హద్దు రాళ్లకే.. రూ.180 కోట్లు

ABN , First Publish Date - 2021-01-19T05:25:37+05:30 IST

జగనన్న భూహక్కు, భూరక్ష పథకం కింద జిల్లాలో చేపట్ట నున్న భూముల సర్వే హద్దు రాళ్లకే భారీగా నిధులు అవసరమౌతాయని అధికారవర్గాలు నివేదించాయి.

హద్దు రాళ్లకే.. రూ.180 కోట్లు

భారీగా నిధులు అవసరమని అంచనా 

రాళ్లను సమకూర్చుకోవడం, రవాణా మరింత భారం

ఇప్పటికి ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు శూన్యం


గుంటూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జగనన్న భూహక్కు, భూరక్ష పథకం కింద జిల్లాలో చేపట్ట నున్న భూముల సర్వే హద్దు రాళ్లకే భారీగా నిధులు అవసరమౌతాయని అధికారవర్గాలు నివేదించాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ధరలని పరిగణనలోకి తీసు కుంటే ఇంచుమించు రూ.180 కోట్లకు పైగా బడ్జెట్‌ అవసరమౌతుంది. అంత మొత్తాన్ని ఎప్పటికి సమ కూరుస్తారో తెలియడంలేదు. అలానే వాటిని సమకూ ర్చుకోవడం, రవాణా, సర్వే జరిగే ప్రదేశా లకు తరలిం చడం వంటివి ఆర్థికభారంతో కూడుకున్నవని పలు వురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూ డు దశల్లో భూముల సర్వే జరగనున్నది. నాలుగు రెవెన్యూ డివిజన్లు కలిపి తొలి విడతలో 227 గ్రామాలు, రెండో విడతలో 228, మూడో విడతలో 230 గ్రామాలు సర్వే చేసేందుకు షెడ్యూల్‌ని విడుదల చేశారు. ఇందుకోసం అవసరమయ్యే హద్దు రాళ్లకు సంబంధించి అంచనాలను సర్వే శాఖ రూపొందిం చింది. గుంటూరు రెవెన్యూ డివిజన్‌లో ఏ క్లాస్‌ హద్దు రాళ్లు 2,295, బీ క్లాస్‌ హద్దు రాళ్లు 16,20,510 అవసరమౌతాయి. అలానే తెనాలి డివిజన్‌లో ఏ క్లాస్‌ కేటిగిరీలో 1,863, బీ క్లాస్‌ రాళ్లు 18,96,444, నరసరావుపేట డివిజన్‌లో 1,372(కేటిగిరీ ఏ), 14,59,149(బీ కేటిగిరీ), గురజాల డివిజన్‌లో 895 (కేటిగిరీ ఏ), 9,28,593(బీ కేటిగిరీ) రాళ్లు అవసర మౌతాయి. అన్ని డివిజన్లు కలిపి 6,425 ఏ క్లాస్‌ రాళ్లు, 59,14,696 బీ క్లాస్‌ రాళ్ల అవసరం ఉంటుందని అధి కారులు అంచనా వేశారు.  బీ-కేటిగిరీ రాళ్లే ఒక్కొక్కటి రూ.300 వరకు ఉంటుందని అంచనా. అలానే ఏ- కేటిగిరీ రాయి ఒక్కొక్కటి రూ.500 పైమాటే. ఈ విధంగా చూసుకుంటే హద్దు రాళ్లకే రూ.180 కోట్లకు పైగా నిధులు అవసరమౌతాయని అంచనా వేశారు. సర్వే హద్దు రాళ్లకు ప్రభుత్వం భారీ బడ్జెట్‌ని ఎక్కడి నుంచి కేటాయిస్తుందో తెలియడంలేదని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు సర్వేకు నామ మాత్రంగానైనా నిధులు విడుదల కాలేదు. మరోవైపు సర్వే హద్దు రాళ్లని ప్రభుత్వమే సమకూరుస్తుందా లేక స్థానికంగా సేకరించేందుకు ఆదేశాలు జారీ చేస్తుందో పూర్తి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.  

Updated Date - 2021-01-19T05:25:37+05:30 IST