కడుపులో సమస్య రాకుండా ఉండాలంటే..

ABN , First Publish Date - 2022-06-01T18:43:33+05:30 IST

మన ఆరోగ్యకేంద్రం పొట్ట. అంతేకాని కళ్లకు కనిపించినదంతా వేసుకునే డస్ట్‌బిన్‌ మాత్రం కాదు. పొట్టలో చేరుకున్న ఆహారం సులువుగా జీర్ణమయితే ఆరోగ్యం బావుంటుంది

కడుపులో సమస్య రాకుండా ఉండాలంటే..

ఆంధ్రజ్యోతి(01-06-2022)

మన ఆరోగ్యకేంద్రం పొట్ట. అంతేకాని కళ్లకు కనిపించినదంతా వేసుకునే డస్ట్‌బిన్‌ మాత్రం కాదు. పొట్టలో చేరుకున్న ఆహారం సులువుగా జీర్ణమయితే ఆరోగ్యం బావుంటుంది. అయితే అనవసరమైన ఆహారాన్ని పొట్టలో వేసుకుంటే మాత్రం.. ఆ ప్రాంతం నుంచి సమస్య బయలుదేరి గుండె, కిడ్నీ.. ఇలా శరీరంలో పలుచోట్ల నష్టం కలుగుతుంది. ఉదర సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


పొట్టలో ఆహారం చేరుకున్న తర్వాత జీర్ణం సరిగా కాకపోతే.. ఆ ఆహారం వల్ల పలు రకాల సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బడం, కడుపులో దేవినట్లు ఉండటం లాంటి ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా పొట్టలో ఇబ్బందయితే.. పదే పదే అనారోగ్యం బారిన పడుతుంటారు. కడుపు నొప్పి రావచ్చు. మలబద్ధకం సమస్య వేధిస్తుంది. ఇలా కాకుండా పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే. ఎక్కువగా నూనెలో వేయించిన, మసాలా పదార్థాల జోలికి వెళ్లద్దు. ఆహారం పెద్ద పేగులో నిల్వ ఉండిపోతే మలబద్ధక సమస్య వస్తుంది. అందుకే ఏ ఆహారాన్ని అయినా బాగా నమిలి మింగాలి. ఒకే సారి ఎక్కువ ఆహారం కడుపులో వేయకుండా.. కొద్ది కొద్దిగా తినటం ప్రారంభించాలి. తిన్నవెంటనే పడుకోవద్దు. కాసేపు తిరగాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.


కడుపులో సమస్య రాకుండా ఉండాలంటే.. 

క్రమం తప్పకుండా ఒకే సమయంలోనే రోజూ ఆహారం తినాలి. ఈ అలవాటు మంచిది. ఆహారంలో కార్బొహైడ్రేట్స్‌తో పాటు ప్రొటీన్‌ ఫుడ్‌ చేర్చండి. టీ, కాఫీ, సాఫ్ట్‌డ్రింక్స్‌ జోలికి వెళ్లకండి. ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉంటే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. సీజన్‌లో దొరికే  పండ్లను, తాజా కూరగాయల్ని తినాలి. దప్పిక కలిగినపుడు కచ్చితంగా నీటిని తాగాలి. నీళ్లు తాగటం వల్ల శరీరానికి కొత్త శక్తి వస్తుంది. పొట్టలోని ఆహారం సరిగా జీర్ణం కావాలంటే వ్యాయామం అవసరం. చిన్నపాటి వర్కవుట్స్‌ చేయటం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడి వల్ల కూడా మలబద్ధక సమస్య వస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకే సాధ్యమైనంత వరకూ ఒత్తిడికి దూరంగా ఉండండి. కంటికి సరైన నిద్ర లేకున్నా.. జీర్ణక్రియ సమస్యలు మెల్లగా తలెత్తుతాయి. ఏదేమైనా ఉదరసమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 

Updated Date - 2022-06-01T18:43:33+05:30 IST