కడుపులో గ్యాస్ ఎలా ఏర్పడుతుందంటే...

ABN , First Publish Date - 2022-06-20T16:58:54+05:30 IST

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న...

కడుపులో గ్యాస్ ఎలా ఏర్పడుతుందంటే...

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న సూర్య వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా ఇంట్లోనే ఉన్నాడు. రెండు రోజుల క్రితం అతనికి ఛాతీలో మంట, నొప్పి వచ్చింది. ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో సూర్యకు కరోనా వచ్చిందని కుటుంబ సభ్యులు భయపడ్డారు. హడావుడిగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. కరోనా పరీక్షలు చేయగా, ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. తర్వాత వైద్య పరీక్షలతో అతనికి గ్యాస్‌ వచ్చిందని తెలిసింది. అతని ఛాతీలో గ్యాస్ట్రిక్ సమస్య పెరిగింది.


ఈ రోజుల్లో కడుపులో గ్యాస్ రావడం సర్వసాధారణం. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అకాల నిద్ర, మేల్కోవడం కారణంగా కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య లేదా ఆటంకం ఏర్పడితే, అది ఎసిడిటీకి కారణమవుతుంది. కడుపులో గ్యాస్ సమస్య వేధించడం మొదలవుతుంది. కొన్నిసార్లు ఛాతీ నొప్పి అనేది గ్యాస్ కారణంగా ప్రారంభమవుతుంది. నిజానికి బయట తినడం అనేది గ్యాస్ సమస్యలకు ముఖ్య కారణం. బయట భోజనం చేయడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో మంట, గ్యాస్ తదితర సమస్యలు మొదలవుతాయి. ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు కూడా వస్తాయి. జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. మన కడుపులో 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. 


మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా. ఈ రెండింటి సమతుల్యత క్షీణించినప్పుడు సమస్య తలెత్తుతుంది. కొన్నిసార్లు ఇది ఇతర వ్యాధుల దుష్ప్రభావం వల్ల కూడా ఏర్పడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఈ సమస్య వస్తుంది. ఆహారం తేలికగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా గ్యాస్ ఏర్పడుతుంది. కొంతమందికి వెల్లుల్లి, ఉల్లిపాయలు, బీన్స్ తినడం వల్ల అలర్జీ వస్తుంది. చాలా మంది తరచూ మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. వారికి కడుపులో గ్యాస్  ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి, తగినంత నీరు తాగాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని పుష్కలంగా తీసుకోవాలి. అవసరమైన పక్షంలో వైద్యులను సంప్రదించాలి.

Updated Date - 2022-06-20T16:58:54+05:30 IST