ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి అడుగులు

ABN , First Publish Date - 2021-01-25T06:33:50+05:30 IST

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనులకు ఎట్టకేలకు అడుగులు పడ్డాయి.

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి అడుగులు

పర్యావరణ అనుమతులతో రంగంలోకి కాంట్రాక్టు సంస్థలు 

సైట్‌ క్లియరెన్స్‌ చేపట్టిన ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ ‘స్టుప్‌’ 

రూ.513 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మాణం 


(ఆంధ్రధజ్యోతి, విజయవాడ) : ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనులకు ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. విజయవాడ విమానాశ్రయంలో విదేశీ, స్వదేశీ ప్రయాణికులు సంయుక్తంగా ఉపయోగించుకునే అతి పెద్ద భారీ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి సైట్‌ క్లియరెన్స్‌ పనులను ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ) స్టుప్‌ చేపడుతోంది. టెండర్లు పిలిచినా ఏడాది కాలంగా అడుగు ముందుకు పడకపోవటానికి ప్రధాన అవరోధంగా ఉన్న పర్యావరణ అనుమతుల లెక్క తేలడంతో.. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం పీఎంసీగా స్టుప్‌ను ఎంపిక చేసింది. మరోవైపు పనులు ప్రారంభించటానికి కాంట్రాక్టు సంస్థ ఎన్‌కేజీ గ్రూప్‌ కూడా రంగంలోకి దిగింది. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ డిజైన్లను స్టుప్‌ ఫైనలైజ్‌  చేసింది. టెండర్లను ఎన్‌కేజీ గ్రూపు దక్కించుకుంది. త్వరలో పనులు చేపట్టడానికి సిద్ధమవుతోంది. ఒక పక్క సైట్‌ క్లియరెన్స్‌ పనులను స్టుప్‌ చేపడుతుండగా.. కాంట్రాక్టు సంస్థ గ్రౌండ్‌ ప్రిపరేషన్‌ చేసుకుంటోంది. 


35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను నిర్మించనున్నారు. పూర్తిగా స్టీల్‌ అండ్‌ గ్లాస్‌ స్ట్రక్చర్‌లో నిర్మితమవుతున్న ఈ బిల్డింగ్‌ లోపలి భాగాన్ని కృష్ణాజిల్లాలోని గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా డిజైన్‌ చేశారు. అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ టెర్మినల్‌ బిల్డింగ్‌ నుంచి గంటకు 1200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. మొత్తం 24 చెకిన్‌ కౌంటర్స్‌ ఏర్పాటు చేస్తారు. విమానాశ్రయ ఆవరణలో సువిశాలమైన కార్‌ పార్కింగ్‌ను అభివృద్ధి చేస్తారు. కొత్త ఆఫ్రాన్‌లో మూడు కోడ్‌ ఈ విమానాలు, ఆరు కోడ్‌ సీ విమానాలు పార్కింగ్‌ చేసుకునే సామర్ధ్యం ఉంటుంది. బిల్డింగ్‌ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దటానికి వీలుగా పూర్తిగా ఎల్‌ఈడీ లైటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. లో వీఓసీ పెయింట్స్‌ను మాత్రమే ఉపయోగించ నున్నారు. డబుల్‌ ఇన్సులేటెడ్‌ పైకప్పులను నిర్మించనున్నారు.

Updated Date - 2021-01-25T06:33:50+05:30 IST