‘గిరి’ సంస్కృతికి పునరుజ్జీవం

ABN , First Publish Date - 2022-05-13T19:53:49+05:30 IST

అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు, కళలను కాపాడేందుకు గిరిజన సంక్షేమ శాఖ, భద్రాచలం ఐటీడీఏ చర్యలు చేపడుతున్నాయి. భద్రాచలం ఐటీడీఏ ఏర్పడి

‘గిరి’ సంస్కృతికి పునరుజ్జీవం

-ఆదివాసీ సంప్రదాయాల పరిరక్షణకు అడుగులు

-ఐటీడీఏ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ

-నూతన విద్యా సంవత్సరంలో ప్రారంభం

భద్రాచలం: అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు, కళలను కాపాడేందుకు గిరిజన సంక్షేమ శాఖ, భద్రాచలం ఐటీడీఏ చర్యలు చేపడుతున్నాయి. భద్రాచలం ఐటీడీఏ ఏర్పడి ఐదు దశాబ్దాలు కావ స్తున్న నేపధ్యంలో ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రస్తుత తరం వారికి తెలిపేందుకు వీలుగా తొలిసారిగా చీఫ్‌ డ్యాన్స్‌మాస్టర్‌ పోస్టును ఏర్పాటు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు స్వీకరించిన రామచంద్రయ్యను ఈ పోస్టులో ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ నియమించారు. భద్రాచలం ఏజెన్సీలోని కీలక మండలాలైన చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు ఏపీ పరిధిలోకి వెళ్లడంతో ఇటీవలి కాలంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై పరోక్షంగా ఆ ప్రభావం పడుతోంది. దాంతో ఆదివాసీ సంప్రదాయ నృత్యాలైన రేలా, కొమ్ము తదితర నృత్యాలను ఈ తరం వారికి అందించాలని గిరిజన సంక్షేమ శాఖ, భద్రాచలం ఐటీడీఏ సంకల్పించింది. ఇందుకోసం సంప్రదాయ నృత్య రీతులపై పట్టుకలిగిన 30మంది వాలంటీర్లను గుర్తించింది. వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.  

                                   కొత్త విద్యా సంవత్సరంలో శ్రీకారం 

గిరిజన విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు నూతన విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ నృత్య సంప్రదాయాలు, సంస్కృతులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో భాష పరిరక్షణకు సైతం కృషి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే అంకంపాలెం, కిన్నెరసాని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఇప్పటికే వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. నూతన విద్యా సంవత్సరం ఆరంభమైన తరువాత ఈ నృత్యాలను ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచి నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందుకోసం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టియానా జెడ్‌ చాంగ్తో, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాదేవిలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాలను చీప్‌ డ్యాన్స్‌ మాష్టర్‌గా నియమితులైన పద్మశ్రీ రామచంద్రయ్య, గిరిజన సాంస్కృతిక విభాగం మేనేజర్‌ వీరస్వామి పర్యవేక్షించనున్నారు.  

                                  గిరిజన మ్యూజియం నిర్మాణంపై దృష్టిసారించాలి

పర్యాటకులను ఆకట్టుకునేలా ఆదివాసీ జీవనశైలికి దర్పణంపట్టే గిరిజన మ్యూజియాన్ని నూతనంగా నిర్మించాలని గిరిజన సంఘాల నాయకులు ఆకాంక్షిస్తున్నారు. గతంతో పోలిస్తే భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో గత ఏడాది ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం ఆకట్టుకుంటున్నా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు సందర్శించేందుకు అవకాశం లేదని వారు పేర్కొంటున్నారు. రామాలయ సమీపంలో లేదా ఆర్‌అండ్‌బీ ఈఈ పాత కార్యాలయం పరిసరాల్లో మ్యూజియం ఏర్పాటు చేస్తే పర్యాటకులను ఆకట్టుకునేందుకు అవకాశముంటుందున్నారు. వాస్తవానికి గిరిజన మ్యూజియాన్ని గోదావరి తీరంలో రామాలయం సమీపంలో నిర్మించాలనే యోచన పదిహేనేళ్ల క్రితం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఆ సమయంలో అంగీకారం తెలిపినా ఆ ప్రయత్నం ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపధ్యంలో ఈసారైనా పర్యాటకులను ఆకట్టుకునేలా గిరిజన మ్యూజియం నిర్మాణం చేపట్టాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. 

గిరిజన సంస్కృతి రక్షణకు మ్యూజియం అవసరం

- పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే

భద్రాచలం ఏజెన్సీలోని ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలంటే గిరిజన మ్యూజియాన్ని విశాలమైన స్థలంలో పర్యాటకులు సంచరించే ప్రాంతంలో నిర్మిస్తే సముచితంగా ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుంది. గతంలో సైతం ఈ ప్రతిపాదన ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం, అధికారులు ఇందుకు సంబంధించి చర్యలను చేపడితే ఏజెన్సీలోని ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు మరింత పరిపూర్ణత వస్తుంది.  


Read more