పోతారం ఎత్తిపోతలకు అడుగులు

ABN , First Publish Date - 2022-05-28T05:23:51+05:30 IST

పోతారం ఎత్తిపోతల పథకానికి అడుగులు పడుతున్నాయి.

పోతారం ఎత్తిపోతలకు అడుగులు
కలెక్టరేట్‌కు ర్యాలీగా తరలివస్తున్న రైతులు, నాయకులు(ఫైల్‌)

- రూ.320 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు

- 30వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రణాళికలు

- త్వరలో నిధులు మంజూరయ్యే అవకాశాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పోతారం ఎత్తిపోతల పథకానికి అడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మంథని ప్రాంత భూములకు సాగునీటిని అందించేందుకు ఈ పథకాన్ని ప్రతిపాదించారు. కొన్ని రోజులుగా ఈ పథకాన్ని చేపట్టి మంథని ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని సుమారు 37 లక్షల ఎకరాల భూములకు సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం సుమారు లక్షా 25వేల కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో గోదావరి నదిపై సిరిపురం సమీపంలో సరస్వతి పంప్‌హౌస్‌, పార్వతి బ్యారేజీని నిర్మించారు. అలాగే అంతర్గాం మండలం గోలివాడ వద్వ పార్వతి పంప్‌హౌస్‌ను నిర్మించారు. మేడిగడ్డ నుంచి సరస్వతి(అన్నారం) బ్యారేజీలోకి, అక్కడి నుంచి పార్వతి(సుందిళ్ల) బ్యారేజీలోకి, అక్కడినుంచి శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోసేందుకు మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌస్‌లను నిర్మించారు. ధర్మారం మండలం నందిమేడారం వద్ద చెరువు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అండర్‌ టన్నెళ్ల నిర్మాణం, అందులోనే పంప్‌హౌస్‌, సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, కాలువలకు తమ భూములను త్యాగం చేసిన ఈప్రాంత రైతుల భూములకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీటిని ఇవ్వడం లేదు. ప్రాజెక్టు డీపీఆర్‌లో మాత్రం మంథని ప్రాంతంలోని మంథని, రామగిరి, కమాన్‌పూర్‌, ముత్తారం మండలాల్లోని భూములకు 30 వేల ఎకరాల భూములకు సాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. సుందిళ్ల వద్ద గల పార్వతి బ్యారేజీ నీటిని ఎత్తిపోసేందుకు పోతారం ఎత్తిపోతల పథకాన్ని చేపడుతామని ప్రభుత్వం పేర్కొన్నది. 

ప్రాజెక్టు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా..

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా కూడా ప్రభుత్వం పోతారం ఎత్తిపోతల పథకం ఊసెత్తడంలేదు. ఈ పథకాన్ని చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ‘పోతారం ఎత్తిపోతల సాధన సమితి’ పేరిట పలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబర్‌ 2వ తేదీన మంథని నుంచి పెద్దఎత్తున రైతులు ట్రాక్టర్లలో పెద్దపల్లి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గోదావరి నదికి ఇరువైపులా ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి సాగు నీరందించేందుకు నిధులను మంజూరు చేసిన ప్రభుత్వం పోతారం ఎత్తిపోతలకు ఇంకా నిధులు మంజూరు చేయలేదు. దీంతో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ నిధుల మంజూరు కోసం ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకవచ్చారు. మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురిని ఆయన కలిశారు. ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలను వేగంగా రూపొందించేలా సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులపై ఒత్తిడి తీసుకరావడంతో కొద్దిరోజుల క్రితం అంచనాలను తయారుచేశారు. మంథని ప్రాంతంలోని ఎస్సారెస్పీ డి-83 కింద గల 22 వేల ఎకరాల భూములను స్థిరీకరించడంతో పాటు కొత్తగా మరో 8 వేల ఎకరాల భూములకు సాగునీటిని అందించేందుకు 320కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి అందజేశారు. దీనిని పరిశీలించిన ఉన్నతాధికారులు అందులో కొన్ని చేర్పులు, మార్పులను చేయాలని సూచించడంతో ఆ పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక మెయిన్‌ పంప్‌హౌస్‌తో పాటు కొన్ని చిన్నచిన్న పంపులు, పైపులైన్ల ద్వారా ఎస్సారెస్పీ కాలువలకు అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ విషయమై రామగుండం డివిజన్‌ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడుతూ పోతారం ఎత్తిపోతల పథకంపై అంచనాలను రూపొందించి పది రోజుల క్రితమే ప్రభుత్వానికి సమర్పించామన్నారు. అందులో చేర్పులు, మార్పులు కూడా చేశామన్నారు. త్వరలోనే ప్రభుత్వం నిధులు మంజూరుచేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

Updated Date - 2022-05-28T05:23:51+05:30 IST