‘డిజిటలైజేషన్‌’ వైపు అడుగులు

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇంటినంబర్లపై గందరగోళం నెలకొంది.

‘డిజిటలైజేషన్‌’ వైపు అడుగులు


  • పట్టణాల్లో ఇళ్లకు కొత్తగా డిజిటల్‌ నంబర్లు
  • కొత్త ఇంటినంబర్ల గుర్తింపు ఇక సులువు
  • పన్నుల వసూళ్లు, మౌలిక సదుపాయాలకు ఆలంబన
  • పూర్తయితే పౌరసేవలన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే
  • ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేయాలని సర్కార్‌ ఆదేశం

   ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇంటినంబర్లపై గందరగోళం నెలకొంది. ఒక పద్ధతి ప్రకారం ఇంటినంబర్లు లేకపోవడంతో చిరునామాలు, ఆచూకీ తెలుసుకోవడం, పన్నుల వసూళ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఇంటినంబర్ల గుర్తింపుపై ప్రజలు తికమకపడుతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు డిజిటల్‌ ఇంటినంబర్ల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. 

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఇంటి నంబర్ల క్రమబద్ధీకరణ చేసేందుకు ‘డిజిటలైజేషన్‌’ చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. దాదాపు మూడున్నరేళ్ల కిందట రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచే అధికసంఖ్య కొత్త పురపాలికలు ఏర్పాటయ్యాయి. అయితే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఇంటినంబర్లపై ఇంకా గందరగోళమే నడుస్తోంది. ఒక క్రమబద్ధంగా ఇంటినంబర్లు లేకపోవడంతో చిరునామాలు, ఆచూకీ తెలుసుకోవడం, పన్నుల వసూళ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కేంద్రంలో కూడా పక్కపక్క ఇళ్ల నంబర్లు క్రమబద్ధంగా లేవు. దీనికితోడు పురపాలిక సంఘాల్లో విలీనమైన చుట్టుపక్కల ప్రాంతాల వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇంటినంబర్ల గుర్తింపుపై ప్రజలు తికమకపడుతున్నారు. విలీన గ్రామంలోని ఇంటి నంబర్లు మరోచోట కూడా ఉంటున్నాయి. పట్టణంలోని కాలనీల్లో ఏ ఇంటి నంబరు ఎక్కడ ఉందో తెలియక గజిబిజీగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు డిజిటల్‌ ఇంటినంబర్ల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. డిజిటల్‌ కోడ్‌లు అమల్లోకి తీసుకువస్తే పౌరసేవలు మరింత సులభతరమవుతాయి. కొత్తవిధానంలో ప్రాంతం పేరు, కాలనీ, రోడ్డు నంబరు, అంతస్థు వివరాలను పక్కాగా నమోదు చేస్తారు. ఈ వివరాలను గూగుల్‌ పటానికి  అనుసంధానిస్తారు. తద్వారా అంబులెన్స్‌, అగ్నిమాపక పోలీసు సేవలు తక్షణమే అందించే వీలుంటుంది. మౌలిక వసతుల కల్పన, సర్వేలు, ఇతర కార్యక్రమాల్లో ప్రాంతాలు, నివాసాల గుర్తింపు ఇక సులభతరమవుతుంది. అంతేకాక  భువన్‌ యాప్‌లో సమగ్ర వివరాలు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు డివిజన్లలో ప్రయోగాత్మకంగా దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. వీటి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. దీంతో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా ఏర్పడిన అన్ని మున్సిపాలిటీల్లో ఇళ్ల నంబర్లను డిజిటలైజేషన్‌ చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఈ ప్రక్రియ మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇది పూర్తయితే పన్నుల వసూళ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన మరింత సులువుకానుంది. మున్సిపాలిటీల్లో పన్నులు, ఇతర బిల్లుల చెల్లింపు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకునే వీలుంటుంది. పెరుగుతున్న జనాభా పట్టణీకరణ దృష్ట్యా పురపాలికల్లో అనూహ్య మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. మౌలిక సదుపాయాల కల్పనకు పట్టణ ప్రగతికి డిజిటలైజేషన్‌ ఆలంబనగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

డిజిటలైజేషన్‌ ఇలా ...

ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో కొత్తగా అనేక మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. రంగారెడ్డిజిల్లాలో ప్రస్తుతం మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక మేడ్చల్‌ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు ఉండగా, వికారాబాద్‌లో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం పురపాలికల్లో ఇంటినంబర్లు వరుస క్రమంలో లేకపోవడంతో తికమక అవుతోంది. తద్వారా అత్యవసర సమయాల్లో ఇంటిని గుర్తించడం కష్టతరంగా ఉంటుంది.  డిజిటల్‌ నంబర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాత ఇళ్ల సంఖ్యకు స్వస్తి పలికి కొత్త సంఖ్యలతో సరికొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఈ డిజిటల్‌ నంబర్లు రెవెన్యూ ప్రాతిపదికన వార్డుల్లో నంబర్లు వరుస క్రమంలో కేటాయిస్తారు. వార్డులోని ఇళ్ల నంబర్లన్నీ ఒకే క్రమ సంఖ్యతో  పక్కకాలనీలకు వరుస క్రమం ప్రారంభమయ్యేలా మార్పులు చేస్తారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక కోడ్‌ ఉంటుంది. ఈ కోడ్‌ నంబరు తరువాత కొత్తగా ఇచ్చే ఇంటినంబర్లు ఉంటాయి.  అపార్ట్‌మెంట్‌లో నివసించే వారందరికీ ఒకే నంబరు ఇచ్చి చివరిలో మాత్రం ప్లాట్‌ నంబరు జోడిస్తారు. 

ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలు మున్సిపల్‌ కార్పొరేషన్ల వివరాలు

రంగారెడ్డి జిల్లా

మున్సిపల్‌ కార్పొరేషన్లు 03

మున్సిపాలిటీలు 13

మేడ్చల్‌ జిల్లా 

మున్సిపల్‌ కార్పొరేషన్లు 04

మున్సిపాలిటీలు 09

వికారాబాద్‌ జిల్లా 

మున్సిపాలిటీలు        04

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST