Abn logo
Sep 22 2021 @ 00:59AM

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలి

పాదయాత్రలో పాల్గొన్న బినోయ్‌ విశ్వం, ఇతర నాయకులు

సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి బినోయ్‌ విశ్వం డిమాండ్‌

జింక్‌ గేటు నుంచి కూర్మన్నపాలెం వరకు మహా పాదయాత్ర

గాజువాక, సెప్టెంబరు21: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని, దీన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగించాలని సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వం డిమాండ్‌ చేశారు. ఈ నెల 27న తలపెట్టనున్న భారత్‌ బంద్‌కు మద్దతుగా  సీపీఐ, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో  మంగళవారం హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ గేటు నుంచి కూర్మన్నపాలెం జంక్షన్‌ వరకు పాదయాత్ర నిర్వహించాయి. ఈ సందర్భంగా పాతగాజువాక జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో బినోయ్‌ విశ్వం మాట్లాడుతూ వ్యూహాత్మక పెట్టుబడులు అంటూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి కేంద్రం సిద్ధపడుతున్నదన్నారు. గతంలో హిందూస్థాన్‌ జింక్‌ను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు వీలులేదని రాజ్యసభలో గొంతెత్తుతామన్నారు.  సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ   స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టి  ఒత్తిడి తెస్తామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం భూములు కోల్పోయిన ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఈ నెల 27న తలపెట్టిన భారత్‌బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర నిర్ణయాన్ని నిలువరించాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు  జె.అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, వై.మస్తానప్ప తదితరులు పాల్గొన్నారు. 

భారీగా సాగిన పాదయాత్ర

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఐ, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మంగళవారం నిర్వహించిన మహా పాదయాత్ర భారీ స్థాయిలో సాగింది. హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ గేటు నుంచి కొత్తగాజువాక, థియేటర్ల జంక్షన్‌, పాతగాజువాక, శ్రీనగర్‌ మీదుగా కూర్మన్నపాలెం జంక్షన్‌ వరకు కొనసాగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగించాలి, ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలి వంటి నినాదాలతో హోరెత్తించారు.