బైపాస్‌కు అడుగులు

ABN , First Publish Date - 2020-05-25T09:24:40+05:30 IST

విజయవాడ బైపాస్‌లో భాగంగా మూడుచోట్ల ఫ్లై ఓవర్ల పనులను, 45కు పైగా కల్వర్టులను నిర్మించాల్సి ఉంది.

బైపాస్‌కు అడుగులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

విజయవాడ బైపాస్‌లో భాగంగా మూడుచోట్ల ఫ్లై ఓవర్ల పనులను, 45కు పైగా కల్వర్టులను నిర్మించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి గన్నవరం-నూజివీడు మార్గంలో మార్కెట్‌ యార్డు దగ్గర ఫ్లై ఓవర్‌ దిగువన బీబీ గూడెం సమీపంలో పంట పొలాల్లో సాయిల్‌ టెస్ట్‌ పనులను ప్రారంభించారు. ఇక్కడ ప్రధాన ఫ్లై ఓవర్‌ను నిర్మించాల్సి ఉంది. గన్నవరం - ఆగిరిపల్లి మార్గంలో ఆరు వరసల విజయవాడ బైపాస్‌ క్రాస్‌ అవుతుంది. గన్నవరం - నూజివీడు మార్గం గన్నవరం శివారులో రైల్వేస్టేషన్‌ ఉంది. ఈ రోడ్డుపై ఉన్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే ట్రాక్స్‌ మీదుగా గతంలో ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. దీనికి క్రాస్‌గా విజయవాడ బైపాస్‌మార్గంలో మరో ఆరు వరసల ఫ్లైఓవర్‌ను నిర్మించాల్సి ఉంది. దీనికోసమే ప్రస్తుతం సాయిల్‌టెస్ట్‌ పనులు చేపడుతున్నారు.


ఈ ప్రాజెక్టుకు పదేళ్ల క్రితమే కాజ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో భాగంగా భూమిని సేకరించారు. రైతులందరికీ  పరిహారం కూడా చెల్లించారు. అప్పట్లో బీవోటీ విధానంలో కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు ఒకే ప్యాకేజీగా ఉండేది. 58 కిలోమీటర్ల విజయవాడ బైపాస్‌ నాలుగు వరసలుగా ఉండేది. బీఓటీ విధానంలో టెండర్లను దక్కించుకున్న గామన్‌ ఇండియా సంస్థను రద్దు చేసిన తర్వాత..  గత ప్రభుత్వ హయాంలో ఆరు వరసలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.


బీవోటీ విధానాన్ని రద్దుచేసి ఈపీసీ విధానంలో ఒకే ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా విభజించిన తర్వాత విజయవాడ బైపాస్‌ను ఆరు వరసల్లో నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ ప్రాజెక్టుకు కొద్దికాలం క్రితమే టెండర్లు పిలిచారు. కాంట్రాక్టును దక్కించుకున్న మెగా సంస్థ అలైన్‌మెంట్‌తో పాటు, సాయిల్‌ టెస్ట్‌ పనులను చేపట్టింది. ప్రస్తుతం  బీబీ గూడెం దగ్గర ప్రధాన ఫ్లైఓవర్‌కు సంబంధించి సాయిల్‌టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై చిన అవుటపల్లి నుంచి విజయవాడ బైపాస్‌ మొదలవుతుంది.


ఇది గన్నవరం బయట నుంచి కొండపావులూరు, ముస్తాబాద, సూరంపల్లి, నున్న మార్గంలో సూరాయపాలెం వరకు అర్ధ చంద్రాకారంలో తిరుగుతూ 65వ నెంబర్‌ జాతీయ రహదారిని తాకుతూ కృష్ణానది మీద నిర్మించే ఆరు వరసల బ్రిడ్జికి అనుసంధానమవుతుంది. 


కృష్ణా బ్రిడ్జి అలైన్‌మెంట్‌, జియోగ్రాఫికల్‌ సర్వే ముమ్మరం 

ప్యాకేజీ-4లో కృష్ణానదిపై ఆరు వరసల బ్రిడ్జి నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థ ‘నవయుగ’ జియోగ్రాఫికల్‌ సర్వే, బ్రిడ్జి అలైన్‌మెంట్‌ పనులను ముమ్మరం చేసింది. కొద్దికాలం క్రితం నవయుగ, అదాని సంయుక్తంగా ఈ టెండర్‌ను దక్కించుకున్నాయి. జాయింట్‌ వెంచర్‌ అయినప్పటికీ నవయుగ సంస్థ ఈ ప్రాజెక్టు పనులన్నింటినీ పర్యవేక్షిస్తోంది. 

Updated Date - 2020-05-25T09:24:40+05:30 IST