స్వీయ నిర్బంధంతోనే కట్టడి

ABN , First Publish Date - 2020-03-29T10:24:12+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి జిల్లా యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తోంది.

స్వీయ నిర్బంధంతోనే కట్టడి

జిల్లా సరిహద్దులు మూసివేత

నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతి

పోలీసులు సూచనలు తప్పక పాటించాలి

144 సెక్షన్‌ ఉల్లంఘిస్తే కేసులే


కడప, మార్చి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి జిల్లా యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తోంది. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, పారిశుధ్యం.. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మన కోసం, మన ఆరోగ్యం కోసం.. మన పిల్లల భవిష్యత్‌ కోసం వారి ఆరోగ్యాలు, కుటుంబాలను త్యజించి పనిచేస్తున్నారు. మనం చేయాల్సింది ఒక్కటే.. కరోనాను కట్టడి చేయాలంటే స్వీయ నిర్బంధం పాటించడం. ఇంటి నుంచి బయటికి రాకుండా ఏప్రిల్‌ 14 వరకు పక్కాగా పాటిస్తే కరోనాపే తరిమేయవచ్చు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సామాజికదూరం పాటించాల్సిన అవసరం ఉంది.


జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు.. అంటూ జిల్లా యంత్రాంగం పదే పదే హెచ్చరిస్తున్నా.. అక్కడక్కడా బాధ్యత మరిచిన కొందరు యువకులు రోడ్ల పైకి వస్తూనే ఉన్నారు. 144 సెక్షన్‌ ఉల్లంఘిస్తే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శనివారం కడప నగరం లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేశారు. పట్టణంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిత్యావసర సరుకులకు అనుమతించారు. అనంతరం పోలీసులు కట్టుదిట్టం చేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల స్టాల్స్‌ వద్ద జనం సామాజికదూరం పాటించకుండా రద్దీగానే కనిపించారు.


పోలీసులు కంట్రోల్‌ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. చిన్న పిల్లలను కూడా తీసుకువచ్చారు. ధరలపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. డీఎస్పీ సూర్యనారాయణ పట్టణమంతా పర్యటించి లాక్‌డౌన్‌ బందోబస్తును పర్యవేక్షించారు. సాయంత్రం పట్టణంలో పోలీసు కవాతు నిర్వహించారు. 

Updated Date - 2020-03-29T10:24:12+05:30 IST