళాశాలలో సీనియర్‌ అయిన మోహన్‌ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పకపోవడంతో తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. ఈ విషయాన్ని మోహన్‌కు ఫోన్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా చాటింగ్‌ ద్వారా తెలపడంతోపాటు తనను తీసుకుళ్లిపోవాలని కోరింది. అయితే మోహన్‌ తాను ఇంకా స్థిరపడలేదని, రెండేళ్లు వరకూ పెళ్లి చేసుకోలేనని సృజనకు చెప్పాడు.


 పెళ్లికి మూడు రోజులు ముందు కూడా సృజన ఇన్‌స్టాలో మోహన్‌తో చాటింగ్‌ చేసింది. తాను ఇప్పటికే ఎన్నో సంబంధాలు ఆపానని, ఇది కూడా ఆపుతానని ధీమా వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో సృజన ముందుగానే సమకూర్చుకున్న విష గుళికలను పెళ్లి రోజు ఉదయాన్నే కొద్ది మోతాదులో తీసుకుంది. దీంతో కళ్లు తిరిగి పడిపోవడంతో ఆమెను స్థానిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా చికిత్స అందించడంతో కోలుకుంది. తర్వాత పెళ్లికి సిద్ధమయ్యే సమయంలో మరికొంత మోతాదులో విషం తీసుకుంది. మండపంపై పెళ్లి తంతు ప్రారంభమై.. సరిగ్గా జీలకర్ర బెల్లం తలపై పెట్టే సమయంలో సృజన అపస్మారక స్థితికి చేరి కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికి పరిస్థితి చేజారిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. కాగా ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చేంత వరకూ దీనిపై తాము ఏదీ స్పష్టంగా చెప్పలేమని పోలీసులు వివరించారు.

Updated Date - 2022-05-24T08:48:21+05:30 IST