అందినంత దోచెయ్‌!

ABN , First Publish Date - 2020-02-16T08:46:33+05:30 IST

సామాన్యుల ఇంటికి చేరాల్సిన ఇసుక అధికార నేతలకు కాసులు పండిస్తోంది. ‘డోర్‌ డెలివరీ’ ఈ నేతల బినామీలకు జరిగితే, రెట్టింపయిన ఇసుక భారం

అందినంత  దోచెయ్‌!

విశాఖ నుంచి అమరావతి దారంతా దోపిడీ మేటలే

ఇసుక రీచ్‌లపై అధికార పార్టీ నేతల తిష్ఠ

బినామీలే చాలాచోట్ల కాంట్రాక్టర్లు

గోరంత బుక్‌ చేసి కొండంత లోడ్‌

లెక్క10టన్నులు..నొక్కేది15టన్నులు

ఒక పర్మిట్‌పై నాలుగైదు ట్రిప్పులు

రిటర్ను బండ్లపై తోలి లాభాలపంట


ఒక టన్ను ఇసుక తరలించడానికి సుమారు రూ.80 ఖర్చు అవుతుంది. కానీ, ఓ కాంట్రాక్టరు రూ.15లకే ఈ పని చేయడానికి ముందుకొచ్చాడు. టెండరు దక్కించుకొన్నాడు!


ట్రాక్టర్‌లో నాలుగు టన్నుల ఇసుక లోడింగ్‌కు కాంట్రాక్టరుకు ప్రభుత్వం ఇచ్చేది రూ.360. నదిలోంచి తెచ్చి, ట్రాక్టరులోకి ఎత్తిన కూలీలకు రూ.250 పోతుంది. అక్కడినుంచి స్టాకు పాయింట్‌కు తెచ్చి.. డోర్‌ డెలివరీ చేసే వాహనంలోకి దాన్నంతా చేర్చడానికి మరో రూ. 100 ఖర్చు. ఏతావాతా అందరికీ ఇచ్చుకొన్న తరువాత కాంట్రాక్టరుకు మిగిలేది రూ.10! అయినా సరే.. సిద్ధమేనంటున్నారు.


గోరంత బుకింగ్‌ చేసి కొండంత లోడింగ్‌ చేసే దారులున్నాయనే వీరందరి ధీమా! పగలు ఎలా నడిచినా రాత్రయితే తమదే రాజ్యమన్నదే అసలుసిసలు దిలాసా! ఒక పర్మిట్‌కు నాలుగైదు ట్రిప్పులు, రిటర్న్‌ బండ్లపై తరలించే ట్రిక్కులతో అటు విశాఖ నుంచి ఇటు అమరావతి దాకా చాలామంది కాంట్రాక్టర్లు దోచేస్తున్నారు. కాదు.. కాదు వారి ముసుగులోని అధికార నేతల బినామీలు పండిపోతున్నారు!  


విజయవాడ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): సామాన్యుల ఇంటికి చేరాల్సిన ఇసుక అధికార నేతలకు కాసులు పండిస్తోంది. ‘డోర్‌ డెలివరీ’ ఈ నేతల బినామీలకు జరిగితే, రెట్టింపయిన ఇసుక భారం మాత్రం ప్రజలకు దడ పుట్టిస్తోంది. అటు విశాఖ నుంచి ఇటు అమరావతి దారంతా దోచుకోవడం, సరిహద్దులు దాటించేయడమే ఇసుక మాఫియా పనిగా పెట్టుకొంది. రాష్ట్రమంతా  కాంట్రాక్టర్ల ముసుగులో చాలాచోట్ల అధికార పార్టీ నేతల బినామీలే తిష్ఠవేసి తమ జేబులు నింపుకొంటుంటే.. ఈ పరిణామం సామాన్యుల్లో గుబులు రేపుతోంది. గతం కన్నా రెట్టింపు రేటు ఉండటంతో ఇసుక తోలించుకోడానికి తటపటాయిస్తున్నారు. గతంలో ట్రాక్టరు ఇసుక(4 టన్నులు) రూ.2000కు దొరికేది. లారీ ఇసుక(10 నుంచి 15 టన్నులు) రూ.5వేలు నుంచి 8వేలుకు లభించేది. నూతన ఇసుక పాలసీ వల్ల సామాన్యుడికి ఒరిగింది శూన్యం. పైగా గతంలో కన్నా రెట్టింపు ధరలకు ఇసుకను కొనుగోలు చేయాల్సి వస్తోంది.


