‘కుడి’ వాదపు సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరి!

ABN , First Publish Date - 2022-03-17T08:54:16+05:30 IST

‘లౌకిక వాదపు ఉక్కపోత’ అన్నాడు ఒక మిత్రుడు. మంచి పదప్రయోగం. మొన్నటి ఎన్నికల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో జనం బిజెపి మీద అంత అభిమానం చూపించడానికి కారణం, ఆ ఉక్కపోతను అధిగమించే ప్రయత్నమేనని ఆ మిత్రుడు...

‘కుడి’ వాదపు సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరి!

‘లౌకిక వాదపు ఉక్కపోత’ అన్నాడు ఒక మిత్రుడు. మంచి పదప్రయోగం. మొన్నటి ఎన్నికల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో జనం బిజెపి మీద అంత అభిమానం చూపించడానికి కారణం, ఆ ఉక్కపోతను అధిగమించే ప్రయత్నమేనని ఆ మిత్రుడు అనుకుంటున్నారు. భారతీయ జనతాపార్టీ ప్రధాన భాగస్వామిగా మునుపు కూడా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కానీ, 2014లో నరేంద్రమోదీ మొదటిసారి ప్రధాని అయినదగ్గర నుంచే కొత్త చరిత్ర మొదలయిందని, అంతకు ముందు ఆరున్నర దశాబ్దాలు రాజ్యం చెలాయించిన ఉదార, లౌకిక, వామపక్ష, దేశభక్తరాహిత్య వాదాలన్నీ తోకముడిచి, కుడి వాద ఆలోచనావిధానానికి కాలం మారిందని వాళ్లూ వీళ్లూ అందరూ అంగీకరిస్తున్నారు. ఏదీ ఒక్కరోజులో, ఆకస్మికంగా మారదు, క్రమపరిణామమేదో నేపథ్యంగా ఉంటుంది నిజమే కానీ, జనామోదాన్నీ, అంగ అర్థ బలాల్నీ, ఉద్వేగశీలతనీ మేళవించి భావ వాతావరణాన్ని, తీవ్రంగా మార్చే ప్రయత్నం మాత్రం ఈ ఏడేళ్లలోనే బలంగా జరుగుతోంది. అందుకే, సుప్రసిద్ధ చరిత్రకారిణి కంగనా రనౌత్ భారతదేశానికి 2014లోనే స్వాతంత్ర్యం వచ్చిందని అభిప్రాయ పడి ఉంటారు. విప్లవాలలో అయినా, యుద్ధాలలో అయినా, ఎన్నికలలో అయినా గెలిచిన పక్షాలు తమకు విశ్వసనీయతను, న్యాయబద్ధతను ఇచ్చే చరిత్రను రాసుకోవడం సహజం. కానీ, ఇప్పుడు రచనలో ఉన్న చరిత్ర, కేవలం అందుకోసమే కాదు, భవిష్యత్ పరిణామాలకు ప్రాతిపదికను కల్పించడానికి కూడా నిర్మిస్తున్నది. గతాన్ని, తాను తప్ప మిగిలిన శక్తులను కలగాపులగం చేసి, కొత్త కార్యకారణాలను నిర్వచిస్తున్నది. గతంలో ప్రభుత్వాల పాలనలోనో, సమాజంలోనో నిజంగా కానీ, బూటకంగా కానీ ఉండిన మంచి విలువలన్నిటినీ దోషులుగా బోనులో నిలబెట్టి, ఇప్పటి చీకటినే వెలుతురుగా భ్రమింపజేస్తున్నది.


లౌకికవాదం నిజంగా అంత ఊపిరాడకుండా చేస్తున్నదా? అన్న ప్రశ్న వేసుకునే ముందు, అసలు లౌకికవాదం మన దేశంలో అమలులో ఉన్నదా అన్న ప్రశ్న రావాలి. మన దేశంలో సోషలిజం విఫలమయింది అని ఎవరైనా అంటే, ఎప్పుడైనా మన దేశంలో సోషలిజం ఏర్పడిందా అన్న సందేహం కలగాలి. లౌకికవాదంలో తమకు విశ్వాసం ఉన్నదని చెప్పుకునే ప్రభుత్వాలు, ఎప్పుడూ పరిపాలననుంచి మతాన్ని దూరంగా ఉంచలేదు. రాజకీయాలలో మతాన్ని వాడుకోకుండా ఉండలేదు. విద్యను కూడా మతరహితం చేయలేదు. మైనారిటీల సంక్షేమం కోసం కొన్ని మాటవరస చర్యలు తీసుకోవడం లౌకికవాదం ఎట్లా అవుతుంది? ఆ అరకొర సంక్షేమమే గిట్టనివారు, దేశాన్నంతా మైనారిటీలకు దోచిపెడుతున్నట్టు గగ్గోలు పెట్టడం, ఆ హడావిడికి కలవరపడి మెజారిటీ మతస్థుల మనోభావాలను కూడా రంజింపజేయడానికి ప్రయత్నాలు చేయడం, ఇదే కదా స్వాతంత్ర్యానంతర దశాబ్దాల చరిత్ర. అవసరమైనప్పుడల్లా, కాంగ్రెస్ ఆర్‌ఎస్‌ఎస్ కలసే పనిచేశాయి. జాతీయవాదాన్ని, మత జాతీయతను పెంచిపోషించడానికి రెండు సంస్థలూ పరస్పరం సహకరించుకున్నాయి. ఏ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వేదమంత్రాలు లేకుండా జరిగాయి? కులచిహ్నాలు, మత చిహ్నాలు ధరించకుండా సంచరిస్తున్న లౌకిక స్థలాలు ఏవి? ఇక, లౌకికవాదం ఉక్కపోయించింది ఎక్కడ? మెజారిటీ సమాజంలోని సకల రుగ్మతలూ సమసిపోయినట్టు, కుల మత అంతరాలే లేనట్టు, స్త్రీలకు అర్ధరాజ్యం రాసిచ్చినట్టు భావించుకుని, మైనారిటీల తలాక్ విడాకులకు, హిజాబ్ అభివృద్ధి నిరోధకతకు ఉక్కిరిబిక్కిరి కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


