కరోనా గుప్పెట్లో.. విలవిల!

ABN , First Publish Date - 2020-07-11T11:36:20+05:30 IST

జిల్లాలో ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత కనిపిస్తోంది. ఇంట్లో ఒక్కరికి ‘పాజిటివ్‌’ వచ్చినా మిగతా కుటుంబ సభ్యులంతా

కరోనా గుప్పెట్లో.. విలవిల!

సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు

జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు  

ఉదయం 6 నుంచి 1 గంట వరకే దుకాణాలకు అనుమతి

కంటైన్మెంట్‌ జోన్లలో కఠినమైన ఆంక్షలు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత కనిపిస్తోంది. ఇంట్లో ఒక్కరికి ‘పాజిటివ్‌’ వచ్చినా మిగతా కుటుంబ సభ్యులంతా మహమ్మారి ముప్పును ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజులుగా సగటున రోజుకు వంద కేసులకు తక్కువ కాకుండా నమోదవుతుండడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మహమ్మారిని అదుపు చేయాలంటే మళ్లీ లాక్‌ డౌన్‌ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. అన్‌లాక్‌ అమల్లోకి వచ్చిన తరువాత ప్రజలు రోడ్లపైకి విచ్చలవిడిగా వచ్చేస్తున్నారు.


కొందరు మాస్క్‌లు ధరించకపోవడం.. మరికొందరు భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో పాజిటివ్‌ కేసులు పెరగడంతో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో పాజిటివ్‌ కేసులు వెయ్యి దాటి.. రెండు వేలకు చేరవవుతున్నాయి. శుక్రవారం 115 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1662కు చేరింది. మందసలో ఒకరిని, సోంపేటలో మరొకరు, పలాసలో ఇద్దరిని ఇప్పటికే మహమ్మారి పొట్టన పెట్టుకుంది. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపించగానే చాలామంది పరీక్షల కోసం ఎగబడుతున్నారు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో అనేక మంది మహమ్మారి కోరల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 


మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా....

జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు సైతం హైరానా పడుతున్నారు. ఇదేవిధంగా మరికొన్ని రోజుల పాటు కేసులు వస్తే, బాధితులకు బెడ్‌లు కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందుగా అంచనా వేస్తూ జిల్లాలో అన్‌లాక్‌-2 ను క్రమంగా ఎత్తివేయాలని యోచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ చేపట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 72 కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.


తాజాగా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలోనూ శుక్రవాం నుంచి ఆంక్షలు విధించారు. కేసులు పెరుగుతున్న తరుణంలో మళ్లీ లాక్‌ డౌన్‌ పాటించాల్సిన అవసరం ఉందనే సంకేతాలు ఇస్తున్నారు. నగరంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని, మిగిలిన సమయంలో ఎవరూ బయటకు రావద్దంటూ ప్రకటించారు. దీంతో నగరంలో జీటీ రోడ్డు, మార్కెట్‌ సెంటర్‌, గుజరాతీపేట, రామలక్ష్మణ జంక్షన్‌, పెదపాడు రోడ్డులోని దుకాణాలన్నీ మధ్యాహ్నం ఒంటి గంటకే మూసేశారు. మందులు, పండ్ల దుకాణాలు తప్ప అన్ని బంద్‌ అయ్యాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టే వరకూ ఆంక్షలు కొనసాగనున్నాయి. 

Updated Date - 2020-07-11T11:36:20+05:30 IST