ప్రస్తుతం ట్రాక్టరు ఇసుక (3.5 టన్నులే) కావాలంటే తక్కువలో తక్కువ రూ.4300 (ఇసుక  ఖరీదు రూ.1312, రవాణాచార్జీ కనిష్ఠంగా రూ.3000) చెల్లించాలి. అదే లారీ ఇసుక (10 టన్నులు) కావాలంటే.. కనిష్ఠంగా రూ.8750 చెల్లించాలి. అదే ఇసుక రీచ్‌ కాస్త దూరంలో ఉంటే అది రూ.10 నుంచి రూ.12వేలు అవుతుంది. ఇది చాలదన్నట్టు, రీచ్‌ల్లో లోడింగ్‌.. అన్‌లోడింగ్‌ కాంట్రాక్టర్ల పేరుతో మంత్రులు, ప్రజాప్రతినిధుల బినామీలు తిష్ట వేశారు. అందినకాడికి ఇసుకను దోచుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం, లంకపల్లి, రొయ్యూరు, శనగపాడు, మాగల్లు(పట్టాల్యాండ్‌), గణాత్కూరు, చెవిటికల్లు(పట్టాల్యాండ్‌), ఆల్లూరుపాడు (పట్టాల్యాండ్‌), కన్నెవీడు, చింతలపాడు (పట్టాల్యాండ్‌) రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పట్టా ల్యాండ్‌ మినహా మిగిలిన రీచ్‌లన్నింటిలోనూ లోడింగ్‌ అన్‌లోడింగ్‌ కాంట్రాక్టర్లకు ఏపీఎండీసీ టన్నుకు రూ.90 చెల్లిస్తుంది.


ఒక ట్రాక్టరులోకి నాలుగు టన్నులు లోడ్‌ చేశారనుకుంటే ఏపీఎండీసీ కాంట్రాక్టరుకు రూ.360 చెల్లిస్తుంది. నదిలో ఇసుకను ట్రాక్టరులోకి ఎత్తినందుకు ట్రాక్టరుకు రూ.250 తీసుకుంటున్నారు. ట్రాక్టరు ఇసుకను నదిలో నుంచి స్టాక్‌పాయింట్‌కు చేర్చినందుకు ట్రాక్టరు కిరాయి.. మళ్లీ స్టాక్‌ పాయింట్‌లో ఉన్న ఇసుకను డోర్‌డెలివరీ చేసే లారీల్లోకి యంత్రాల ద్వారా ఎత్తినందుకు ఖర్చు రూ.100 అవుతుందనుకుంటే మొత్తం కాంట్రాక్టరు ఖర్చు రూ.350 అవుతుంది. అంటే నాలుగు టన్నుల మీద మిగిలేది రూ.10 మాత్రమే. ఈ మాత్రం లాభానికి పోటీలు పడి లోడింగ్‌ అన్‌లోడింగ్‌ కాంట్రాక్టులను దక్కించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రీచ్‌ల్లో తిష్టవేసి ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వుకునేందుకే మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు ఆ కాంట్రాక్టులను కట్టబెట్టారు. 


యథేచ్ఛగా తవ్వేస్తున్నారు..

ప్రభుత్వలెక్కల ప్రకారం టన్ను ఇసుక రూ.375. సామాన్యుడు ఆన్‌లైన్‌లో 18 టన్నులు బుక్‌ చేసుకుంటే, ఇసుక ఖరీదు రూ.6750తోపాటు రవాణా చార్జీలు చెల్లించాలి. కృష్ణాజిల్లా లంకపల్లి రీచ్‌ నుంచి 10 టైర్ల లారీకి కిరాయి రూ.6043 అంటే మొత్తం రూ.12,793 ప్రభుత్వానికి చెల్లించాలి. రీచ్‌లోని కాంట్రాక్టరుకు టన్నుకు రూ.100 చెల్లిస్తే అదనంగా 10 టన్నుల వరకు, అదే లారీలో లోడ్‌ చేస్తారు. ఇది అనధికారికం. ఇలా రోజుకి లంకపల్లి రీచ్‌లోనే 500 నుంచి 1000 టన్నుల వరకు అనధికారికంగా లోడింగ్‌ జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే ఈ ఒక్క రీచ్‌లోనే ఒకరోజు అనధికార ఆదాయం రూ.50వేల నుంచి రూ.లక్ష అన్నమాట!


