ఈ షేరుకు పేరే ‘ఆక్సిజన్‌’!

ABN , First Publish Date - 2021-04-20T05:51:21+05:30 IST

పేరులో ఏముంది..? అని తేలిగ్గా కొట్టిపారేయవద్దు. స్టాక్‌ మార్కెట్లో కంపెనీ పేరు కూడా షేరు ధరను అమితంగా ప్రభావితం చేయగలదు. తాజా ఘటనే ఇందుకు ఉదాహరణ...

ఈ షేరుకు పేరే ‘ఆక్సిజన్‌’!

  • ఏప్రిల్‌లో రెండింతలకు పైగా పెరిగిన  బాంబే ఆక్సిజన్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ లిమిటెడ్‌ 

పేరులో ఏముంది..? అని తేలిగ్గా కొట్టిపారేయవద్దు. స్టాక్‌ మార్కెట్లో కంపెనీ పేరు కూడా షేరు ధరను అమితంగా ప్రభావితం చేయగలదు. తాజా ఘటనే ఇందుకు ఉదాహరణ. కరోనా దెబ్బకు సోమవారం ప్రముఖ కంపెనీల షేర్లు సైతం సొమ్మసిల్లాయి. కానీ, ఓ షేరు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కంపెనీ పేరు బాంబే ఆక్సిజన్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ లిమిటెడ్‌. పేరులో ఆక్సిజన్‌ ఉండటం కంపెనీకి భలే కలిసొచ్చింది. ఎందుకంటే, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడర్లకు సెంటిమెంటే ప్రాణవాయువు. ఈ కరోనా కాలంలో ఆక్సిజన్‌కు డిమాండ్‌ ఎంతగా పెరిగిందో తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్‌ వ్యాపారం చేసే కంపెనీలకు కాసుల పంటేనన్న ఉద్దేశంతో బాంబే ఆక్సిజన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ షేర్ల కొనుగోలుకు ట్రేడర్లు ఎగబడ్డారు. దాంతో కంపెనీ షేరు ధర అప్పర్‌ సర్క్యూట్‌ పరిధి 5 శాతం పెరిగి రూ. 24,574.85కు చేరుకుంది. ఈ నెల 1న రూ.11,000 స్థాయిలో ట్రేడైన ఈ కంపెనీ షేరు.. గడిచిన 18 రోజుల్లోనే రెండింతలకు పైగా పెరిగింది.


అయితే, ట్రేడర్లు పెద్ద తప్పే చేశారు. ఎందుకంటే, ఈ కంపెనీ ఆక్సిజన్‌ తయారు చేయదు. ఆక్సిజన్‌కు సంబంధించిన ఎటువంటి వ్యాపారంతోనూ సంబంధం లేదు. ఇది గతంలో ఇండస్ట్రియల్‌ గ్యాస్‌ ఉత్పత్తి, సరఫరా చేసేది. 2019 ఆగస్టులోనే ఆ వ్యాపారం నుంచి వైదొలిగింది. ప్రస్తుతం షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు కలిగి ఉంది. ఆ పెట్టుబడుల నుంచి లభించే ప్రతిఫలాలే కంపెనీకి ప్రధాన ఆదాయ వనరు. ఈ కంపెనీ ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ) రిజిస్ట్రేషన్‌ కూడా కలిగి ఉంది. బీఎస్‌ఈ వెబ్‌సైట్‌ కంపెనీని ఫైనాన్స్‌ రంగానికి చెందినదిగానే సూచిస్తోంది. కానీ, ఆక్సిజన్‌ సహా పలు ఇండస్ట్రియల్‌ గ్యాస్‌ల తయారీ వ్యాపారంలో ఉన్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో ఉండటం ట్రేడర్లను తప్పుదోవపట్టించింది. ఒక్క బాంబే ఆక్సిజన్‌ ఇన్వె్‌స్టమెంట్సే కాదు.. పేరులో ‘ఆక్సిజన్‌’, ‘గ్యాస్‌’ ఉన్న పలు కంపెనీల షేర్ల ధరలు ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగాయి. కానీ, అందులో చాలావరకు ప్రాణవాయువు వ్యాపారంతో సంబంధం లేనివే కావడం గమనార్హం. 


Updated Date - 2021-04-20T05:51:21+05:30 IST