అక్రమ మద్యం ఆగేనా?

ABN , First Publish Date - 2020-09-05T08:36:14+05:30 IST

అక్రమ రవాణా, నాటు సారా కట్టడి కోసం సర్కారు చీప్‌ లిక్కర్‌ ధరను తగ్గించింది.

అక్రమ మద్యం ఆగేనా?

మాఫియాకు కలిసొచ్చిన బోర్డర్లు

పొరుగుతో పోల్చితే భారీగా ధరలు

రాష్ట్రంలోని 11 జిల్లాలకు 

ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు

సులువుగా తరలి వస్తున్న మద్యం

మంచి బ్రాండ్లకు మరింత డిమాండ్‌

సిలెండర్లు, టైర్లలో దాచి ఏపీలోకి

మందు స్మగ్లర్లకు డబ్బులే డబ్బులు

బోర్డర్‌లో ఎస్‌ఈబీ పోలీస్‌ హడావుడి

ఎక్సైజ్‌ శాఖ వర్గాల్లోనే అనుమానాలు

సవాలుగా మారిన అక్రమ రవాణా


చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల సరిహద్దులకు ఆనుకొని ఉన్న తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి కొంతమంది పది సీసాలు పట్టుకొని కాలినడకన ఇటువైపు వచ్చి అమ్మి పోతున్నారు. పోయేటప్పుడు ఒక్కొక్కరు రెండున్నర వేల రూపాయల నుంచి మూడు వేల దాకా జేబులో వేసుకుంటున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): అక్రమ రవాణా, నాటు సారా కట్టడి కోసం సర్కారు చీప్‌ లిక్కర్‌ ధరను తగ్గించింది. అయినా... పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే ధర ఎక్కువ. ఇక... మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు మరింత ఎక్కువ. అన్నింటికంటే మించి... జనం కోరుతున్న బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం మరో పెద్ద సమస్య. వీటన్నింటి నేపథ్యంలో... పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం పెను సవాల్‌గా మారుతోంది. ఏపీలోని దాదాపు పదకొండు జిల్లాలకు ఏదో ఒక రాష్ట్ర సరిహద్దుతో సంబంధం ఉండటం లిక్కర్‌ మాఫియాకు కలిసొస్తోంది. రాయలసీమలో కడప మినహా తక్కిన సీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా అటు తమిళనాడుతోనో, ఇటు కర్ణాటకతోనో లింకులో ఉన్నాయి. మరికొన్ని జిల్లాలు తెలంగాణకు, ఉత్తరాంధ్ర అంతా ఒడిసాకు సరిహద్దుల్లో ఉన్నాయి. అక్రమ మద్యం ఏరులయి పారుతోంది ప్రధానంగా ఈ సరిహద్దుల నుంచే! ప్రత్యేక వ్యవస్థగా ముందుకుతెచ్చిన ఎస్‌ఈబీని సరిహద్దుల్లో పెట్టినా, దానికి అధికారాలు ఏవి? కనీసం అరెస్టు చేసినవారిపై కేసు పెట్టి కోర్టుకు పెట్టే పవర్స్‌ కూడా ఎస్‌ఈబీకి లేవు. ఈ పరిస్థితుల్లోనే మద్యం మాఫియా చెలరేగిపోతోంది. 


ఓల్డ్‌ అడ్మిరల్‌ అనే బ్రాండ్‌ మద్యం ఫుల్‌ బాటిల్‌ ధర కర్ణాటకలో 380 రూపాయలు. అదే ఫుల్‌ బాటిల్‌ కావాలంటే రాయలసీమలో రూ.900నుంచి రూ.1200 పెట్టాల్సిందే. దీంతో కర్ణాటకకు చెందిన ఆ బ్రాండ్‌ మద్యమే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పుడు కుప్పలుతెప్పలుగా పారుతోంది. రేటులో భారీ తేడా ఉండటంతో రాజకీయ నాయకులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా అందరూ సందు దొరికితే సరిహద్దులు దాటేసి ఇటు కర్ణాటకకో, అటు తెలంగాణకో వెళ్లి కావాల్సినంత మద్యం తరలించుకొని వస్తున్నారు. ఏపీలో సర్కారీ మద్యంషాపులు మొదలయ్యాక.. పాపులర్‌ బ్రాండ్లు కనుమరగడం, ధరలు పెరగడంతో మద్యం మాఫియా విజృంభణ అలాఇలా లేదు. వాట్సా్‌పలో బుకింగ్‌ చేసి ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తే కోరుకున్న చోటుకి డోర్‌ డెలివరీ చేసే స్థాయికి ఈ మాఫియా చేరిపోయింది. గ్యాస్‌ సిలెండర్లు, లారీల స్టెప్నీ టైర్లు, చేపల ట్యాంకర్లు, కూరగాయల వాహనాలు చివరికి అంబులెన్స్‌ల్లో సైతం స్మగ్లింగ్‌ అవుతోంది. ఇటు తెలంగాణ, అటు కర్ణాటకకు జంక్షన్‌లా ఉండే కర్నూలు జిల్లాలోకి రెండు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా దిగుమతి అవుతోంది.