లౌకికవాదానికి చిరునామా అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, తాను తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, లేదా బిజెపి తప్పు చేస్తోందా చెప్పదు. దానికి ఇప్పుడు ‘హిందూత్వ’ ఓట్లు కూడా కావాలి. మైనారిటీలతో కానీ, వారి ప్రాతినిధ్య పార్టీలతో కూడా ఎటువంటి బహిరంగ సంబంధం కనబడకూడదు. ఇక, లౌకికవాదాన్ని తమ పద్ధతిలో అర్థం చేసుకునే కమ్యూనిస్టులు, నిజంగానే తాము విఫలమయ్యామేమో, ఉక్కపోయిస్తున్నామేమో అని ఆలోచనలో పడ్డారు. మేం నాస్తికులము కాదు, స్వాములైనా సరే దేవుళ్లైనా సరే దర్శనాలు చేసుకుంటాము అని ‘హిందూ’ ఓట్ల కోసం తంటాలు పడుతున్నారు. ఉదారవాదులుగా కూడా మిగలడానికి సంకోచించే స్థితిలో ఉన్న ఎన్నికల కమ్యూనిస్టులను చూస్తే, చరిత్రకే జాలి కలుగుతుంది. ఎన్నికలలో మాత్రమే కాదు, నరేంద్రమోదీ భావజాల సర్జికల్ స్ట్రయిక్స్‌లో మరింతగా అణగారిపోతున్న రాజకీయ శక్తులను చూస్తే, ఈ ఏకఛత్రాధిపత్యం సుదీర్ఘమనిపిస్తుంది.


పెట్టుబడిదారీ విధానంలోనే మిశ్రమ ఆర్థిక విధానం ఒక పద్ధతి. ఆరంభదశలో ఉన్న వ్యాపార సమాజంలో పెట్టుబడి పెట్టగల వ్యక్తులు, సంస్థలు పరిమితంగా ఉంటారు కాబట్టి, ప్రభుత్వాలే రంగంలోకి దిగి రకరకాల ఉత్పాదక సంస్థలను ఏర్పరుస్తాయి. అదొక సోషలిజం అయినట్టు, అది విఫలమై, ఆర్థిక సంస్కరణలు వచ్చినట్టు ఒక కథనం వ్యాపింపజేశారు. సరే, రష్యాలోనో, చైనాలోనో, వియత్నాంలో వర్తమాన సమస్యలకు కమ్యూనిస్టు పార్టీలను, సోషలిజాన్ని నిందిస్తే, ఒక అర్థముంది. కానీ, భారతదేశంలో సంక్షోభాలకు కూడా సోషలిజం కారణమా? బిజెపి, దాని పూర్వ రూపం జనసంఘం, తదితర మితవాద పక్షాలు మినహా, తక్కిన మధ్యేవాద రాజకీయపక్షాలన్నీ సోషలిస్టులూ కమ్యూనిస్టులేనా? పీవీ నరసింహారావూ మన్మోహన్ సింగ్ పాలనా కూడా సోషలిస్టు పాలనేనా? మన దేశంలోనే కాదు, అమెరికాలో కూడా వామపక్షమే సర్వరోగ కారణమనడం ఫ్యాషన్ అయిపోయింది. ప్రపంచం అంతా, విప్లవవాదాన్ని, సమానత్వ వాదాన్ని, పర్యావరణవాదాన్ని, ఉదారవాదాన్ని, సంక్షేమవాదాన్ని ఒకే గాటన కట్టి నిందించడం అలవాటయింది. ప్రజలు విశ్వసించేదే సత్యం అని సూత్రీకరించిన మితవాద మీడియా సిద్ధాంతి రోజర్ ఐల్స్, ఫాక్స్ చానెల్ ద్వారా తీవ్రఛాందసవాద, తీవ్రవాదరైటిస్టు వార్తా ప్రసారాలను ప్రారంభించాడు. తనది కూడా నిష్పక్షపాతమేనని, తక్కిన మీడియా అంతా లెఫ్ట్ పక్కన ఉన్నది కాబట్టి, తాను దాన్ని సమతుల్యం చేస్తున్నానని సమర్థించుకున్నాడు. అర్నబ్ గోస్వామి తరహా జర్నలిస్టులకు అతనే ఆద్యుడు. 


