డిస్కౌంట్‌తో స్టాక్ ... కాంగ్రెస్‌పై కేజ్రీ కామెంట్

ABN , First Publish Date - 2021-12-22T19:37:00+05:30 IST

"గోవా కాంగ్రెస్ ఖాళీ'' అని అర్ధమొచ్చే రీతిలో ఆ పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజా..

డిస్కౌంట్‌తో స్టాక్ ... కాంగ్రెస్‌పై కేజ్రీ కామెంట్

పనజి: "గోవా కాంగ్రెస్ ఖాళీ'' అని అర్ధమొచ్చే రీతిలో ఆ పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజా కామెంట్లు చేశారు. గోవా పర్యటనలో ఉన్న కేజ్రీవాల్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, గత ఐదేళ్లలో 15 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలిపోయారని, చిట్టచివరి స్టాక్‌గా ఆ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే 'భారీ డిస్కౌంట్'‌తో అందుబాటులో (మిగలడం) ఉన్నారని అన్నారు. గోవాను ''ఫస్ట్ క్లాస్ రాష్ట్రం, థర్డ్ క్లాస్ నేతలు'' అంటూ అభివర్ణించారు. గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు అలెక్సో రెజినాల్టో లౌరెంకో గత సోమవారంనాడు పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. దీంతో గత ఐదేళ్లలో కాంగ్రెస్‌ను వీడిన ఎమ్మెల్యేల జాబితా 15కు చేరింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు చేశారు.


''గోవా రాజకీయాలు అర్ధం కావడం లేదు. నిన్న విమానం ఎక్కినప్పుడు కాంగ్రెస్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. విమానం దిగే సమయానికి కాంగ్రెస్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలే మిగిలారు'' అని పనజిలో జరిగిన బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యానించారు. 2017లో ప్రజలు 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే 15 మంది విక్రయించబడ్డారని, ఇద్దరే మిగిలారని అన్నారు. చిట్టచివరి స్టాక్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉందన్నారు. చివరి స్టాక్ ఎవరు కావాలంటే వారు తీసుకోవచ్చని, గోవాలో కాంగ్రెస్ పరిస్థితి ఇదని పేర్కొన్నారు.


మూడో తరగతి నేతలు..

గోవా ప్రజలు మంచివాళ్లని, కానీ రాజకీయనేతలు మాత్రం మూడో తరగతి వ్యక్తులని, మంచి వ్యక్తుల అవసరం గోవాకు ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎమ్మెల్యేలతో బేరసారాలు చేసేవారని, ఇప్పుడు పోల్ క్యాండిడేట్లు కూడా అమ్ముడుపోతున్నారని అన్నారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి నేతలు ఎలా జంప్ అపుతున్నారో, కోట్ల కోసం ఎలా అమ్ముడుపోతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారని అన్నారు. స్థానికులతో సంప్రదింపులు జరిపి గోవా అభివృద్ధి నమోను తమ పార్టీ రూపొందిస్తుందని చెప్పారు. గోవాలో ఆదాయానికి ఎలాంటి లోటూ లేదని, అవినీతి కారణంగానే అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. గోవాలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా మైనింగ్ పరిశ్రమను తిరిగి తెరుస్తామని చెప్పారు. అంతవరకూ మైనింగ్ డిపెండెంట్ కుటుంబాలకు నెలకు రూ.5,000 చొప్పున రెమ్యునరేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-12-22T19:37:00+05:30 IST