సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-27T04:58:35+05:30 IST

పత్తి రైతులకు సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం సహకారం అందిస్తూ రొటేషన్‌ పద్ధతిలో సిబ్బందిని నియమించి చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ అన్నారు.

సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
జిన్నింగ్‌లో పత్తిని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 26: పత్తి రైతులకు సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం సహకారం అందిస్తూ రొటేషన్‌ పద్ధతిలో సిబ్బందిని నియమించి చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ అన్నారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి విక్రయాల తీరును ఆయన పరిశీలించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా జిల్లా యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తేమ కొలిచే శాతంలో వ్యత్యాసం వస్తుందని పలువురు రైతులు తమ దృష్టికి తీసుకురాగా  సమర్థవంతంగా పనిచేసే తేమ కొలిచే యంత్రాలను పని చేసేలా చూడాలని, ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా సక్రమంగా కొలవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఐకేపీ, రెవెన్యూ, మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖల సిబ్బందితో టీమ్‌లను ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా స్థానికంగా మార్కెట్‌ వెనకాల ఉన్న జిన్నింగ్‌లో రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేలా ఏర్పాటు చేసిన టీమ్‌ సిబ్బందిని పనితీరును ఆయన పరిశీలించారు.

అధికారులు సహకరించాలి..

వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు అందుబాటులో ఉండి అన్నివిధాల సహకారాలు అందించాలని అదనపు కలెక్టర్‌ నటరాజ్‌ అన్నారు. మార్కెట్‌ సమావేశ మందిరంలో మంగళవారం అధికారులతో, ప్రత్యేక టీమ్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.  మొదటి రోజు 10వేల 871 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు తీసుకు రావడం జరిగిందని ఇందులో 75శాతం పత్తి 8 నుంచి 12శాతం కలిగి ఉండగా మిగితా 25 శాతం 13 శాతం కన్న పైన కలిగి పత్తి తేమతో ఉందని తెలిపారు. ఇటువంటి సందర్భంలో రైతులను సిబ్బంది సహకారంగా ఉండాలన్నారు. అంతకు ముందు గణేష్‌ జిన్నింగ్‌ మిల్లులో తేమ కొలిచే విధానం, పత్తి తూకం వేసే యంత్రాన్ని, ప్రెస్సింగ్‌యూనిట్‌, పత్తి నుంచి గింజలు వేరు చేసే విధానాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌తో కలిసి పరిశీలించారు. ఇందులో జిల్లా మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌, డీఎస్‌వో సుదర్శన్‌, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T04:58:35+05:30 IST