రైళ్లలో కర్ర అక్రమ రవాణా

ABN , First Publish Date - 2022-05-24T06:56:24+05:30 IST

రైళ్లలో వెదురు, కర్ర అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. నిన్నమొన్నటి వరకు కరోనా కారణంగా రాత్రిపూట ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మాత్రమే నడుస్తుండగా తాజాగా పగటిపూట తిరిగే ప్యాసింజర్‌ రైళ్ల స్థానంలో అదే రైళ్లను ఎక్స్‌ప్రెస్‌గా మార్చి ప్రవేశపెట్టిన విషయం విధితమే.

రైళ్లలో కర్ర అక్రమ రవాణా
రైల్లో తరలిస్తున్న కలప

- మామూళ్ళ మత్తులో అధికారులు

- రైల్వే ప్రయాణికుల ఇక్కట్లు

గిద్దలూరు, మే 23 : రైళ్లలో వెదురు, కర్ర అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. నిన్నమొన్నటి వరకు కరోనా కారణంగా రాత్రిపూట ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మాత్రమే నడుస్తుండగా తాజాగా పగటిపూట తిరిగే ప్యాసింజర్‌ రైళ్ల స్థానంలో అదే రైళ్లను ఎక్స్‌ప్రెస్‌గా మార్చి ప్రవేశపెట్టిన విషయం విధితమే. దీంతో మళ్లీ కర్ర అక్రమ రవాణాకు తెరలేసింది. నల్లమల అటవీ ప్రాంతంలో లభించే వెదుర్లు, బిల్లుడు, టేకు, రోజ్‌వుడ్‌ ఇతర జాతుల చెట్లను నరికి రైళ్ల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణా చేసే వారు ఎక్కువ మంది రోజువారి కూలీలు కూడా ఉండడం విశేషం. గుంతకల్లు నుంచి నంద్యాల, గిద్దలూరు మీదుగా గుంటూరు వైపు వెళ్లే పగటిపూట రైళ్లలో నిత్యం కర్ర అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో టేకు, రోజ్‌వుడ్‌ పెద్దగా లభించకపోవడంతో వెదుర్లు, ఇతర జాతుల చెట్లను కొట్టి చలమ, దిగువమెట్ట, గాజులపల్లి రైల్వేస్టేషన్లలో రైలు ఆగిన సందర్భాలలో ప్యాసింజర్‌ బోగీలలో కర్రను పెట్టుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బాత్‌రూములకు అడ్డంగా, ప్రయాణికుల సీట్లకు పక్కన, భోగీలలోకి ఎక్కే వాకిళ్లకు అడ్డంగా కర్రను వేస్తుండడంతో రైలు ఎక్కి, దిగే సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీట్లు దొరకవేమోనన్న హడావిడిలో రైలు ఎక్కి భోగీలలో అటూ ఇటూ తిరిగే ప్రయాణికులు కింద ఉన్న కర్రలను చూసుకోకుండా తగిలి గాయాల పాలవుతున్నారు. కానీ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులోపడి పట్టించుకోకపోవడం గమనార్హం. అడవిలో చెట్లను, వెదుర్లను యథేచ్ఛగా నరికి రైల్వేస్టేషన్‌ సమీపంలోకి పట్టపగలే తీసుకుని వస్తుండగా అటవీశాఖ అధికారులకు మాత్రం కనిపించడం గమనార్హం. రైలు భోగీల్లో ఎక్కడపడితే అక్కడ కర్రను ఉంచి గుంటూరు జిల్లా వైపుకు తీసుకుని పోతూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నా రైల్వే టీసీలకు గాని, రైళ్లలో రక్షణగా వెళ్లే రైల్వేపోలీసులకు గాని ఈ కర్ర కనిపించక పోవడం మరింత విశేషం. అక్రమార్కులు అటు ఫారెస్టు, ఇటు రైల్వే అధికారులకు ఎంతో కొంత ముట్టచెబుతుండడంతో వారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రయాణికుల ఇబ్బందులను, గమనించి కర్ర అక్రమ రవాణాకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


Updated Date - 2022-05-24T06:56:24+05:30 IST