అమలులో లేని విలువ అమలులో ఉన్నట్టు చెప్పి, సమస్యలకు కారణంగా దాన్ని చూపించడం ఒక చమత్కారమైతే, ఆ నేరారోపణను ఖండించడానికి కానీ, ఆ విలువ పక్షాన మాట్లాడడానికి ఎవరూ లేకపోవడం మరొక ఆశ్చర్యం. తాము విశ్వసించని విలువను తమకు ఆపాదిస్తే దాన్ని కాదనడానికి కూడా గొంతుపెగలకపోవడం మరొక విచిత్రం. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, సోషలిజం వంటివాటిని ఏదో పద్ధతిలో తన విలువలుగా చెప్పుకుంటూ వచ్చింది. ఆ గతాన్ని గర్వంగా సొంతం చేసుకోవడం కానీ, వర్తమానంలో వాటి కొనసాగింపును కోరుకోవడం కానీ చేయలేని దుస్థితిలో ఉన్నది. కశ్మీర్‌లో వేర్పాటు కోసం కానీ, స్వతంత్రం కోసం కానీ 30ఏళ్ల కింద మరోసారి రగిలిన మిలిటెన్సీని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానూ సమర్థించలేదు. నెహ్రూ కాలం నుంచి తాము మోసానికి, నమ్మకద్రోహానికి గురయ్యామని కశ్మీరీ ప్రజలు భావిస్తారు కూడా. మిలిటెంట్ నాయకులు కూడా ఎన్నికలలో పాల్గొని, ప్రజాస్వామిక పద్ధతులను పరీక్షించాలని ప్రయత్నించినప్పుడు, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు. ఆ ఎన్నికలలో కేంద్రం అండతో జరిగిన రిగ్గింగ్ అనంతరమే, మిలిటెంట్ ఉద్యమం ఉధృతమైంది. బిజెపి ఒత్తిడితో విపిసింగ్ నియమించిన జగ్‌మోహన్‌ను కాంగ్రెస్ కూడా కొనసాగించింది. ఒక పక్క రాజకీయ ప్రక్రియ, మరొక పక్క అణచివేత అన్న విధానాన్నే మన్మోహన్ ప్రభుత్వం కూడా అనుసరించింది. 370 రద్దు వంటి తీవ్ర నిర్ణయాలను తీసుకోవడానికి కాంగ్రెస్ సంకోచించి ఉండవచ్చును కానీ, కశ్మీర్‌లో మిలిటెంట్ సంస్థలను, ఉద్యమాలను అణచివేయడంలో కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల మధ్య తేడా ఏమీ లేదు. మరి కశ్మీర్ విషయమై తనను బోనెక్కిస్తుంటే కాంగ్రెస్ ఎందుకు నిస్సహాయంగా ఉండిపోయింది? కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం స్థిరపరచిన కథనాన్ని వ్యతిరేకిస్తున్నట్టయితే కాంగ్రెస్ బాహాటంగా ఎందుకు ఆ పనిచేయదు? కశ్మీర్ లోయలోని ప్రజలు పరాయిగా మారకుండా చూడడానికి కాంగ్రెస్ రాజకీయవిధానం సాపేక్షంగా ఉదారంగా ఉన్నదనుకుందాం. ఆ ఉదారతను ఎందుకు కాంగ్రెస్ ప్రకటించుకోదు? ప్రచారం చేసుకోదు? అంటే, కశ్మీర్ ప్రజలకు అనుకూలంగా ఉన్నామని చెప్పుకున్నా నష్టమే, లేదూ, మేమూ బాగా అణచివేశాము అని చెప్పుకోవాలన్నా భయమే. ఎటువంటి నిబద్ధతా లేని డొల్లతనంలో కూరుకుపోయిన కాంగ్రెస్, అసహాయంగా తనమీద పడే అపవాదులను మాత్రం భరిస్తూ ఉండక తప్పదు.


కాంగ్రెస్‌కో, దారిమరచిన కమ్యూనిస్టులకో ఈ దుస్థితి అనివార్యం కావచ్చు, అందుకు పెద్దగా చింతించవలసింది కూడా లేదు. కానీ, ప్రజలకు, ప్రగతికి అవసరమైన విలువలకు ప్రతినిధులుగా నిలువవలసినవారందరూ నిరుత్తరులయ్యారా? మంచి అంతా చాదస్తమో, మూర్ఖత్వమో, ఉక్కపోతో, వెనుకబాటో అని స్థిరపడుతున్నప్పుడు, ఏమి చెప్పాలో ఎట్లా చెప్పాలో ఎక్కడ మారాలో ఏమి చేయాలో తెలియని అగమ్యగోచరతలో పడిపోయారా?


కె. శ్రీనివాస్

Updated Date - 2022-03-17T08:54:16+05:30 IST