పీఆర్సీపై దశలవారీ ఉద్యమం

ABN , First Publish Date - 2022-01-24T05:46:43+05:30 IST

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో దశల వారీ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు జేఏసీ తూర్పుకృష్ణా చైర్మన్‌ ఉల్లి కృష్ణ అన్నారు.

పీఆర్సీపై దశలవారీ ఉద్యమం
సమావేశంలో మాట్లాడుతున్న జేఏసీ తూర్పుకృష్ణా చైర్మన్‌ ఉల్లి కృష్ణ

జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

మచిలీపట్నం టౌన్‌, జనవరి 23 : పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో దశల వారీ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు జేఏసీ తూర్పుకృష్ణా చైర్మన్‌ ఉల్లి కృష్ణ అన్నారు. ఎన్జీవో హోమ్‌లో ఆదివారం 42 సంఘాల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉల్లి కృష్ణ మీడియాతో మాట్లాడారు. 25న మచిలీపట్నం కోనేరు సెంటర్‌ నుంచి ధర్నా చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నాచౌక్‌లో సమావేశం నిర్వహిస్తామన్నారు. 26న తాలూకా ప్రధాన కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రం అందజేత, 27 నుంచి 30వ తేదీ వరకు జిల్లా ప్రధాన కేంద్రం, తాలూకా ప్రధాన కేంద్రాల వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలకు కూర్చుంటామన్నారు. ఫిబ్రవరి 2న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామన్నారు. ఫిబ్రవరి 5న పెన్‌డౌన్‌, అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే 7 నుంచి సమ్మెలోకి దిగుతామని తెలిపారు. ప్రభుత్వం 11వ పీఆర్సీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు తీరని అన్యాయం చేసిందన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. వీటన్నింటినీ సీఎం జగన్‌ నెరవేరలేదన్నారు. పింఛనుదారులకు క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ను పునరుద్ధరించాలని, తగ్గించిన హెచ్‌ఆర్‌ఏను యథావిధిగా ఉంచాలని డిమాండ్‌ చేశారు. ఐఆర్‌ కన్నా తక్కువగా ఫిట్‌మెంట్‌ 23 శాతం చేయడం అన్యాయమన్నారు. సమావేశంలో అమరావతి జేఏసీ చైర్మన్‌ నిల్సన్‌పాల్‌, ఏపీజీఈఏ అధ్యక్షుడు పి.రాము, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ రాజేంద్రప్రసాద్‌,  జేఏసీ కన్వీనర్‌ దారపు శ్రీనివాస్‌,  ఎన్జీవోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకూరి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవోల సంఘం తూర్పుకృష్ణా జిల్లా కార్యదర్శి పి.వి. సాయికుమార్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు లెనిన్‌బాబు, ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకులు తమ్ము నాగరాజు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ప్రసాద్‌, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కిషోర్‌కుమార్‌, సీఐటీయూ నాయకులు రవి, ఏపీ ట్రెజరీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు, డీపీఆర్‌టీయూ  జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్లు, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన చంటి, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఎస్‌టీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ సునీల్‌, ఏపీఎ్‌సఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి రాజేష్‌, నర్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కె.గౌరీ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎ.వి.రమణి పాల్గొన్నారు.

 


Updated Date - 2022-01-24T05:46:43+05:30 IST