ఒక్కరోజే రూ.30 లక్షలు

కృష్ణాజిల్లాలోని రీచ్‌ల నుంచి రోజుకు 3వేల టన్నుల ఇసుక అనధికారికంగా తరలిపోతుందని సమాచారం. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించడంపై నిషేధం ఉన్నా వందలాది లారీలు హైదరాబాద్‌కు మళ్లుతున్నాయి. టన్ను ఇసుక తక్కువలో తక్కువ రూ.వెయ్యికి అమ్ముకున్నా రోజుకి రూ.30 లక్షల ఆదాయం అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళుతోంది. ఇంత జరుగుతున్నా ఏపీఎండీసీ అధికారులు మాత్రం తమకెలాంటి ఫిర్యాదులు రావడం లేదని, వస్తే చర్యలు తీసుకుంటామంటూ చేతులు దులిపేసుకుంటున్నారు.


ఇసుక లెక్క గతంలో ప్రస్తుతం

ట్రాక్టర్‌ (4 టన్నులు) రూ.2000 రూ.4300 (3.5 టన్నులే) 

లారీ (10-15 టన్నులు) రూ.5000-8000 రూ.8750 (10 టన్నులు)


ఉదయం ఒక పర్మిట్‌పై లారీ ఇసుకను లోడ్‌ చేసుకుని వేరే ప్రాంతంలో అన్‌లోడ్‌ చేస్తుంది. మళ్లీ అదే వాహనం రీచ్‌లోకి వెళ్లి మరలా లోడ్‌ చేసుకుని బయటకొస్తుంది. అలా వేరేచోట డంప్‌ చేసినవాటిని దర్జాగా తరువాత బయట రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు రవాణా చేస్తున్నారు. దీనికోసం రీచ్‌ల వద్ద ఉన్న సిబ్బందిని కాంట్రాక్టర్లు బాగా సంతృప్తిపరుస్తున్నట్టు చెబుతున్నారు. పైగా వారిపై రాజకీయ ఒత్తిళ్లు బాగా  పనిచేస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దు జీలుగుమిల్లి మండలంలోని కామయ్యపాలెం, జీలుగుమిల్లి, రాచన్నగూడెం గ్రామాల్లో ఇసుక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే ఇసుక ర్యాంపుల్లో కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక రవాణా చేసేందుకు నిబంధనలు ఉన్నాయి. అయితే ఎక్కువగా అర్ధరాత్రి సమయంలోనే ఇసుకను సరిహద్దులు దాటించేస్తున్నారు. 


జరుగుతున్నది ఇదీ..

తవ్వకం నుంచి రవాణా ఉండే ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించే కాంట్రాక్టర్లు రీచ్‌లో బాధ్యతలు దక్కించుకున్నారు. 3టన్నుల సామర్థ్యం కలిగిన ట్రాక్టర్‌కు లోడ్‌ చేసేందుకు కూలీలు ఎంత లేదన్నా రూ.120 వసూలు చేస్తారు. రీచ్‌నుంచి యార్డుకు రవాణా కోసం ఇంధనం, వాహనం నిర్వహణ, డ్రైవర్‌ వేతనం కలిపి కనీసం రూ.45 ఖర్చు (టన్నుకు) అవుతుంది. రీచ్‌లోకి వాహనాలు వెళ్లి వచ్చేందుకు వీలుగా రోడ్డు ఏర్పాటు చేసి.. దానికి నిత్యం దానిని కొబ్బరిమట్టలు, రాళ్లు, మట్టి వేసి నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ట్రిప్పుకి రూ.75వరకూ పడుతుంది. వీటన్నింటినీ కలుపుకుంటే 3టన్నుల ట్రాక్టరు రీచ్‌ నుంచి యార్డుకు రావడానికి రూ.240వరకూ అవుతుంది. అయితే కొన్నిచోట్ల టన్ను ఇసుకను రీచ్‌ నుంచి యార్డుకు చేరవేయడానికి రూ.15కే కాంట్రాక్టర్లు టెండరు వేసి దక్కించుకోవడం ఖనిజాభివృద్ధి శాఖ అధికారులకు సైతం అంతుబట్టడం లేదు. 