ఇటీవల సరిహద్దుల్లో రెండు వాహనాలను ఆపిన పోలీసులకు అందులో వందల సంఖ్యలో మద్యం సీసాలు లభించాయి. అవి అధికారపార్టీకి చెందిన ఒక కాంట్రాక్టరువని తేలింది. అదే జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి స్వగ్రామంలో భారీగా మద్యం డంప్‌ అయిందని తెలిసి సోదాలకు వెళ్లిన పోలీసులకు అక్కడ మరో సన్నివేశం కనిపించడంతోపాటు గ్రామస్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో మద్యం అంశం పక్కకుపోయి జూదం విషయం తెరపైకి వచ్చింది. 


పుచ్చకాయల లోడులో..

కార్లు మొదలుకొని రవాణా వాహనాలకు ప్రత్యేకంగా చేయించిన అరల్లో, సౌండ్‌ బాక్సులలో మద్యాన్ని రాష్ట్రంలోకి తెచ్చేస్తున్నారు. కారుకి గవర్నమెంట్‌ ఆన్‌ డ్యూటీ స్టిక్కర్‌ అతికించి తీసుకొస్తున్నారు. విజయవాడలో 49 మద్యం సీసాలతో ఇలా ఓ వ్యక్తి పట్టుబడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి ప్రాంతంలో పుచ్చకాయల లోడులో తెలంగాణ నుంచి మూడు వాహనాల్లో తీసుకొస్తున్న లక్షల రూపాయల విలువైన వేలాది మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా..


గుంటూరు జిల్లాలో ఒక సీనియర్‌ ప్రజాప్రతినిధి అండతో ఖరీదైన కారుపై సైరన్‌ వేసుకుని మద్యం బాటిళ్లు తెస్తూ మాచర్ల ప్రాంతంలో ఆయన డ్రైవర్‌ పట్టుబడ్డాడు. నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి.. ఆరు లక్షల మద్యంతో పట్టుబడ్డారు. ఒడిశాలో రూ.95కి  విక్రయించే బాటిల్‌ను విశాఖకు తెచ్చి రూ.180-200కు విక్రయిస్తున్నారు. తెలంగాణ నుంచి బైకుపై వస్తున్న ఇద్దరిని విస్సన్నపేట వద్ద ఆపితే శరీరం చుట్టూ టేపులు వేసి దాచిన 101 సీసాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి సొంతూరు పులివెందులలో కారు ఆపిన ఎస్‌ఐపైకి స్మగ్లర్లు వాహనంతో దూసుకెళ్లారు. పట్టు వదలకుండా కారుపైకి ఎక్కి ఎట్టకేలకు ఆయన ఆ ముఠా ఆట కట్టించారు. తెలంగాణ నుంచి గ్యాస్‌ సిలెండర్లో అక్రమంగా మద్యం బాటిళ్లు తీసుకొస్తూ కృష్ణా జిల్లా పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. 


పట్టుకున్నా ఫలితమేముంది?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ)కి ఏ మాత్రం అధికారాల్లేవు. ‘ఏసీబీ, సీఐడీ కేసుల్లో అరెస్టు, దర్యాప్తు, అన్నీ వాళ్లే చేస్తారు.. కానీ మాకు ఎలాంటి అధికారాలు లేవు.. అసలు స్టేషన్‌ పరిధికూడాలేదు.. ఎందుకంటే ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు లేనప్పుడు ఎందుకు.? అంటున్నారు’ అని ఎస్‌ఈబీ సిబ్బంది నిష్టూరపడుతున్నారు. 

Updated Date - 2020-09-05T08:36:14+05:30 IST