ముగిసిన రెండేళ్ల నిషేధం.. కెప్టెన్సీకి స్మిత్ రెడీ!

ABN , First Publish Date - 2020-03-29T21:27:09+05:30 IST

ఆస్ట్రేలియా పరుగుల యంత్రం, టెస్టు జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలకు మళ్లీ రెడీ అయ్యాడు.

ముగిసిన రెండేళ్ల నిషేధం.. కెప్టెన్సీకి స్మిత్ రెడీ!

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా పరుగుల యంత్రం, టెస్టు జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలకు మళ్లీ రెడీ అయ్యాడు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి కెప్టెన్సీ పదవికి రెండేళ్లపాటు దూరమయ్యాడు. 30 ఏళ్ల స్మిత్ నిషేధానికి గురయ్యేంత వరకు ఆసీస్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్మిత్‌పై నమోదైన అభియోగాలు నిజమని తేలడంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. 12 నెలల నిషేధం తర్వాత తిరిగి బ్యాట్ పట్టినప్పటికీ మరో ఏడాదిపాటు ఎటువంటి పదవులు చేపట్టకూడదన్న నిషేధం కూడా ఉండడంతో బ్యాట్స్‌మన్‌గానే కొనసాగాడు. అతడితోపాటు నిషేధానికి గురైన మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై సారథ్య బాధ్యతలు చేపట్టకుండా జీవిత కాలం నిషేధం ఉంది. 


బాల్‌ట్యాంపరింగ్ జరిగి రెండేళ్లు పూర్తయ్యాయి. సారథ్య బాధ్యతలు చేపట్టడంపై ఉన్న నిషేధం కూడా ముగిసిపోవడంతో కెప్టెన్సీ చేపట్టేందుకు ఉన్న అడ్డు తొలగిపోయింది. సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా బోర్డు నుంచి మళ్లీ పిలుపు వస్తున్నట్టు సమాచారం. అయితే, స్మిత్ మాత్రం కెప్టెన్సీపై ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ ఇటీవల టెస్టు కెప్టెన్ టిమ్ పైనే కెప్టెన్సీని ప్రశంసించాడు. అంతేకాదు, స్మిత్ మళ్లీ ఈ ‘భారాన్ని’ తలకెత్తుకుంటాడని అనుకోవడం లేదని పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం తాను ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారించినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్మిత్ పేర్కొన్నాడు. దీనిని బట్టి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అతడు అంతగా ఆసక్తి కనబరచడం లేదని అర్థమవుతోంది. ఆసీస్ టీ20 జట్టుకు అరోన్ ఫించ్ టీ20, వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.  

Updated Date - 2020-03-29T21:27:09+05:30 IST