ఏజెన్సీల ఇష్టారాజ్యం

ప్రతి రీచ్‌లో ఐదుగురు, ఇసుక యార్డుల వద్ద 9మంది చొప్పున సిబ్బందిని నియమించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీకి అప్పగించింది. అందులో అటెండర్‌గా పనిచేసేవారికి రూ.13వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.15వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఏజెన్సీ వెనుక అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు, వారి అనుయాయులే ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మానవ వనరుల సరఫరాకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీ.. వేలాది మందిని ఒకేసారి నియమించుకోవడం సాధ్యం కాదంటూ కొంతమందికి సబ్‌ కాంట్రాక్టు ఇచ్చింది. అలాంటివారంతా తమకు తెలిసినవారిని, డబ్బులు ఇచ్చినవారిని, నేతల సిఫారసులతో వచ్చినవారిని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా నియమించేసుకున్నారు.


ఉద్యోగంలో చేరినవారి విద్యార్హతలుగానీ, వ్యక్తిగత చరిత్ర వంటి వివరాలుగానీ ఖనిజాభివృద్ధి శాఖ జిల్లా స్థాయి అధికారులకు సైతం అందుబాటులో లేవు. పైగా ఏజెన్సీ ప్రతినిధులు నెలనెలా రూ.కోట్లలో బిల్లులు డ్రా చేసేసుకుంటున్నా, వాస్తవంగా విధుల్లో ఉన్న సిబ్బంది సంఖ్య ప్రభుత్వానికి నివేదించిన సంఖ్యలో సగం కూడా ఉండదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది హాజరు వ్యవహారాల బాధ్యతనూ ఏజెన్సీకే అప్పగించడంతో ‘దొంగచేతికే తాళాలు’ ఇచ్చినట్టయిందంటున్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో నమోదు చేస్తున్నామని, దీనివల్ల ఉద్యోగాలు పర్మనెంట్‌ అయిపోతాయంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష- 3లక్షల వరకూ ఏజెన్సీ ప్రతినిధులు వసూలు చేసినట్టు తెలిసింది.


సరిహద్దులు దాటించేస్తున్నారు..

జంగారెడ్డిగూడెం: చీకటయితే చెక్‌పోస్టులు నిద్రపోతాయి. సిబ్బంది గేట్లు ఎత్తేస్తారు.. ఆంధ్రా ఇసుక తెలంగాణకు రాజమార్గంలో చేరిపోతుంది! పోలవరం ప్రాంత గోదావరి తీరం నుంచి ఏజెన్సీ మీదుగా ఆంధ్రా సరిహద్దులు దాటి తెలంగాణకు ఇసుక తరలిపోతోంది. నూతన ఇసుక విధానంలో నిబంధనలు కఠినంగా ఉన్నా ఆచరణలో లేకపోవడంతో.. ఈ గ్రామాల మీదుగా అక్రమ రవాణాను ఆపలేకపోతున్నాయి. నిబంధనల ప్రకారం.. ఇసుకను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే ముందుగా. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ఆధార్‌, ఫోన్‌ నంబర్లు ఇవ్వాలి. తర్వాత నిర్మాణం వివరాలను పొందుపరచాలి. విస్తీర్ణం ప్రకారం ఎంత ఇసుక అవసరమో అధికారులు నిర్దారిస్తారు. టన్నుకు నిర్దేశించిన రుసుము చెల్లిస్తే పర్మిట్‌ ఇస్తారు. ఇలా ఒక పర్మిట్‌ తీసుకొని 2, 3 ట్రిప్పులు వెళుతున్నట్టు ఆరోపణలు న్నాయి.


Updated Date - 2020-02-16T08:46:33+05:30 IST