stock markets selloff : ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల నష్టం.. అంతటి నష్టాలకు దారితీసిన కారణాలు ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-09-23T21:55:07+05:30 IST

యూఎస్ ఫెడ్ భయాలు, రూపాయిపై ఒత్తిడి, గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెరసి దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity markets) వారాంతం శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి.

stock markets selloff : ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల నష్టం.. అంతటి నష్టాలకు దారితీసిన కారణాలు ఏంటో తెలుసా..

ముంబై : యూఎస్ ఫెడ్(US Fed) భేటీ భయాలు, రూపాయి(Rupee) పతనం, గ్లోబల్ మార్కెట్ల(Global markets) నుంచి ప్రతికూల సంకేతాలు వెరసి దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity markets) తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా వారాంతం శుక్రవారం మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడి ప్రభావంతో బీఎస్ఈ సెన్సెక్స్(Sensex) 1020.80 పాయింట్లు (1.73 శాతం) మేర పతనమై 58,098.92 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌‌ఈ నిఫ్టీ 302.45 పాయింట్లు లేదా 1.72 శాతం దిగజారి 17,327.35 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 1084 పాయింట్లు లేదా 2.67 శాతం మేర క్షీణించి 39,546.25 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్లు వరుసగా మూడు సెషన్లలో నష్టపోయినట్టయ్యింది. అత్యధికంగా  నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 3.97 శాతం నష్టపోగా.. నిఫ్టీ ఫార్మా అతి స్వల్పంగా 0.02 శాతం తగ్గింది. పవర్‌గ్రిడ్ కార్ప్ అధికంగా 7.97 శాతం పతనమవ్వగా.. ఆ తర్వాత మహింద్రా అండ్ మహింద్రా, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ స్టాక్స్ ఉన్నాయి. కాగా సన్‌ఫార్మా, టాటా స్టీల్, ఐటీసీ షేర్లు మాత్రమే గ్రీన్‌గా ముగిశాయి.  కాగా మార్కెట్ల భారీ పతనం కారణంగా రూ.4.9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.276.6 లక్షల కోట్లకు పడిపోయింది.


మార్కెట్ల పతనానికి దారితీసిన  కారణాలివే..


యూఎస్ ఫెడ్ భయాలు..

అమెరికా కేంద్ర బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ భేటీ నేపథ్యం గ్లోబల్ మార్కెట్లను కంగారెత్తిస్తోంది. వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేర పెంచడం ఖాయమనే అంచనాలు ఈ కలవరానికి కారణమవుతున్నాయి. ఈ పరిణామం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సన్నగిల్లి అమ్మకాలకు త్వరపడ్డారు.


రూపాయిపై ఒత్తిడి

దేశీయ కరెన్సీ రూపాయి జీవితకాల కనిష్ఠస్థాయికి పతనమైంది. శుక్రవారం ఇంట్రాడేలో డాలర్ మారకంలో అత్యుల్పంగా 81.23కి దిగజారింది. ఈ అంశం కూడా దేశీయ ఈక్విటీ మార్కెట్లపై గణనీయ ప్రభావం చూపింది. రూపీ విలువ తగ్గుదల ఎఫ్ఐఐలను ఏమాత్రం ఆకర్షించదు.


గరిష్ఠస్థాయికి బాండ్లపై లాభాలు

యూఎస్ ట్రెజరీ 10 ఏళ్ల బాండ్ లాభాలు(yield) 2011 తర్వాత అత్యధిక గరిష్ఠ స్థాయి 3.7180 శాతానికి పెరిగాయి. ఇక రెండేళ్ల బాండ్ లాభాలు ఏకంగా 15 ఏళ్ల గరిష్ఠస్థాయి 4.1630 శాతం స్థాయికి పెరిగాయి. ఇక ఇండియా విషయానికి వస్తే 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ లాభం రూ.7.3821 శాతంగా ఉండగా గత ఏడు సెషన్లలో 20 బేసిస్ పాయింట్ల మేర పెరగడం గమనార్హం.


గ్లోబల్ మార్కెట్లు డీలా..

యూఎస్ ఫెడ్ భేటీ నేపథ్యంలో అత్యధిక గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. డో జోన్స్ 0.4 శాతం, నాస్‌డాక్ 1.4 శాతంగా ముగియగా.. ఇతర ఆసియా మార్కెట్లు కూడా వరుసగా మూడవ రోజు పతనమయ్యాయి. 


ఇతర కారణాలివే....

దేశీయ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐ(ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) పెట్టుబడులను పెద్ద సంఖ్యలో ఉపసంహరించుకుంటున్నారు. ఆగస్టులో రూ.51  వేల కోట్లు పెట్టుబడి పెట్టినా.. సెప్టెంబర్‌లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవనున్న ఆర్బీఐ భేటీ కూడా ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. వడ్డీ రేట్ల పెంపు ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. టెక్నికల్ కారణాలు కూడా మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.


Updated Date - 2022-09-23T21:55:07+05:30 IST