స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచన దుర్మార్గం

ABN , First Publish Date - 2021-06-14T05:31:49+05:30 IST

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచన దుర్మార్గం
ఉక్కు ఉద్యోగుల దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న డి.ఆదినారాయణ

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, జూన్‌ 13: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు 122వ రోజు కొనసాగాయి.  ఆదివారం ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చున్న ఏఐటీయూసీ కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం 2004-05లో రూ.2,008 కోట్లు నికర లాభం సాధించిన సంస్థ అని, మూడేళ్ల క్రితం  రూ.20,800 కోట్లు టర్నోవర్‌ సాధించిందని వివరించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తే వేలాది మంది ఉద్యోగులు, పరోక్షంగా ఆధారపడి ఉన్న కుటుంబాలు, భూములు ఇచ్చిన నిర్వాసితుల జీవితాలు అంధకారం అవుతాయన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేకపోవటం వల్లనే ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయి నష్టాలు వస్తున్నాయని, ఆ నష్టాల బూచిని చూపి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడం తగదన్నారు. ఈ దీక్షలలో పోరాట కమిటీ నాయకులు గంధం వెంకటరావు, కె.సత్యనారాయణ, ఎన్‌.రామారావు, వై.టి.దాస్‌, శ్రీనివాసరాజు, మురళీరాజు, సంపూర్ణం, జె.రామకృష్ణ, దొమ్మేటి అప్పారావు, రామ్మోహన్‌, శ్రీనివాస్‌, శివ, బాబూరావు, ప్రసాద్‌, గోపి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-14T05:31:49+05:30 IST