ఇంకా అదే పేరు

ABN , First Publish Date - 2022-04-17T05:30:00+05:30 IST

నంద్యాల జిల్లా ఈనెల 4న ఏర్పడింది. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, ఖజానా, పశుసంవర్థక శాఖ తదితర కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.

ఇంకా అదే పేరు
కర్నూలు జిల్లా అని ఉన్న నంద్యాల రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ బోర్డు

బోర్డులపై కర్నూలు జిల్లా అనే..

నంద్యాల జిల్లాగా మార్చని అధికారులు


నంద్యాల టౌన్‌, ఏప్రిల్‌ 17: నంద్యాల జిల్లా ఈనెల 4న ఏర్పడింది. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, ఖజానా, పశుసంవర్థక శాఖ తదితర కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. కొత్త జిల్లా ఆవిర్భవించగానే అన్ని శాఖలకు సంబంధించిన బోర్డులన్నిటిపై కర్నూలు జిల్లాను చేరిపేసి, నంద్యాల జిల్లా అని రాయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇంకా ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై కర్నూలు జిల్లా అనే కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై నంద్యాల జిల్లా అని రాయించే విషయంలో ఆయా విభాగాల అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంది. దీని కోసం అధికారులు క్రమబద్ధంగా పని చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


పోలీసు స్టేషన్ల బోర్డులపై కర్నూలు జిల్లా అనే.. 


నంద్యాల రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ ప్రధాన ద్వారం వద్ద ఉండే బోర్డు మీద ఇంకా కర్నూలు జిల్లా అనే ఉంది. దానికి సమీపంలోని తాలూకా పోలీసుస్టేషన్‌ బోర్డుపై కూడా కర్నూలు జిల్లా అనే అక్షరాలు అలాగే ఉన్నాయి.  


ఆర్టీసీ బస్టాండ్‌ బోర్డును మార్చరా ..?


గతంలో కర్నూలు కేంద్రంగా ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీ రీజియన్‌ కేంద్రాన్ని రెండుగా విభజించి నంద్యాల రీజియన్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ బోర్డు మీద మాత్రం కర్నూలు జిల్లా అనే ఉంది. కొత్త రీజియన్‌గా ఏర్పాటైనందువల్ల బస్టాండ్‌ బోర్డుపై నంద్యాల జిల్లా అని రాయించాలని అధికారులు అనుకోలేదనే విమర్శలు ఉన్నాయి. 


ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద కూడా..


నంద్యాల నడిబొడ్డున ఉన్న ట్రాన్స్‌కో కార్యాలయాల ఆవరణలో ఆ శాఖ బోర్డుల మీద కర్నూలు జిల్లా అనే అక్షరాలను మార్చలేదు. గతంలో ఏర్పాటు చేసిన బోర్డుపై ఆ బోర్డును బహూకరించిన సంస్థ పేరు, ఆ సంస్థ సెల్‌ నెంబర్లను పెద్ద పెద్ద అక్షరాలతో రాయించిన ట్రాన్స్‌కో అధికారులు, ఆ సబ్‌ స్టేషన్‌కు సంబంధించి టెలిఫోన్‌ నెంబర్‌, సెల్‌ నెంబర్లను రాయించలేదు. ఇప్పుడు దానిపై నంద్యాల జిల్లా అని ఎప్పుడు రాయిస్తారని జనం చర్చించుకుంటున్నారు. 


ఎంఆర్‌సీ భవనంపై కూడా


నంద్యాల మండల రిసోర్స్‌ సెంటర్‌ కార్యాలయం నూనెపల్లె ఓవర్‌ బ్రిడ్జి కింద ఎంపీడీవో కార్యాలయం పక్కనే ఉంది. ఇక్కడ కూడా కర్నూలు జిల్లా పేరును తొలగించలేదు. ఇదే ఆవరణలో ఉన్న మరి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై కర్నూలు స్థానంలో నంద్యాల జిల్లా అనే పేపర్‌ ప్రింట్‌ను అతికించారు. 


దాతల కోసం ఎదురుచూపు.. 


నంద్యాల జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త జిల్లా పేరుతో బోర్డులు ఏర్పాటు చేయడానికి ఆయా శాఖల అధికారులు దాతల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త బోర్డులు ఖర్చు తమ నెత్తిపై పడుతుందని అధికారులు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పోలీసుస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్‌, ఇతర పలు ప్రభుత్వ కార్యాలయాల బోర్డుల కోసం అధికారులుదాతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులను దాతలు ఏర్పాటు చేస్తే తమ సంస్థలు పబ్లిసిటీ అయ్యేలా భారీగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ పద్ధతిలో అయినా నంద్యాల జిల్లా అని ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త బోర్డులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-04-17T05:30:00+05:30 IST