ఇక్కడ నిల్‌..అక్కడ ఫుల్‌!

ABN , First Publish Date - 2021-05-09T04:07:03+05:30 IST

కరోనా మహమ్మారి బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపడుతుంది. అయినా ఎక్కువ మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్లలోనే కొవిడ్‌ చికిత్స తీసుకొని కోలుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రుల వైపు కన్నెత్తి చూడకుండానే ప్రైవేట్‌ వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి కరోనా వార్డులలో బెడ్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బె డ్లు బాధితులతో నిండిపోతున్నాయి.

ఇక్కడ నిల్‌..అక్కడ ఫుల్‌!
ఉట్నూర్‌ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న బెడ్లు

ప్రభుత్వ కొవిడ్‌ వార్డులకు ఆదరణ కరువు

ఫీజులు దండుకుంటున్నా.. ప్రైవేట్‌ వైపే రోగుల మొగ్గు

ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో కనిపించని భరోసా

ఆర్థికంగా నష్టపోతున్న బాధిత కుటుంబాలు

చోద్యం చూస్తున్న జిల్లా అధికార యంత్రాంగం

ఆదిలాబాద్‌, మే8 (ఆంధ్రజ్యోతి) : కరోనా మహమ్మారి బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపడుతుంది. అయినా ఎక్కువ మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్లలోనే కొవిడ్‌ చికిత్స తీసుకొని కోలుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రుల వైపు కన్నెత్తి చూడకుండానే ప్రైవేట్‌ వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి కరోనా వార్డులలో బెడ్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బె డ్లు బాధితులతో నిండిపోతున్నాయి. రిమ్స్‌ ఆసుపత్రిలో 550 బెడ్లు, ఉ ట్నూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 60 బెడ్లు, మరో45 ప్రైవేట్‌ ఆసుపత్రిల పరిధిలో 175 బెడ్లను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఆసుపత్రి లో మొత్తం 610 బెడ్లు అందుబాటులో ఉండగా రిమ్స్‌లో 188 మంది, ఉట్నూర్‌ ఆసుపత్రిలో ముగ్గురు బాధితులు మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. అంటే 191 మంది మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేసుకుంటున్నారు. మిగితా 419 బెడ్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ప్రస్థుతం జిల్లాలో వెయ్యికి పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. మిగి తా వారు హైదరాబాద్‌, మహారాష్ట్ర పట్టణ ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో కరోనా బారిన పడిన కుటుంబాలు ఆర్థికంగా నష్ట పోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అందినకాడికి దండుకుంటున్నారు..

జిల్లాలో 45 ప్రైవేట్‌ ఆసుపత్రులలో కొవిడ్‌ వైద్యానికి అనుమతులిచ్చారు. వీటి పరిధిలో మొత్తం 175 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. కరోనా బారినపడి ఆరోగ్యం సీరియస్‌ కావడంతో బాధితులు ప్రైవేట్‌ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా  కొందరు ప్రైవేట్‌ వైద్యులు అందినకాడికి దండుకుంటున్నారు. ఆక్సి జన్‌, సిటీస్కానింగ్‌ పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. రోజుకు ఒక్కో బెడ్‌కు రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. బాధితుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రులైతే కరోనా బాధితులకు నెగెటివ్‌ వచ్చిన నీరసంగా ఉందం టూ డిశ్చార్జి చేయకుండానే దోపిడీ చేస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండ ర్లు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు బ్లాకులో కొనుగోలు చేస్తున్నామని చెబు తూ అధిక ఫీజులను గుంజుతున్నారు. ఆపద సమయంలో బతికి బయట పడితే చాలనుకుంటున్న భావన బాధిత కుటుంబాల్లో కనిపిస్తుంది. ముందుగానే అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. ఇలా బాధితుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రభుత్వ వైద్యానికి ఆదరణ ఏదీ?

కోవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌కే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. వైద్యానికి మాత్రం ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఉదహరణకు ఉట్నూర్‌ ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం మొత్తం 60 బె డ్లను ఏర్పాటు చేశారు. ప్రస్థుతం ఇక్కడ ముగ్గురు మాత్రమే ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వీరంతా వైద్య సిబ్బందే కావడం గమనార్హం. మిగితా 57 బెడ్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. అలాగే రిమ్స్‌లో 550 బెడ్లు అందుబాటులో ఉండగా 188 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రైవేట్‌లో మాత్రం 175 బెడ్లకు గాను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లో 50 మంది, మిగితా పట్టణ ఆసుపత్రుల్లో 100 కు పైగానే చేరి వైద్యం తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ప్ర భుత్వ వైద్యానికి జిల్లాలో ఆఽధరణ ఎలా ఉందో తెలుస్తునే ఉంది. సర్కారు వైద్యం పై ప్రజల్లో భరోసా లేక పోవడమే దీనంతటికి ప్రధాన కారణమంటున్నారు. అవసరమైన ఆక్సిజన్‌, వెంటిలెటర్స్‌, ఐసీయూ సదుపాయాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు.

వైద్యుల నిర్లక్ష్యమేనా?

ప్రభుత్వ ఆసుపత్రులలో విధులు నిర్వహిస్తున్న కొందరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సరైన వైద్యం అందించకపోవడంతోనే బాధితుల ఆరోగ్య పరిస్థితి వి షమిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సకల వసతులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికిబాధితులు రాకపోవడానికి అసలు కారణం ఏమై ఉంటుందని వైద్యులు పసిగట్టలేక పోతున్నారు. వచ్చిన వారికి వైద్యం చేయడం, చేతులు దులుపుకోవడమే తప్ప ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం లేదు. అలాగే ఆసుపత్రి పరిసరాల శుభ్రత, కొవిడ్‌ నిబంధనలు పాటించక పోవడంతో వైరస్‌ వ్యాప్తికి మరింత కారణమవుతుంది. ఉ న్నతాధికారులు పర్యవేక్షణ చేయక పోవడంతో కొన్ని మండల కేంద్రాల ఆసుపత్రులలో పరిస్థితులు మరి అధ్వానంగా కనిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు నిర్లక్ష్యపు ధోరణిని విడనాడితేనే ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ వైద్యం అందించే అవకాశం ఉంటుంది. 

ఎక్కువ మంది కోలుకుంటున్నారు..

రాథోడ్‌నరేందర్‌ (డీఎంఅండ్‌హెచ్‌వో, ఆదిలాబాద్‌)

కరోనా బారిన పడి ఎక్కువ మంది కోలుకుంటున్నారు. బెడ్ల కొరత ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎక్కువ ప్రైవేట్‌ ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. రిమ్స్‌లో ఎక్కువగానే బాధితులు చేరుతున్నారు. ఉట్నూర్‌లో పాజిటివ్‌ కేసులు తక్కువగానే ఉన్నాయి. 

Updated Date - 2021-05-09T04:07:03+05:30 IST