సంయమనం కోల్పోవద్దు...నడ్డాకు కాంగ్రెస్ కౌంటర్

ABN , First Publish Date - 2022-01-06T00:07:03+05:30 IST

ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన వ్యాఖ్యలపై..

సంయమనం కోల్పోవద్దు...నడ్డాకు కాంగ్రెస్ కౌంటర్

న్యూఢిల్లీ: ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ''సంయమనం పాటించండి. ఔచిత్యమెరిగి వ్యవహరించండి'' అని హితవు పలికింది. ప్రధాని హుస్సైనివాలాకు రోడ్డు మార్గంలో ప్రయాణించారని, ఒరిజనల్ షెడ్యూల్‌లో రోడ్డు జర్నీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న భద్రతా ఏర్పాట్లను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


నడ్డాజీ వినండి..

ప్రధాని ర్యాలీ కోసం 10,000 మంది భద్రతా సిబ్బంది మోహరించారని, ఎస్‌పీజీ, ఇతర ఏజెన్సీల సమన్వయంతో యథాతథంగా అన్ని ఏర్పాట్లు జరిగాయని సూర్జేవాలా తెలిపారు. అయితే, రోడ్డు పర్యటన షెడ్యూల్‌లో లేనప్పటికీ ప్రధాని రోడ్డు మార్గంలో ప్రయాణించారని అన్నారు. ప్రధాని, గజేంద్ర సింగ్ షేకావత్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కిసాన్ మజ్చూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్‌సీ)తో రెండు రౌండ్ల చర్చలు కూడా జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేఎంఎస్‌సీ, రైతులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎందుకు నిరసనకు దిగారో ముందు తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనిని తొలగించాలని, హర్యానా, ఢిల్లీ, యూపీలో రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, మృతి చెందిన 700 రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కనీస మద్దతు ధరపై కమిటీ వేయడం, సత్వర నిర్ణయం తీసుకోవడం కూడా వారి డిమాండ్లలో ఉన్నాయన్నారు.


రైతుల ఆందోళన అనంతరం వారికిచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం విస్మరించిందని, మోదీజీ మాటలు వినేందుకు జనాలు ఎవరూ రాకపోవడం కూడా ర్యాలీ రద్దుకు కారణమని సూర్జేవాలా ఆ ట్వీట్‌లో తెలిపారు. ప్రధాని ర్యాలీ రద్దుకు సాకులు వెతకడం మానేసి, రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ పునరాలోచించుకోవాలని సూర్జేవాలా హితవు పలికారు. ''ర్యాలీలు నిర్వహించుకోండి. ముందు రైతుల గోడు వినండి'' ఆయన కౌంటర్ ఇచ్చారు.

Updated Date - 2022-01-06T00:07:03+05:30 IST