ఆస్పత్రుల్లో అభివృద్ధి నిల్‌

ABN , First Publish Date - 2021-05-19T09:52:45+05:30 IST

రాష్ట్రంలో కరోనా విలయం సృష్టిస్తున్నా వైసీపీ ప్రభుత్వం ఏడాదిగా ఆస్పత్రుల్లో వసతుల అభివృద్ధికి పైసా ఖర్చు చేయలేదని టీడీపీ ఆరోపించింది. కరోనా కోసం ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం చూపిస్తోన్న లెక్కల్లో ఆస్పత్రుల అభివృద్ధికి రూపాయి కూడా లేదని పేర్కొంది.

ఆస్పత్రుల్లో అభివృద్ధి నిల్‌

  • ఏడాది కాలంగా పైసా ఖర్చు చేయని వైసీపీ ప్రభుత్వం 
  • కరోనాకు చేసిన ఖర్చులో వసతులకు రూపాయు ఇవ్వలేదు : పట్టాభిరాం ధ్వజం 


అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా విలయం సృష్టిస్తున్నా వైసీపీ ప్రభుత్వం ఏడాదిగా ఆస్పత్రుల్లో వసతుల అభివృద్ధికి పైసా ఖర్చు చేయలేదని టీడీపీ ఆరోపించింది. కరోనా కోసం ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం చూపిస్తోన్న లెక్కల్లో ఆస్పత్రుల అభివృద్ధికి రూపాయి కూడా లేదని పేర్కొంది. ఆస్పత్రుల్లో వసతులు లేక వేల సంఖ్యలో ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని విమర్శించింది. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఏడాదిగా కరోనా కోసం రూ.2,229 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపిస్తోంది. ఇందులో మందుల కోసం రూ.1,173 కోట్లు, జీతాలకు రూ.900 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొత్తగా పడకల ఏర్పాటు, ఆక్సిజన్‌ వసతులు పెంచడం, వెంటిలేటర్ల ఏర్పాటు, ఇతర సౌకర్యాల కల్పన కోసం పైసా కూడా ఖర్చు చేయలేదు. కరోనా రెండోదశ ఉధృతంగా రాబోతోందని తెలిసినా కూడా జగన్‌రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసి కూర్చుంది. ఆస్పత్రుల్లో పడకలు దొరక, ఆక్సిజన్‌ సదుపాయాలు లేక, వెంటిలేటర్లు దొరక్క వేలసంఖ్యలో ప్రజలు ప్రాణాలొదిలారు. గత్యంతరం లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించినవారు అప్పుల పాలయ్యారు. అప్పులు దొరకనివారు ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారు. దీనికి అంతటికీ జగన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్వాకమే కారణం’ అని ఆయన విమర్శించారు. కరోనా నివారణలో ప్రభుత్వం దేనికి ఎంత ఖర్చు చేసిందో సీఎం సొంత పత్రికలోనే సవివరంగా రాశారని, ఆస్పత్రుల్లో వసతుల అభివృద్ధికి పైసా కూడా ఖర్చు చేయలేదని అందులోనే ఉందని చెప్పారు.

Updated Date - 2021-05-19T09:52:45+05:30 IST